చెరువమ్మ ఎదలోన ఒదిగిపోతానంటూ సిద్ధమైంది సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-14T06:14:30+05:30 IST

బతుకమ్మ సంబురాల్లో కీలకమైన సద్దుల బతుకమ్మకు జిల్లా ముస్తాబైంది. తొమ్మిదో రోజైన గురువారం జరుపుకొనే ఈ వేడుకకు మహిళలు సిద్ధమయ్యారు.

చెరువమ్మ ఎదలోన ఒదిగిపోతానంటూ సిద్ధమైంది సద్దుల బతుకమ్మ

 పెద్ద బతుకమ్మకు సర్వం సిద్ధం 

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

పల్లెల్లో పండుగ సందడి

మోత్కూరు, అక్టోబరు 13: బతుకమ్మ సంబురాల్లో కీలకమైన సద్దుల బతుకమ్మకు జిల్లా ముస్తాబైంది. తొమ్మిదో రోజైన గురువారం జరుపుకొనే ఈ వేడుకకు మహిళలు సిద్ధమయ్యారు. పోటీలు పడి ఎత్తయిన బతుకమ్మలు పేర్చడానికి మహిళలతోపాటు వారి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పండుగ రోజున అడవికి వెళ్లి తంగేడు, కామంచ, గునుగు, ముత్యాల, టేకుపూలు సేకరించనున్నారు. కొందరైతే బుధవారమే బంతి, చామంతి పూలు కొనుగోలు చేశారు. గునుగు, ముత్యాల పూలు తెచ్చి రంగులు అద్ది పెట్టుకున్నారు.  


అమ్మగారింటికి ఆడపడుచులు

పండుగల్లో పెద్దదైన దసరా వేడుకలకు ఆడపడుచులు అమ్మగారింటికి చేరుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారు, చదువుకొనే వారికి సెలవులు ఇవ్వడంతో అందరూ ఇళ్లకు చేరారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.  అదేవిధంగా సద్దుల బతుకమ్మను ప్రాంతాలను బట్టి ఒక్కో రోజు నిర్వహిస్తారు. కొందరు ఏడు రోజులకు, మరికొందరు దుర్గాష్టమి రోజున, ఇంకొందరు తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. గుండాలలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకొన్నారు. భువనగిరి జిల్లాకేంద్రంతోపాటు కొన్ని గ్రామాల్లో బుధవారం నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో గురువారం సద్దుల బతుకమ్మను నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-10-14T06:14:30+05:30 IST