ఓటేసేటప్పుడు జర భద్రం

ABN , First Publish Date - 2020-12-01T09:17:09+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో.. బూత్‌కు వెళ్లిన ఓటర్లు కొవిడ్‌ నిబంధనలను అత్యంత జాగ్రత్తగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించాయి. పోలింగ్‌ బూత్‌కు మాస్కు ధరించి రావడం తప్పనిసరి అని..

ఓటేసేటప్పుడు జర భద్రం

మాస్కు , భౌతిక దూరం తప్పనిసరి.. బ్యాలెట్‌ను ముట్టుకున్నాక శానిటైజేషన్‌ చేసుకోండి

చేతులకు గ్లవ్స్‌ ధరించడం ఇంకా మంచిది ఓటర్లకు వైద్య, ఆరోగ్య శాఖ,ఎన్నికల సంఘం విజ్ఞప్తి

కరోనా పేషెంట్లు ఓటేసేందుకు గంట అవకాశం


హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో.. బూత్‌కు వెళ్లిన ఓటర్లు కొవిడ్‌ నిబంధనలను అత్యంత జాగ్రత్తగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించాయి. పోలింగ్‌ బూత్‌కు మాస్కు ధరించి రావడం తప్పనిసరి అని.. ఓటేసేందుకు లైన్‌లో నిలబడినప్పుడు భౌతిక దూరం పాటించాలని, బ్యాలెట్‌ను ముట్టుకున్నాక చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. చేతులకు గ్లవ్స్‌ ధరించి పోలింగ్‌ బూత్‌లకు వెళ్లడం ఇంకా మంచిదని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. కాగా.. ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్ద భౌతిక దూరం పాటించేలా ఆరడుగుల తేడాతో మార్కింగ్స్‌ వేశారు. ఓటేసేందుకు వచ్చినవారు తప్పనిసరిగా వాటిల్లోనే నిలబడి బూత్‌లోకి లైన్‌గా వెళ్లాలి. అలాగే బూత్‌లోనికి ప్రవేశించే చోట శానిటైజర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అక్కడ ప్రతి ఒక్క ఓటరూ తమ చేతులను శానిటైజ్‌ చేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. బూత్‌లోకి ప్రవేశించాక ప్రతి ఓటరూ ముగ్గురు అధికారులతో కాంటాక్ట్‌ అవ్వాల్సి ఉంటుంది. తొలుత.. పోలింగ్‌ అధికారి ఓటర్‌ జాబితాలో పేరుందో లేదో చూసేందుకు ఓటరు గుర్తింపు కార్డును అడిగి, సరిచూసుకుని తిరిగిస్తారు. అలా మొదటి కాంటాక్ట్‌ అవుతుంది. రెండో అధికారి.. ఓటరు చూపుడువేలుకు సిరా గుర్తు వేస్తారు. ఇక్కడ రెండో కాంటాక్టు అవుతుంది. మూడో అధికారి బ్యాలెట్‌ పత్రాన్ని, ఓటు వేయడానికి స్టాంపును ఇస్తారు. ఇచ్చే ముందు ఓటరు సంతకం చేయాల్సి ఉంటుంది. లేదా వేలిముద్ర వేయాలి. తర్వాత బ్యాలెట్‌ పత్రాన్ని, స్టాంపును తీసుకోవాలి. అక్కడ మూడో కాంటాక్టు అవుతుంది. 


అంతేకాదు.. ఆ స్టాంపును ఒకరి తర్వాత ఒకరికి ఇస్తారు కాబట్టి దాని ద్వారా అనేక కాంటాక్టులు ఏర్పడినట్టు లెక్క. బ్యాలెట్‌ పత్రాన్ని తీసుకుని కౌంటర్‌లోకి వెళ్లి ఇష్టమైన అభ్యర్థి గుర్తుపై ముద్ర వేసి, దాన్ని మడతపెట్టి ప్రిసైడింగ్‌ అధికారి వద్ద ఉన్న బ్యాలెట్‌పెట్టెలో వేయాలి. ఇలా పలుమార్లు కాంటాక్టులు ఏర్పడే అవకాశం ఉంది. ఓటింగ్‌కు.. లక్షణాలు లేని కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులు ఓటర్లు కూడా వచ్చే ప్రమాదం ఉన్నందున ఎవరి జాగ్రత్తలు వారు తప్పనిసరిగా పాటించాలి. ఏదో మాటవరసకు ‘నిబంధనలు పాటించాలి కాబట్టి పాటిస్తున్నా’ అనుకోకుండా మనస్ఫూర్తిగా పాటించాలని, ఓటు వేసే ముందు తర్వాత తమ చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే సొంతంగా శానిటైజర్‌ను దగ్గర ఉంచుకోవాలంటున్నారు. కాగా.. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌లు పెట్టుకుంటారు. పైగా బూత్‌లోకి ఒక్కరినే అనుమతిస్తారు. వారు ఓటేసి వెళ్లిపోయాక మరొకరిని లోనికి అనుమతిస్తారు.


గంటపాటు ప్రత్యేక ప్రవేశం

నవంబరు ఒకటి తర్వాత కొవిడ్‌ బారినపడిన వారికి అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించారు. అలాగే పాజిటివ్‌ ఓటరు కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఓటేసేందుకు ప్రత్యేక సమయం, ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేస్తారు. వారికి మాస్క్‌లు, ఫేస్‌షీల్డులు అందజేస్తారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇస్తారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారంతా విధిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఇప్పటికే వారికి ఆదేశాలు వెళ్లాయి. సిబ్బందిలో ఎవరికేౖనా వైరస్‌ సింప్టమ్స్‌ ఉంటే, వెంటనే వారిని విధుల నుంచి తప్పించి, రిజర్వుడు సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే, ఓటర్లు భౌతికదూరం పాటించేలా చూసేందుకు వాలంటీర్లను అందుబాటులో ఉంచారు.

Updated Date - 2020-12-01T09:17:09+05:30 IST