‘సాగర్‌’..కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకమే

ABN , First Publish Date - 2021-01-21T06:38:02+05:30 IST

ఎన్నికల్లో వరుసగా ఓటములను చవి చూస్తున్న కాంగ్రె్‌సకు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక మాత్రం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా ఏదో ఒక సమాధానం

‘సాగర్‌’..కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకమే

ప్రత్యామ్నాయంగా నిలవాలంటే గెలవాల్సిందే..

ఇప్పటికే జానారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించిన పార్టీ

జిల్లా నేతలను పూర్తిస్థాయిలో 

మొహరించాలని ఆలోచన 

నేడు రాష్ట్రానికి ఠాగూర్‌.. 

ఉప ఎన్నికపై సమీక్ష జరిపే అవకాశం


హైదరాబాద్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో వరుసగా ఓటములను చవి చూస్తున్న కాంగ్రె్‌సకు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక మాత్రం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా ఏదో ఒక సమాధానం చెప్పుకోగలిగినా.. సాగర్‌ ఉప ఎన్నిక విషయంలో మాత్రం అటు, ఇటైతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందన్న ఆందోళన పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో గెలుపునకు సర్వశక్తులూ ఒడ్డాలన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చింది. వాస్తవానికి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ ఓటమినే చవి చూసినా.. ప్రధాన ప్రతిపక్ష హోదాను మాత్రం నిలబెట్టుకుంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల దగ్గరి నుంచి మాత్రం బీజేపీ రూపంలో కష్టకాలాన్నే ఎదుర్కొంటోంది.


దుబ్బాక ఉప ఎన్నికలో ఏకంగా అధికార టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సీటును కైవసం చేసుకున్న బీజేపీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం దిశగా బాటలు వేసుకుంది. దుబ్బాకలో మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్‌.. డిపాజిట్‌నూ కోల్పోయింది. అయితే బీజేపీ అభ్యర్థిపైన సానుభూతి పనిచేసిందని, తాము అభ్యర్థిని నిర్ణయించుకోవడంలో ఆలస్యం కావడమూ విజయావకాశాలను దెబ్బతీసిందని పార్టీ నాయకత్వం వివరణ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు డివిజన్లలో మాత్రమే కాంగ్రెస్‌ గెలవగా.. బీజేపీ టీఆర్‌ఎ్‌సకు గట్టి పోటీ ఇచ్చి 48 డివిజన్లను గెలుచుకుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని ప్రకటించిన బీజేపీ నేతలు.. 2023 ఎన్నికల్లో అధికారంలోకీ వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం జీహెచ్‌ఎంసీ పరిధిలో బీజేపీ మొదటి నుంచీ బలంగా ఉందని చెబుతోంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నది కూడా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డేనని గుర్తు చేస్తోంది. 


గెలిచే చాన్స్‌.. ఓడిపోతే భారీ మూల్యమే!

దుబ్బాక ఉప ఎన్నిక అనుభవంతో సాగర్‌ విషయానికొచ్చేసరికి కాంగ్రెస్‌ అప్రమత్తమయింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ముందుగానే అధిష్ఠానం ఖరారు చేసేసింది. జానారెడ్డి కూడా ఇప్పటికే ప్రచార రంగంలోకి దూకేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది ఉమ్మడి నల్లగొండ జిల్లా కావడంతో పాటు.. సాగర్‌ నియోజకవర్గం కూడా ఆయన లోక్‌సభ పరిధిలోనే ఉంది. దీంతో ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ఆయనపైన పడింది. టీపీసీసీ చీఫ్‌ రేసులో ఉన్న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిదీ ఇదే జిల్లా కావడంతో ఆయనా తనవంతు కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జానారెడ్డికి బలమైన నేతగా పేరుండటంతో పాటు.. నియోజకవర్గంలోనూ పార్టీ బలంగా ఉందని, ఈ నేపథ్యంలో సాగర్‌లో ఓటమి చెందితే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.


గతంలో ఓటములకు కారణాలు చెప్పుకున్నట్లుగా సాగర్‌ విషయంలో సమాధానాలూ ఉండవని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గురువారం హైదరాబాద్‌కు వస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. సాగర్‌ ఉప ఎన్నికపైనా అందుబాటులో ఉండే నేతలతో సమీక్ష జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలనూ సాగర్‌ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో మొహరించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2021-01-21T06:38:02+05:30 IST