సాగరమంత సంతోషం

ABN , First Publish Date - 2020-08-04T10:07:23+05:30 IST

22లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఆధునిక దేవాలయం నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌.

సాగరమంత సంతోషం

రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు

ఎన్నెస్పీ జలాలతో జిల్లాలో మూడు లక్షల ఎకరాలు సస్యశ్యామలం

సాగర్‌ నీటి విడుదలకు కేటితో 53 ఏళ్లు


ఖమ్మం కలెక్టరేట్‌, ఆగస్టు 3: 22లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఆధునిక దేవాలయం నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌. ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాలువ కింద ఖమ్మం, నల్లగొండ, కృష్ణా జిల్లాలోని సుమారు 11 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. నాగార్జున సాగర్‌ ఆనకట్ట స్థూల సామర్థ్యం 408.24 టీఎంసీలు. జలాశయం పూర్తినిల్వస్థాయి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 590 అడుగులుగా కాగా కనిష్ట నిల్వ స్థాయి 510 అడుగులుగా ఉంటుంది. 1955 డిసెంబరు 10న అప్పటి దేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాప చేశారు. ఆగస్టు 4 , 1967లో రెండో ప్రధాని ఇందిరాగాంధీ నిరు విడుదల చేశారు. శనివారం నాటికి ఈ ప్రాజెక్టు ప్రారంభమై 53 వసంతాలు నిండిన సందర్భంగా ప్రత్యేక కథనం.. 


బంజరు భూముల్లో బంగారం..

నాగార్జున సాగర్‌ జలాలు రావడానికి ముందు ఉమ్మడి ఖమ్మం  జిల్లా స్వరూపమే వేరు. పంటపొలాలన్నీ వర్షాధార పంటలు మాత్రమే పండేవి. సాగర్‌జలాల రాకతో బంజరు భూములన్నీ బంగరు భూములుగా మారాయి.  నాగార్జున సాగర్‌ డ్యాం నుంచి ఖమ్మం జిల్లా వరకు (మున్నేరు వరకు ) 180 కిలోమీటర్ల ప్రధాన ఎడమ కాలువ ఉంది. మున్నేరు ఆక్విడెక్టు నుంచి కృష్ణాజిల్లా నూజివీడు వరకు 117 కిలోమీటర్ల మేర ఈ కాలువను నిర్మించారు.  జిల్లాకు 1983 నుంచి సాగర్‌ నీళ్లు విడుదలయ్యాయి.  సాగర్‌ జలాల రాకతో జలసిరి సంతరించుకుంది. జిల్లా లో 17 మండలాల్లో 3లక్షల హెక్టార్ల సాగుభూమికి నీళ్లందాయి.


ఫలితంగా జిల్లాలో వ్యవసాయరంగానికి ఊతం వచ్చింది. నేలకొండపల్లి,  కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, ఖమ్మం అర్భన్‌, కొణిజర్ల, వైరా, ఏన్కూరు,తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, బోనకల్‌, చింతకాని మండలాలకు సాగర్‌జలాలతో సాగు భాగ్యం లభించింది. సుమారు 132 టీఎంసీల నీటిని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు వినియోగించేందుకు ఈ కాలువను డిజైన్‌ చేయగా జిల్లాలో సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలోని భూములన్నీ సస్యశామలం అయ్యాయి. అప్పటి వరకు జొన్న, సజ్జలు వంటి పంటలకే అవకాశం ఉన్న చేలన్నీ ‘వరి’ పంటకు అవకాశం లభించింది.   

Updated Date - 2020-08-04T10:07:23+05:30 IST