సద్దుల బతుకమ్మకు వేళాయే..

ABN , First Publish Date - 2021-10-14T06:28:00+05:30 IST

సద్దుల బతుకమ్మకు వేళాయే..

సద్దుల బతుకమ్మకు వేళాయే..
వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులో పూలు కొనుగోలు చేస్తున్న మహిళలు

9 రోజుల వేడుకకు నేటితో తెర

ముస్తాబైన చెరువు కట్టలు, మైదానాలు

పూల కొనుగోళ్లతో కిక్కిరిసిన ప్రధాన కూడళ్లు 

తరలిరానున్న మహిళాలోకం

ఇంటింటా పూలజాతర సందడి 


హనుమకొండ కల్చరల్‌/వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 13 : తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు వేడుకకు రంగం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పా టు ఆట పాటలతో కొనసాగిన బతుకమ్మ పర్వంలో ప్రధాన ఘట్టమైన సద్దుల పర్వాన్ని మహిళా లోకం జిల్లా  వ్యాప్తంగా గురువారం జరుపుకునేందుకు సిద్ధమైంది.  తొలిరోజు ఎంగిలి పువ్వులతో బతుకమ్మను తయారుచేయగా చివరిరోజు తీరొక్క పూలతో పెద్ద సైజుల్లో సద్దుల బతుకమ్మను రూపొందిస్తారు. పైన పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ప్రతిష్ఠించి ఆట పాటలతో బతుకమ్మలకు నీరాజనాలు అందిస్తారు. తమ కష్టాలను దూరం చేసి సుఖ శాంతులను ఇవ్వాలని కో రుతూ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇంట్లో తయారు చేసి పట్టుకు వచ్చిన నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుంటారు. 


విస్తృత ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నగర పాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ విస్తృత ఏర్పాట్లు చేశాయి. నగరంలో నిమజ్జనం కోసం 52 ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో విద్యుత్‌ దీపాలను అమర్చారు. మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం తదితర సౌకర్యాలను కల్పించారు. వరంగల్‌ పోతన నగర్‌, భద్రకాళి ప్రాంతం, హనుమకొండలోని పద్మాక్షి ఆలయం, ఉర్సు రంగలీల మైదానం, ఖిలా వరంగల్‌, ఓసిటీ, వడ్డెపెల్లి చెరువు, బంధం చెరువు కట్టలు తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో మహిళలు పాల్గొనే ఆచారం ఉన్న క్రమంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బతుకమ్మలను నీటిలో నిమజ్జం చేసేందుకు వీలుగా చెరువు కట్టల వద్ద వలంటీర్లను నియమించారు. 

వరంగల్‌ నగర పాలక సంస్థ మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ ప్రావీణ్య, వివిధ ప్రభుత్వ  శాఖల అధికారులు బతుకమ్మ నిమజ్జన ప్ర దేశాలను సోమవారం సందర్శించి పలు సూచనలు చేశారు. సద్దుల బతుకమ్మ వే డుకలకు పోలీసు యంత్రాంగం పక్షాన విస్తృత బందోబస్తు చేపట్టారు. విశ్వహిం దూ పరిషత్‌ , సంస్కార భారతిలు నగరంలో బతుకమ్మల అలంకరణ, పాటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నారు. 


ఫలహారాల సందడి

పండుగ సందర్భంగా వివిధ పొడులతో చేసే ఫలహారాలు సందడి చేస్తాయి. పూలదేవత బతుకమ్మకు తెలంగాణలోని రకరకాల ఫలహారాలు నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈ ఫలహారాల్లో సత్తుపిండి, సౌడిపిండి, పల్లి, నువ్వుల, కొబ్బరితో వంటలు, బెల్లం, నువ్వుల పట్టీలు, చపాతీలు-బెల్లం లడ్డూలతో పాటు సద్దులైన ఆవ, కొబ్బరి, పులుపు, ఇతర పులిహోర, పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ రోజున సద్దులను (ఫలహారాలు)ను నైవేద్యంగా తీసుకెళ్లి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా అందజేస్తారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం అందులో ఏర్పాటు చేసిన పసుపు గౌరమ్మను వాయినాలుగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. సద్దులు, దసరా పండుగ వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు సొంతూళ్లకు చేరుకుంటారు. కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, బంధుమిత్రుల రాకతో ఇళ్లల్లో ్లసందడి నెలకొంది.  


మార్కెట్లు కిటకిట

నగరంలో ప్రధాన వ్యాపార కూడళ్లయిన చౌరస్తాల్లో, ప్రధాన రహదారులపైన ఎక్కడ చూసినా  సద్దుల బతుకమ్మ హడావుడే కనిపించింది. తంగేడు పువ్వుకు డిమాండ్‌ పెరిగింది. అన్ని రకాల పూల ధరలకు రెక్కలు వచ్చాయి. అయినా సద్దుల బతుకమ్మ పర్వం పుణ్యమా అని ఆచారాన్ని వదులుకోలేక ఎంత ధర అయినా పెట్టి కొనుగోలు చేశారు. మార్కెట్లు, ప్రధాన కూడళ్ళు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. చుట్టు పక్కల పల్లెల నుంచి వచ్చిన అమ్మకం దారులు తంగేడు, గునుగు, తామర, గుమ్మడి, బంతి, చామంతి మొదలైన పువ్వులను రాసులు పోసి అమ్మారు.  

వరంగల్‌ ప్రాంతంలోని స్టేషన్‌రోడ్డు, చౌరస్తా, జేపీఎన్‌ రోడ్డు, పోచమ్మమైదాన్‌, పాపయ్యపేట చమన్‌, బట్టలబజార్‌, మండిబజార్‌, దేశాయిపేట, కాశిబుగ్గ ప్రాంతాల్లో, హన్మకొండలోని చౌరస్తా, అదాలత్‌ జంక్షన్‌, న యీంనగర్‌, పబ్లిక్‌గార్డెన్‌, వడ్డెపల్లి క్రాస్‌రోడ్డు, కాజీపేట జంక్షన్‌ ప్రాంతాల్లో  పూల అమ్మకాలు జో రుగా సాగాయి. తంగేడు, గునుగు, గుమ్మడి, గోరింట, బంతి, చామం తి, మందార, గులాబీ పూల దుకాణాలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-10-14T06:28:00+05:30 IST