సహకార రంగాన్ని బలోపేతం చేయటమే సీఎం లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-24T06:47:55+05:30 IST

సహకార రంగాన్ని బలో పేతం చేయడమే సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమని వ్యవసాయ, సహ కారశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

సహకార రంగాన్ని బలోపేతం చేయటమే సీఎం లక్ష్యం
కేడీసీసీబీ పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న మంత్రి కన్నబాబు

వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు

వన్‌టౌన్‌, జూలై 23 : సహకార రంగాన్ని బలో పేతం చేయడమే సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమని వ్యవసాయ, సహ కారశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహకార రంగం అభివృద్ధి చెందితేనే ఆ ఫలాలు క్షేత్ర స్థాయిలో ఉన్న చిన్న రైతులకు అందుతాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందులో భాగంగానే హెచ్‌ఆర్‌ పాలసీ తీసుకువచ్చినట్టు తెలిపారు. దీనివల్ల సెక్రటరీ, డీసీసీబీ ఉద్యోగుల బదిలీలు ఉంటాయన్నారు.  ఈ-క్రాప్‌ చేయించుకున్న ప్రతి ఎకరానికి బీమా చెల్లించే విధానాన్ని తీసుకువచ్చి రికార్డు సాధించామన్నారు. రాష్ట్రంలో 19,850 ఆర్‌బీకేలను ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు తెలిపారు. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎంతో చరిత్ర కలిగినదన్నారు. చైర్మన్‌గా ఎన్నికయిన తన్నీరు నాగేశ్వరరావు బ్యాంకు అభివృద్ధికి మరింత కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కృష్ణాడీసీసీబీ రూ. 7200 కోట్ల టర్నోవర్‌తో రూ. 4500 రుణ సౌకర్యం కల్పిస్తూ రూ. 2700 కోట్లు డిపాజిట్లు కలిగి  అభివృద్ధి చెందిందన్నారు. గత చైర్మన్‌గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా బ్యాంక్‌ అభివృద్ధికి బాగా పని చేశారన్నారు. సీఈవో నుంచి సెక్రటరీ వరకు  అంకిత భావంతో పని చేసి పాలక వర్గానికి సహకరించాలన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్లు కొమ్మినేని రవిశంకర్‌, నల్లమోతు కోటి సూర్యప్రకాశరావు, వేములకొండ రాంబాబు, భూక్యారాణి, జి.పెదవెంకయ్య, పడమట సుజాలతో మంత్రి కన్నబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి కన్నబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌, వసంత కృష్ణప్రసాద్‌, మొండితోక జగన్‌మోహన్‌రావు, మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ వసంత నాగేశ్వరరావు, కేడీసీసీ మాజీ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు, సీఈవో శ్యామ్‌మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T06:47:55+05:30 IST