‘సాగర్‌’ మథనం షురూ..!

ABN , First Publish Date - 2021-01-18T07:52:38+05:30 IST

అప్రతిహత విజయాలకు దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బ్రేక్‌ పడటంతో రగిలిపోతున్న అధికార టీఆర్‌ఎస్‌.. అత్యవసరంగా ఓ విజయం సాధించాలనే కసితో ఉంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలిచి..

‘సాగర్‌’ మథనం షురూ..!

ఈ నెల 25 లేదా 27న సీఎం కేసీఆర్‌ సభ

నాలుగు నియోజకవర్గాల నుంచి జనసమీకరణ

ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

ఆయకట్టు చివరి భూములకు సాగునీరు

పంచాయతీల పెండింగ్‌ బిల్లులు మంజూరు

పెండింగ్‌లో ఉన్న గొర్రెల యూనిట్ల పంపిణీ

జిల్లా నేతలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం


నల్లగొండ/హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అప్రతిహత విజయాలకు దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బ్రేక్‌ పడటంతో రగిలిపోతున్న అధికార టీఆర్‌ఎస్‌.. అత్యవసరంగా ఓ విజయం సాధించాలనే కసితో ఉంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో గెలిచి.. ప్రతిపక్షాల నోళ్లు మూయించాలని భావిస్తోంది. ఈ మేరకు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల వేగం పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ చైర్మన్లతో శనివారం రాత్రి పొద్దుపోయే వరకు సమావేశమై దిశానిర్దేశం చేశారు. కాగా, కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఈ ఉపఎన్నికలో తెలంగాణ సెంటిమెంట్‌నే ఆయుధంగా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహిస్తూ.. నిర్వహణ భారాన్ని రైతుల నెత్తిన వేయడం, విద్యుత్తు ఉత్పత్తికి నీటినిల్వ పేరుతో సాగర్‌ కుడికాల్వ ద్వారా దొంగచాటుగా కృష్ణా జలాలను తరలించుకుపోవడాన్ని నిరసిస్తూ 2003లో కేసీఆర్‌ కోదాడ నుంచి హాలియా వరకు కేసీఆర్‌ పాదయాత్ర చేశారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే వీటికి విముక్తి కలుగుతుందని ఆనాడు నినదించి ఇక్కడి రైతులను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు బలంగా మళ్లించారు. ప్రస్తుతం సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్షాలు కేసీఆర్‌ పాదయాత్రను తెరపైకి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సీఎం కేసీఆర్‌ ఇటీవల పెద్ద సంఖ్యలో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తున్నారు. సాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గాలకు ఉపయోగపడే రూ.848 కోట్ల విలువైన ఐదు ఎత్తిపోతల పథకాలకు ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


పెండింగ్‌ పనులు.. నిధులు విడుదల..

ఉప ఎన్నికల అంశం తెరపైకి రాగానే.. హాలియాలో స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాలను ఇటీవలే సీఎం మంజూరు చేశారు. రాబోయే విద్యా సంవత్సరమే తరగతులు ప్రారంభించాల్సిందిగా జీవో కూడా విడుదలైంది. ఇక మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న 254 గొర్రెల యూనిట్లనూ పంపిణీ చేశారు. అయితే వీటిని కేవలం విభజిత నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం చేయడంతో.. ఉప ఎన్నికలో లబ్ధి కోసమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, టీఆర్‌ఎస్‌ హయాంలోనే మునిసిపాలిటీగా గుర్తించిన నాగార్జునసాగర్‌లో కూరగాయల, మటన్‌ మార్కెట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.11 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మరోవైపు  నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్పంచులు తమ సొంత నిఽధులతో వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్‌లు, రైతు వేదికల నిర్మాణం చేపట్టారు. అయితే ఇవన్నీ గత కొన్ని నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై సొంత పార్టీ సర్పంచులే ఆగ్రహంగా ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా.. సాగర్‌ నియోజకవర్గంలో మాత్రమే గత రెండు రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 


చివరి భూములు సస్యశ్యామలం చేసేలా..

కృష్ణా నది నుంచి నీళ్లను ఎత్తిపోయటం ద్వారా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములను సస్యశ్యామలం చేసేందుకు ఇప్పటికే మంజూరు చేసిన ఎత్తిపోతల పథకానికి ఈ నెల చివరిలో శంకుస్థాపన జరగనుంది. ఆయకట్టు చివరి భూముల రైతాంగాన్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యకు దీంతో పరిష్కారం లభించనుంది. ఈ పథకానికి సీఎం కేసీఆర్‌ ఈ 25 లేదా 27న శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హాలియా లేదా గుర్రంపోడులో సభ నిర్వహించనున్నారు. సభకు నాలుగు నియోజవకర్గాల నుంచి జనసమీకరణ చేయాల్సి ఉంటుందని శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఉమ్మడి నల్లగొండ నేతలతో కేటీఆర్‌ అన్నారు. నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అభ్యర్థి ఎవరనేది ఇప్పట్లో తేల్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ అంశాన్ని అధిష్ఠానానికి వదిలేసి, నియోజకవర్గంలో పార్టీని గెలిపించాలనే నినాదంతో ప్రచారం పెంచాలని కేటీఆర్‌ సూచించారు. కాగా, అధిష్ఠానం, జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డి ఎవరి పేరు సూచించినా తమకు సమ్మతమేనని జిల్లా ఎమ్మెల్యేలు.. కేటీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది.

Updated Date - 2021-01-18T07:52:38+05:30 IST