సాగర్‌ సిమెంట్స్‌ రూ.500 కోట్ల సమీకరణ

ABN , First Publish Date - 2021-11-28T08:08:01+05:30 IST

భవిష్యత్‌ విస్తరణ, కంపెనీల కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం సాగర్‌ సిమెంట్స్‌ రూ.500 కోట్ల నిధులు సమీకరించనుంది.

సాగర్‌ సిమెంట్స్‌ రూ.500 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భవిష్యత్‌ విస్తరణ, కంపెనీల కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం సాగర్‌ సిమెంట్స్‌ రూ.500 కోట్ల నిధులు సమీకరించనుంది. రూ.250 కోట్ల వరకు నిధులను కాలపరిమితి రుణాల ద్వారా, మరో రూ.250 కోట్ల నిధులను అన్‌లిస్టెడ్‌ నాన్‌ కన్వర్టబుల్‌ సెక్యూరిటీల జారీ ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సాగర్‌ సిమెంట్స్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.


కాగా అనుబంధ కంపెనీ అయిన సద్గురు సిమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరును సాగర్‌ సిమెంట్స్‌ (ఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చారు. ఒడిశాలో 15 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న జైపూర్‌ సిమెంట్స్‌ ప్లాంట్‌ కార్యకలాపాలు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. సద్గురు సిమెంట్‌ 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో సమగ్ర సిమెంట్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ క్లింకరైజేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. కాగా కంపెనీ సిమెంట్‌ ఉత్పత్తి వార్షిక సామర్థ్యం ఈ ఏడాది చివరి నాటికి 82.5  లక్షల టన్నులకు చేరనుంది. 

Updated Date - 2021-11-28T08:08:01+05:30 IST