Abn logo
Sep 20 2021 @ 17:59PM

మాది 'బి టీమ్' అయితే రాహుల్ ఎలా ఓడారు?: ఒవైసీ

అహ్మదాబాద్: బీజేపీకి తమ పార్టీ 'బి టీమ్' అంటూ వస్తున్న ఆరోపణలను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తోసిపుచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి ఏఐఎంఐఎం పోటీ చేయనప్పటికీ రాహుల్ గాంధీ ఎందుకు ఓడిపోయారో చెప్పాలని ఆయన విమర్శకులను నిలదీశారు. అహ్మదాబాద్‌లో సోమవారంనాడు మీడియాతో ఒవైసీ మాట్లాడుతూ, కాంగ్రెస్ తమకు తోచినట్టుగా ఏఐఎంఐఎంను 'ఎ టీమ్, బీ టీమ్, ఓట్లు చీల్చే పార్టీ' అన్నట్టుగా భావిస్తోందన్నారు. అమేథీ కాంగ్రెస్‌కు సంప్రదాయబద్ధమైన నియోజకవర్గమైనప్పటికీ, అక్కడ ఎంఐఎం అభ్యర్థిని పోటీలో దింపనప్పటికీ రాహుల్ ఓడిపోయారని, అదే మైనారిటీలు 35 శాతం ఉన్న వయనాడ్‌ నుంచి ఆయన గెలిచారని ఒవైసీ గుర్తుచేశారు. కాంగ్రెస్ ఏమనుకుంటోందనేది తనకు ముఖ్యం కాదని, ఏఐఎంఐఎం అంటే ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఒవైసీని 'చాచా జాన్', బీజేపీ 'బి టీమ్' అంటూ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ ఇటీవల విమర్శలు చేసిన నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా, వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తుందని ఏఐఎంఐఎం ఇప్పటికే ప్రకటించింది. ఓం ప్రకాష్ రాజ్‌భర్ సారథ్యంలోని భాగీదారీ సంకల్ప్ మోర్చా (బీఎస్ఎం)తో మినహా వేరేవరితోనూ తమకు పొత్తు ఉండదని తేల్చిచెప్పింది.

ఇవి కూడా చదవండిImage Caption