వ్యయసాయం

ABN , First Publish Date - 2021-06-22T06:06:22+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వెళ్తోంది. ఈ ప్రభావం అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

వ్యయసాయం
ఆయిల్‌ ఇంజన్‌లతో పొలం తడుపుతున్న రైతులు

రైతన్నలపై ధరల పోటు

సాగులో యాంత్రీకరణతో పెట్రో భారం

ఎకరానికి రూ.3 వేలు అదనపు వ్యయం


సాగు ఖర్చులు పెరిగిపోయాయి. గతంలో వాతావరణ ఒడిదుడుకులను అధిగమిస్తే చాలు. కాని ప్రస్తుతం విత్తనాల నుంచి ఎరువుల దాకా.. డీజల్‌ నుం చి పురుగుల మందు వరకు.. కూలి ఖర్చుల నుంచి రవాణా వరకు అన్నీ భారమయ్యాయి. ప్రభుత్వాలు వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్స హించడంతో ప్రస్తుతం సంప్రదాయ వ్యవసాయం పూర్తిగా కనుమరుగె ౖపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో యాంత్రీకరణ కారణంగా ప్రస్తుతం పెరుగుతున్న పెట్రో భారం రైతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దున్నకం.. నాట్లు.. నూర్పిడి.. రవాణా ఇలా అన్నిం టికి యంత్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. వీటికి పెట్రోల్‌ కాని డీజిల్‌ కాని అవసరం. దీంతో రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా గత ఏడాది ఖరీఫ్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ఎకరాకు రూ.3 వేల వరకు అదనపు భారం పడుతోంది.


(ఆంధ్రజ్యోతి- గుంటూరు) 

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వెళ్తోంది. ఈ ప్రభావం  అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దయెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి మరీ యాంత్రీకరణను ప్రోత్సహించాయి. పర్యవసానంగా సంప్రదాయ వ్యవసాయం కనుమరుగైంది. ట్రాక్టర్‌, స్ర్పేయర్లు, నాట్లకు,  నూర్పిడిలకు యంత్రాల వినియోగం పెరిగిపోయింది. పత్తి, మిర్చిలో అంతరసేద్యం కూడా యంత్రాల ద్వారానే సాగుతోంది.   యంత్రాలపై ఎక్కువగా ఆధారపడటం.. అదే సమయంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలతో రైతులపై అదనపు భారం పడుతోంది. గతఏడాది ఖరీఫ్‌ కంటే 22 శాతం పెట్రోలు, డీజల్‌ ధరలు పెరిగాయి.  పర్యవసానంగా రైతులపై ఎకరానికి సగటున రూ.2,500 నుంచి రూ.3 వేలు అదనపు భారం పడుతుంది.  గత ఖరీఫ్‌లో పెట్రోల్‌ లీటరు రూ.80 - రూ.87 ఉండగా, ప్రస్తుతం రూ.103 - రూ.104కు చేరింది. డీజిల్‌ రూ.70 - రూ.75 నుంచి రూ.వందకు చేరింది. పెట్రో ధరలు పెరగడంతో ట్రాక్టర్‌, ఇతర యంత్ర పరికరాలతో చేసే పనులకు ధరలు పెంచారు.  భూమిని సిద్ధం చేయడానికి రెండుసార్లు ట్రాక్టర్‌ గొర్రుతోలిస్తారు. మాగాణిలో దమ్ము చక్రాల ట్రాక్టర్‌తో రెండుసార్లు రెండు గంటలు తొక్కిస్తారు. పురుగుమందు చల్లకం, అంతర సేద్యం కూడా ట్రాక్లర్లతోనే చేయాల్సి వస్తోంది. వరి, మొక్కజొన్న, జొన్న నూర్పిడి యంత్రాలతోనే చేస్తున్నారు. పసుపు ఉడకబెట్టే ఆవిరి యంత్రాలకు పెట్రోలు కావాలి. పురుగుమందు చల్లే పవర్‌ స్ర్పేయర్‌, తైవాన్‌ స్ర్పేయర్‌లకు పెట్రోలు ఉపయోగిస్తారు. మెట్ట, మాగాణి భూముల్లో యాంత్రీకరణ పెరగడంతో అన్నిపనులకు ట్రాక్టర్‌, ఆటో, లారీలు, ఇతర యంత్రాల వాడకం తప్పనిసరైంది. గత ఏడాది ఎకరం గొర్రు తోలితే రూ.450 - రూ.500 తీసుకోగా ఈ ఏడాది రూ.700 చేశారు. మాగాణిలో దమ్ము చేయడానికి గతంలో గంటకు రూ.1,200 - రూ.1,500 ఉండగా ప్రస్తుతం రూ.2 వేలు చేశారు. డ్రోన్‌తో పురుగుమందు చల్లితే ఎకరానికి గతంలో రూ.400 ఉండగా ప్రస్తుతం రూ.500 చేశారు. వరి నాటే యంత్రానికి గతంలో రూ.3 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.4 వేలైంది. వరికోత యంత్రాలకు గతంలో ఎకరానికి రూ.2,200- రూ.2,500 ఉండగా ప్రస్తుతం రూ.3,000 - రూ.3,500 చేశారు. సకాలంలో వర్షాలు పడక పంటలు బెట్టకొస్తే నీరుపెట్టాలి. దీనికి ఉపయోగించే ఆయిల్‌ ఇంజన్లు, మోటార్లకు పెట్రోల్‌ అవసరం. 


పెరిగిపోయిన రవాణా ఖర్చులు...

ఎరువుల బస్తాలు పొలం తీసుకెళ్ళటం, పత్తి, మిర్చి, వరి ధాన్యం, పసుపు, ఇతర పంటలను మార్కెట్‌కు, పొలం నుంచి ఇంటికి తరలించడానికి ట్రాక్టర్లు, మినీ లారీలు, ఆటోలను ఉపయోగిస్తారు. మిర్చి కోత, పత్తి తీత, వరి, ఇతర పంటలలో కలుపుతీత వంటి పనులకు కూలీలను ఆటోలు, ట్రాక్టర్లు, మినీ వ్యానుల్లో తరలిస్తారు.  ఈ రవాణా ఖర్చులు రైతు భరించాల్సిందే.


వాణిజ్య పంటలకు ఎక్కువ వ్యయం

వాణిజ్య పంటలలో పెట్రోలు, డీజిల్‌ వాడకం ఎక్కువగా ఉంది. పసుపు, మిర్చి, పొగాకు తదితర పంటలను గ్రేడింగ్‌ చేయాలి.   దీని కోసం కల్లాలు, బ్యారన్‌లకు తీసుకెళ్ళాలి. ముడిసరుకు రవాణా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మిర్చికి 17-20 సార్లు, పత్తికి 10-12 సార్లు, పసుపుకు 7-10 సార్లు చీడపీడ నివారణ మందులు వేస్తున్నారు. యంత్ర పరికరాలకు పెట్రోలు ఉపయోగించాలి.   

  - మన్నవ వెంకటేశ్వరరావు, మిర్చియార్డు మాజీ డైరెక్టర్‌


ఎకరానికి రూ.వంద అదనం

డ్రోన్లతో పురుగు మందు చల్లడానికి గత ఏడాది కంటే  రూ.వంద చొప్పున పెంచాం. గతంలో పెట్రోల్‌ ధర లీటరు రూ.75-రూ.80 ఉండేది. ఈ ఖరీఫ్‌లో రూ.105కు చేరబోతోంది. పెట్రోలుతోపాటు కూలీల ఖర్చులు కూడా పెరిగాయి. అందువల్ల రైతులపై అదనపు భారం వేయాల్సి వస్తోంది. 

- వి.సుధీర్‌, డ్రోన్‌ యజమాని  తూములూరు, కొల్లిపర మండలం


ఎకరానికి రూ.3 వేలు వ్యయం 

పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగటంతో వ్యవసాయ రంగంలో అన్నింటిలో దాని ప్రభావం ఉంటుంది. ట్రాక్టర్‌ గొర్రు, నాగళ్ళు, వరినాట్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పత్తి, మిర్చిలో అంతర సేద్యం, పురుగు మందు చల్లకం, ఎరువుల బస్తాలను పొలం తోలకానికి... ఈ విధంగా అన్ని    పనులలో  వాహనాలు అవసరమయ్యాయి. గత ఏడాది కంటే లీటరు రూ.25 నుంచి రూ.30 చొప్పున పెరిగింది. ఎకరానికి సగటున రూ.3 వేల వరకు రైతులపై భారం పడుతోంది.  

-ఆర్‌.ప్రసాదరావు, ట్రాక్టర్‌ యజమాని, మాదల, ముప్పాళ్ళ మండలం 

    


=================================================================

Updated Date - 2021-06-22T06:06:22+05:30 IST