సాహితీ మృత్యుంజయుడు బొల్లిముంత

ABN , First Publish Date - 2020-11-27T05:59:05+05:30 IST

‘మనిషి జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది సామాజిక అస్తిత్వం-సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది’ అన్న దృక్పథంతో రచనలు చేసిన అగ్రశ్రేణి...

సాహితీ మృత్యుంజయుడు బొల్లిముంత

రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో బొల్లిముంత శివరామకృష్ణయ్య నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం.


‘మనిషి జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది సామాజిక అస్తిత్వం-సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది’ అన్న దృక్పథంతో రచనలు చేసిన అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య. ఉపాధ్యాయుడు, హార్మోనిస్టు, నటుడు, గాయకుడు, కవి, కథారచయిత, నవలాకారుడు, బుర్రకథా రచయిత, హరికథా రచయిత, జర్నలిస్టు, సినిమా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, రాజకీయ కార్యకర్త, ఉత్తమ కమ్యూనిస్టు బొల్లిముంత.


1920 నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం, చదలవాడలో శ్రీమతి మంగమ్మ-, శ్రీ అక్కయ్య దంపతులకు పుట్టిన శివరామకృష్ణయ్య ప్రాథమిక, మాధ్యమిక విద్య తమ స్వగ్రామంలో కొనసాగించి, గుంటూరులో హయ్యర్‌గ్రేడ్‌ శిక్షణ పూర్తి చేశారు. సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయంకృషితో నేర్చుకున్నారు. చదలవాడలో ఆయన తండ్రి నెలకొల్పిన పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేశారు. బొల్లిముంత 16వ ఏట రచించిన ‘ఏటొడ్డు’ కథ 'చిత్రాంగి' పత్రికలో అచ్చయ్యింది. అది ఆయన తొలిరచన. నూనూగు మీసాల నూత్న యవ్వనవేళ త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద భావజాలంతో ప్రభావితులయ్యారు. త్రిపురనేని గోపీచంద్‌తో ఏర్పడిన స్నేహం బొల్లిముంత జీవితాన్ని మలుపు తిప్పింది. తమ జీవిత లక్ష్యం నిర్ణయించుకోవలసిన దశలో మార్క్సిస్టు సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. తమ గ్రామస్థితిగతులు, రైతుల, వ్యవసాయకూలీల దుర్భర జీవితాలు పరిశీలించారు. వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయడం మొదలుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎక్కువగా మమేకమయ్యారు. చల్లపల్లి జమీందారుగా వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం హైదరాబాద్‌ సంస్థానంలో జరుగుతున్న రైతాంగ సాయుధ పోరాట ఉదంతాలను పత్రికలలో చదివి, స్పందించి 1947లోనే ‘మృత్యుంజయులు’ నవల రాశారు. తెలంగాణా విమోచనోద్యమ నవలల్లో ఇదే తొలి నవల. నిజాం నిరంకుశత్వానికీ, భూస్వాముల దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరులను మృత్యుంజయులుగా చిత్రించారు. 


పోలీసుచర్య తరువాత నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టులపై క్రూర నిర్బంధకాండను అమలు జరిపిన కాలంలో అజ్ఞాతవాసంలో ఉంటూనే గుంటూరు నుంచి 'నగారా' పత్రికను నడిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం స్వదేశంలో కమ్యూనిస్టులపై దారుణమైన నిర్బంధకాండను, ఊచకోతను ప్రయోగిస్తూ, మరోవైపు విదేశీవ్యవహారాలలో సోషలిస్టు శిబిరంతో స్నేహసంబంధాల కోసం అర్రులు చాచే ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ బొల్లిముంత ‘మొదళ్ళు నరికి చివుళ్ళకు నీరు పోస్తానంటాడు పండిట్‌ నెహ్రూ’ అనే వ్యాసం రాశారు. రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో నిర్ద్వంద్వంగా ఖండించారు. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో తెనాలిలో జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభల నిర్వహణలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో భాగస్వామిగా ఉంటూనే, కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘పిల్లి’ కథను ‘నగారా’ పత్రికలో తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక రచనలు అచ్చవుతున్నాయని ఆ పత్రికను ప్రభుత్వం నిషేధించింది.


ప్రజలను చైతన్యపరచడానికి బొల్లిముంత శివరామకృష్ణయ్య అనేక సాహిత్య ప్రక్రియలనూ, ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు. బెంగాల్‌ కరువుపై బుర్రకథ రాశారు. రైతుల జీవన స్థితిగతులను వివరిస్తూ ‘రైతుబిడ్డ’ హరికథ రచించారు. బొల్లిముంత కథలు-‘సూక్ష్మంలో మోక్షం’, ‘అంతరాత్మ అంత్యక్రియలు’, ‘శివరామకృష్ణ కథలు’ సంపుటాలుగా వెలువడ్డాయి. 1940-50 దశకాల తెలుగు ప్రాంతాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను చిత్రిస్తూ ‘ఏ ఎండకాగొడుగు’, ‘పత్రికా న్యాయం’, ‘తెలంగాణా స్వతంత్ర ఘోష’, ‘క్విట్‌ కాశ్మీర్‌’, ‘ధర్మ సంస్థాపనార్థాయ’ మొదలైన నాటికలు రచించారు. ‘దొంగ దొరికింది’, ‘బలే మంచి చౌకబేరం’ రేడియో నాటికలు రాశారు. ‘నేటి భారతం’ పేరుతో మూకీ నాటికను రూపొందించారు.


‘ప్రజాశక్తి’ పత్రికలో శివరామకృష్ణ రచించిన ‘దేశం ఏం కావాలి’ కథ విశేష జనాదరణ సంపాదించింది. 1955 మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పరాజయంతో నిస్పృహ చెందిన బొల్లిముంత క్రమంగా ప్రజారంగాన్ని వదిలి 1960లో మద్రాసు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆచార్య ఆత్రేయకు ఘోస్ట్‌ రైటర్‌గా ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘కలిమిలేములు’ మొదలైన అనేక చిత్రాలకు సంభాషణలు రాశారు. ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ‘వాగ్దానం’ చిత్రానికి సహరచయితగా తెరపైకెక్కారు. నాటి నుంచి బి.ఎస్‌.నారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ బొల్లిముంత సంభాషణలు రచించారు.


1967లో తిరిగి తెనాలి వచ్చేశారు. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అదే సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బందరు స్థానం నుంచి సిపిఐ అభ్యర్థిగా బొల్లిముంతను పార్టీ నిలబెట్టింది. మోటూరి హనుమంతరావు సిపిఎం అభ్యర్థి. హోరాహోరీగా జరిగిన దాయాది పోరులో ఉభయ కమ్యూనిస్టులను ఓడించి, చల్లపల్లి జమిందార్‌ విజయం సాధించాడు.


1968లో ‘విశాలాంధ్ర విజ్ఞాన సమితి’ వారి ‘ప్రతిభ’ సచిత్ర వారపత్రికలో బొల్లిముంత సహాయ సంపాదకుడిగా చేరారు. 1969లో వి.మధుసూదనరావు పిలుపుతో తిరిగి మద్రాసు బాటపట్టారు. ‘మనుషులు మారాలి’ సినిమాకు కథ, సంభాషణలు సమకూర్చారు. ఆ చిత్రం వందరోజులు ఆడింది. అప్పటి నుంచి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు దర్శకత్వం వహించిన అత్యధిక భాగం సినిమాలకు బొల్లిముంతగారే సంభాషణా రచయిత. క్రమంగా కథకూ, సంభాషణలకూ, సందేశాలకూ ప్రాధాన్యత తగ్గిపోయి, నాయక ప్రాధాన్య చిత్రాల హోరు ప్రారంభమయ్యాక శివరాం మౌనంగా సినిమారంగం నుండి నిష్క్రమించి, స్వగ్రామం చదలవాడకు చేరుకున్నారు.


1943లో తెనాలిలో జరిగిన ‘అరసం’ మొదటి మహాసభల్లో కార్యకర్తగా పాల్గొన్న శివరామకృష్ణయ్య అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. ఆయన సారథ్యంలోనే తెనాలిలో అరసం స్వర్ణోత్సవాలు (1994), వజ్రోత్సవాలు (2004) ఘనంగా జరిగాయి. 1988 అక్టోబర్‌ 8, 9 తేదీలలో భీమవరంలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం 10వ రాష్ట్ర మహాసభల్లో బొల్లిముంత అరసం ప్రధాన కార్యదర్శిగా, నేను కార్యదర్శిగా ఎన్నికయ్యాం. 1992లో గుంటూరులో జరిగిన అరసం 11వ రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలను బొల్లిముంత శివరామకృష్ణయ్య నుంచి నేను స్వీకరించాను. పెనుగొండ లక్ష్మీనారాయణ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.


బొల్లిముంత ఆదర్శాలను కొనసాగిస్తున్న ప్రగతిశీల రచయితలను సముచిత రీతిలో గౌరవించడానికి తెనాలి సాహితీమిత్రులు బొల్లిముంత బతికున్నప్పుడే, ఆ మహారచయిత పేరిట ‘బొల్లిముంత సాహితీపురస్కారం’ నెలకొల్పారు. ఈ పురస్కారం పొందిన వారిలో హితశ్రీ, పి. దక్షిణామూర్తి, వెలగా వెంకటప్పయ్య, నగ్నముని, ఎం.డి.సౌజన్య, కె.శివారెడ్డి, పరుచూరి సోదరులు, బి.నరసింగరావు, వంగపండు ప్రసాదరావు, గణేశ్‌ పాత్రో, సి.రాఘవాచారితోపాటు ఈ వ్యాస రచయిత కూడా ఉన్నారు.


85 సంవత్సరాల పరిపూర్ణమైన సామాజిక, సాహిత్య, రాజకీయ జీవితం గడిపిన బొల్లిముంత శివరామకృష్ణయ్య 2005 జూన్‌ 7నఅస్తమించారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం.

ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ

(నేడు బొల్లిముంత శివరామకృష్ణయ్య శతజయంతి సందర్భంగా)

Updated Date - 2020-11-27T05:59:05+05:30 IST