క్షేమంగా ఇంటికి..

ABN , First Publish Date - 2020-05-27T10:13:18+05:30 IST

రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపొయి. పంజాబ్‌ రాష్ట్రం లూథియానాలో భిక్షాటన చేస్తూ టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైన వ్యక్తి

క్షేమంగా ఇంటికి..

రెండేళ్ల తరువాత ఇంటికి చేరిన మూగవ్యక్తి

వారం క్రితం ‘టిక్‌టాక్‌’లో గుర్తించిన స్థానిక యువకుడు 

ఇంటికి చేర్చేందుకు సహకరించిన అధికారులు

‘ఆంధ్రజ్యోతి’కి బాధిత కుటుంబం కృతజ్ఞతలు


బూర్గంపాడు, మే 26: రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపొయి. పంజాబ్‌ రాష్ట్రం లూథియానాలో భిక్షాటన చేస్తూ టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైన వ్యక్తి మంగళవారం తమ గ్రామానికి చేరుకున్నాడు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌ గ్రామానికి చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 2108వ సంవత్సరం ఏప్రిల్‌లో పనికోసం వెళ్లి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అప్పడే పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రెండేళ్ల తరువాత వారం రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన కలసాని నాగేంద్రబాబు అనే యువకుడు టిక్‌టాక్‌లో వీడియోలు చూస్తుండగా వెంకటేశ్వర్లును గుర్తించి అతడి కుటుంబసభ్యులకు తెలిపాడు. టిక్‌టాక్‌ ఐడీ ఆధారంగా అతడు పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఈ నెల 19వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా ఎడిషన్‌లో ‘ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. పంజాబ్‌లో ప్రత్యక్షం’ అనే కథనం ప్రచురించడం జరిగింది. దాంతో స్పందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేసి వెంకటేశ్వర్లు కుమారుడు పెద్దిరాజును తండ్రి వద్దకు పంపించారు. ఈ నెల 24వ తేదీన తండ్రి వద్దకు చేరుకున్న పెద్దిరాజు తిరిగి మంగళవారం ఉదయం గ్రామానికి చేరుకున్నారు.


చాలాకాలం తర్వాత కుటుంబపెద్దను చూసిన భార్య, కుమార్తె, కుమారులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలోని వెంకటేశ్వర్లు స్నేహితులు, స్థానికులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా జగన్నాధపురం పీహెచ్‌సీ సిబ్బంది వెంకటేశ్వర్లుకు వైద్య పరీక్షలు నిర్వహించి హోమ్‌క్వారంటైన్‌ ముద్రను వేశారు. వెంకటేశ్వర్లును గ్రామానికి తీసుకువచ్చేందుకు స్థానిక జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత దంపతులు, ఎంపీటీసీ తోటమళ్ల సరిత, ఎస్‌ఐ బాలకృష్ణ సహకారం మరువలేనిదన్నారు. వెంకటేశ్వర్లు దంపతులకు జడ్పీటీసీ శ్రీలత, ఎంపీటీసీ సరిత నూతన వస్త్రాలను ఆందజేశారు. కుటుంబపెద్దను టిక్‌టాక్‌లో గుర్తించిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇంటికి చేరేలా సహకరించిన ‘ఆంధ్రజ్యోతి’కి సదరు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-05-27T10:13:18+05:30 IST