సాగేనా..?

ABN , First Publish Date - 2022-01-25T06:33:59+05:30 IST

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతన్నలు ఆసక్తి చూపడంలేదు. వరికి బదులు వాణిజ్య, ఇతర పంటలను సాగుచేసుకోవాల ని ప్రభుత్వం సూచించింది. ఎంతో ఇష్టంగా వరి పండించే రైతులపై ఆంక్షలు విధించడంతో, యాసంగిలో ఏయే పం టలు వేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

సాగేనా..?
బొమ్మలరామారం మండలం నాయకునితండాలో పొలంలో ఆకుకూర విత్తనాలు చల్లుతున్న రైతు

పంటల సాగుకు వెనుకడుగు

యాసంగిలో అయోమయంలో రైతన్నలు

ఇప్పటివరకు జిల్లా లో 75వేల ఎకరాల్లో నే పంటల సాగు 

ప్రత్యామ్నాయ    పంటలపై అనాసక్తి

అగమ్యగోచరంగా మూసీ రైతుల పరిస్థితి 

ఎడారిని తలపిస్తున్న సాగుభూములు 



యాదాద్రి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతన్నలు ఆసక్తి చూపడంలేదు. వరికి బదులు వాణిజ్య, ఇతర పంటలను సాగుచేసుకోవాల ని ప్రభుత్వం సూచించింది. ఎంతో ఇష్టంగా వరి పండించే రైతులపై ఆంక్షలు విధించడంతో, యాసంగిలో ఏయే పం టలు వేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీంతో గ్రామాల్లో పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు, బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. సాధారణంగా రైతులు ఇప్పటికే పొలాలను ట్రాక్టర్లు,నాగళ్లతో దు న్నుకొని పంటల సాగుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఈ సారి రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. వరిని సాగుచేసినట్లయితే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 90 శాతం నాట్లు పూర్తయ్యేవి. జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేవు. అధిక శాతం రైతులు వ్యవసాయ బోరు, బావులపైనే ఆధారపడి వరి, పత్తి సాగు చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో పండించిన వరిని కొనుగోలు చేయడంలేదని, వరి పండించకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ధాన్యం కొనుగో లుచేసేదీ లేదని స్పష్టం చేసింది. అయితే జిల్లాలో అధికశా తం మంది రైతులు వరినే సాగుచేస్తారు. యాసంగి సీజన్‌ అదును దాటిపోతున్నప్పటికీ, ఏయే పంటలను వేయాలన్న దానిపై రైతులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు.


4.50లక్షల ఎకరాల్లో పంటల సాగు చేపట్టాల్సి ఉండగా..

జిల్లాలో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో పలు పంటలను సాగు చేస్తారు. వీటిలో దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో వరి, 65వేల ఎకరాల్లో పత్తి, 1.40 లక్షల ఎకరాల్లో కంది, ఇతర పప్పుధాన్యాలు సాగు చేస్తారు. ప్రతీ ఏడాది వ్యవసాయ శాఖ వానాకాలం, యాసంగిలో ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారన్న అంచనాలు రూపొందిస్తుంది. అయి తే ఈసారి ప్రత్యామ్నాయ పంటలు సాగుపై ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయలేదు. ప్రత్యామ్నాయ పంటల్లో ఎవరి కి నచ్చిన విత్తనాలు వారు విత్తుకోవాలని సూచిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 75వేల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. వీటిలో దాదాపు 65 వేల ఎకరాల్లో వరి నాటు వేయగా, మరో 45 వేలకు పైగా ఎకరాల వరకు సాగుచేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంది 568 ఎకరాల్లో, మొక్కజొన్న 565 ఎకరాల్లో, జొన్నలు 265 ఎకరాల్లో, శనగ 607 ఎకరాల్లో, మినుములు 2,422 ఎకరాల్లో, ఉలువలు 422 ఎకరాల్లో, ఆముదం 306 ఎకరాల్లో, ఉలువలు 623 ఎకరాల్లో, వేరుశనగ 1209 ఎకరాల్లో, పెసర 634 ఎకరాల్లో, మొక్కజొన్న 60 ఎకరాల్లో, పొద్దు తిరుగుడు 102 ఎకరాల్లో, గోధుమలు 124 ఎకరాల్లో, అవాలు 121 ఎకరాల్లో, పలు ప్రాంతాల్లో గడ్డి, తదితర పంటలు సాగు చేస్తున్నారు.


దగ్గరపడుతున్న గడువు 

మరోవైపు విత్తనాలు నాటేందుకు సీజన్‌ గడువు దగ్గరపడుతోంది. దీంతో కొందరు రైతులు వరితోపాటు కూరగాయలు, ఆకు కూరల పంటలు కొంత మేర సాగు చేసుకుంటున్నారు. మిగతా భూమిలో ఏ పంట సాగు చేయాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు సాగుచేస్తే గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సౌకర్యం పరిస్థితి ఏమిటోనని రైతులు అయోమయానికి గురవుతున్నారు. కూరగాయలు సాగుచేస్తే అధిక వ్యయంతోపాటు కూలీల సమస్య ఉంటుంది. దీంతో రైతులు సందిగ్ధంలోపడ్డారు.


అగమ్యగోచరంగా మూసీ పరివాహక రైతుల పరిస్థితి

జిల్లాలో ఐదు మండలాలకు చెందిన రైతులు మూసీనది జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. వీటిలో భువనగిరి మండలంలోని 15 గ్రామాలు, వలిగొండలోని 20గ్రామాలు, బీబీనగర్‌లోని 15 గ్రామాలు, పోచంపల్లిలో ని 20 గ్రామాలు, చౌటుప్పల్‌లోని 10 గ్రామాలు ఉంటా యి. ఈ ప్రాంతలో మూసీ కాల్వల ద్వారా పుష్కలంగా నీరు వస్తుండటంతో వరి పంట సాగుచేస్తారు. ఈసారి వరి సాగు చేసినా, కొనుగోలు చేసే ప్రసక్తే లేదని ప్రభు త్వం తేల్చి చెప్పింది. దీంతో జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని రైతులు అయోమయానికి గురవుతున్నారు. మూసీ నీటిపై ఆధారపడి వరి పండించే రైతులు యాసంగి మొదలైనప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి పంటలను కూడా చేయలేదు. దీంతో వరిపంటతో పచ్చదనం గా కన్పించే ఈ ప్రాంతమంతా కూడా ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు మినుములు, గోధుమలు, ఇతర పంటలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో మాదిరి ఈ ప్రాంతంలో పెద్దగా సాగు కన్పించడంలేదు.


ఎకరం పొలంలో పావుసగమే సాగు : శ్రీనివాస్‌, రైతు, నాయకునితండా, బొమ్మలరామారం 

నాకున్న ఎకరం పొలంలో పావు వరకే సాగు చేసుకుంటున్నాను. ప్రతీ సంవత్సరం నాకున్న ఎకరం పొలంలో వరి పండించేది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయ మని చెబుతున్నారు. సీజన్‌ దాటిపోతుండటంతో పొలం పడావు పడకుండా నాశక్తి మేరకు పావు ఎకరంలో మెంతి కూర విత్తనాలు చల్లుకుంటున్నాను. మిగతా పొలంలో ఎలాంటి పంటల సాగు చేపట్టడం లేదు.


Updated Date - 2022-01-25T06:33:59+05:30 IST