సాగర్‌ డ్యాం నుంచి నీరు నిలిపివేత

ABN , First Publish Date - 2020-05-23T10:47:14+05:30 IST

జిల్లాలోని మంచినీటి చెరువులను పూర్తిగా నింపకుండానే సాగర్‌ డ్యాం నుంచి నీటిని నిలిపివేశారు

సాగర్‌ డ్యాం నుంచి నీరు నిలిపివేత

బుగ్గవాగు నుంచి 2027 క్యూసెక్కులు విడుదల

కాలువలో దిగజారిన నీటి పరిమాణం

నేడు అక్కడ్నుంచీ సరఫరా బంద్‌?

చెరువులకు అరకొరగా చేరిన నీరు


దర్శి, మే 22 : జిల్లాలోని మంచినీటి చెరువులను పూర్తిగా నింపకుండానే సాగర్‌ డ్యాం నుంచి నీటిని నిలిపివేశారు. కోటా పూర్తయ్యిందంటూ డ్యాం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచినీటి చెరువులను నింపేందుకు 15 రోజుల క్రితం సాగర్‌ జలాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. డ్యామ్‌ నుంచి కుడికాలువకు నీరు నిలిపివేయడంతో దిగువన గుంటూరు జిల్లాలో ఉన్న బుగ్గవాగు నుంచి కొంతమేర నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం దాని నుంచి సాగర్‌ కుడికాలువకు 2027 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఆ నీటిని అద్దంకి బ్రాంచ్‌ కాలువకు 454 క్యూసెక్కులు, సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలుకు(ప్రకాశం సరిహద్దు) 1711 క్యూసెక్కులు, దర్శి బ్రాంచ్‌ కాలువకు 1128 క్యూసెక్కులు, పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు 450 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 330 క్యూసెక్కుల నీరు వస్తోంది.


జిల్లాకు మొత్తం 5.5 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించగా వృథా పోను 4.5 టీఎంసీల నీరు అందాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలోని 85/3వ మైలు వద్ద 3.1 టీఎంసీల నీరు, అద్దంకి బ్రాంచ్‌ కాలువకు 1 టీఎంసీ నీరు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అందులో రామతీర్థం జలాశయానికి 1.1 టీఎంసీల నీరు చేరింది. మిగిలిన నీటితో జిల్లాలోని మంచినీటి చెరువులకు నింపారు.


జిల్లాలోని మంచినీటి చెరువులకు అరకొరగానే నీరు చేరింది. ప్రధానంగా 140 గ్రామాలకు మంచినీరు అందించే దర్శి ఎన్‌ఏపీ చెరువులో ప్రస్తుతం 75 శాతం నీరు ఉంది. సాగర్‌ జలాలు విడుదల చేసే సమయానికే 60 శాతం నీ రుండగా, కేవలం 15శాతం మాత్రమే నింపారు. ప్రస్తుతం దర్శి చెరువులో 1900 మిలియన్‌ లీటర్ల నీరు చేరింది. చం దవరం-1, -2, దూపాడు చెరువులకు 75 శాతం నీరు నింపారు. మరికొద్ది రోజులు సాగర్‌ జలాలు విడుదల చేస్తే మంచినీటి చెరువులకు పూర్తిగా నింపే అవకాశం ఉంది.


దుర్వినియోగమైన సాగర్‌ జలాలు

మంచినీటి అవసరాలకు విడుదల చేసిన సాగర్‌ జలాలు కొన్నిచోట్ల దుర్వినియోగం అయ్యాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించి చేపల చెరువులకు నీరు విడుదల చేయటం వలన మంచినీటి చెరువులకు సక్రమంగా నీరు చేరలేదనే ఆరోపణలున్నాయి. ఒంగోలు బ్రాంచ్‌ కాలువ పరిధిలోని దర్శి సబ్‌ డివిజన్‌లో అనేక నాన్‌ నోటిఫైడ్‌ చెరువులకు నీరు విడుదల చేశారు. అవన్నీ చేపల చెరువులు. వాటి నిండా నీరు చేరింది. చేపల పెంపకందారుల వద్ద ముడుపులు తీసుకొని నీరు విడుదల చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-05-23T10:47:14+05:30 IST