సాహో సబల

ABN , First Publish Date - 2021-03-08T06:12:45+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న మహళామణుల అభిప్రాయాలు..

సాహో సబల

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం


ఆకాశంలో సగం... అవనిలో సగం.. అన్నింటా సగం... అంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు మహిళామణులు. పురుషులకు దీటుగా నిలబడుతున్నారు. ఇళ్లైనా.. ఉద్యోగమైనా.. రాజకీయమైనా.. తమకు సాటి లేదని నిరూపిస్తున్నారు. ఉపన్యాసాలతో మహిళా సాధికారత సాధ్యం కాదని.. పట్టుదల, అంకితభావంతో పనిచేస్తే ఎంతటి శిఖరాలనైనా అధిరోహించవచ్చని నిరూపిస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలను సద్వినియోగం చేసుకుని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. చట్టసభల్లోనూ సమాన భాగస్వామ్యం కోసం ఎలుగెత్తుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న మహళామణుల అభిప్రాయాలు..


ఉన్నత విద్యతోనే మహిళల రాణింపు : పద్మారెడ్డి, ఎమ్మెల్యే, మెదక్‌

చదువుల తల్లులు వంటింటికే పరిమితం కావడం సమంజసం కాదు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళా సాధికారిత కేవలం ఉపన్యాసాల ద్వారా మాత్రమే రాదు. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కేలా చర్యలు శ్రద్ధ తీసుకున్నప్పుడే అది సాధ్యం. సమాజాన్ని అధ్యయనం చేయడానికి మహిళలకు విద్య ప్రధాన సాధనంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది. ప్రతీ ఇంటికి సురక్షితమైన నీటి సరఫరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు తదితర సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేశాం. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి.


ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి : సునీతారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

మహిళలకు ఏ ఆపద వచ్చినా మహిళా కమిషన్‌ అండగా నిలుస్తున్నది. మహిళల రక్షణకు ఎన్నో చట్టాలున్నాయి. వాటిపై కమిషన్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళలకే కాకుండా యువతకు కూడా చట్టాలు, శిక్షలపై సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు ఏ కష్టం వచ్చినా అధైర్యపడకుండా సవాళ్లను ఎదుర్కోవాలి. బాల్య వివాహాల నివారణకు మహిళా కమిషన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మోడల్‌ విలేజ్‌గా జిల్లాలోని మనోహరాబాద్‌ గ్రామాన్ని ఎంపికచేసి గ్రామంలోని ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేసి బాల్యవివాహాల కట్టడికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌తో చాలామంది యువతులు ఇంటినుంచూ పనిచేస్తుండడంతో గృహహింస, వరకట్నం వేధింపులు పెరిగాయి. 


మహిళలు చైతన్యవంతులను చేయడమే లక్ష్యం : మంజుశ్రీరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌, సంగారెడ్డి

మహిళలు ఇప్పుడిప్పుడే అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం అవకాశం కల్పిస్తుండం శుభపరిణామం. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల కారణంగానే జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం దక్కింది. ఇదే ఒరవడి అన్నీరంగాల్లో కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అధ్యాత్మికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉన్నది. స్ర్తీల జీవితం సంఘర్షణలతో కూడుకున్నది. వ్యవస్థలను మార్చే శక్తి స్ర్తీలకు ఉన్నది. మహిళలు స్వశక్తిపై విశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడు సముచిత గౌరవం లభిస్తుంది. జడ్పీ చైర్‌పర్సన్‌గా జిల్లాలో మహిళా సాధికారతను సాధించేందుకు నా వంతుగా కృషిచేస్తా.                 


మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడానికి కృషి : హేమలత, జడ్పీ చైర్‌పర్సన్‌, మెదక్‌

మహిళలకు వారి నైపుణ్యతను బట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చిన్నతరహా పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నది. కుట్టుశిక్షణ కేంద్రాలు నెలకొల్పి ప్రభుత్వం ద్వారా శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు ఇప్పిస్తున్నాం. మహిళలపై వివక్షత లేకుండా సాధికారిత సాధించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఇచ్చి రాష్ట్రంలో జిల్లాను అభివృద్ధి పరంగా ముందువరుసలో నిలుపుతున్నారు. ప్రతీ గ్రామంలో మాతా శిశుసంక్షేమ కేంద్రాలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 30 మంది మహిళలకు పాల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పుకోవడానికి ప్రోత్సాహం కల్పించింది. 


మహిళలకు స్వయం ఉపాధి కల్పనకే ప్రభుత్వ  ప్రాధాన్యం : వే లేటి రోజాశర్మ, జడ్పీ చైర్‌పర్సన్‌

సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నది. మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు చేస్తున్నాం. మంత్రి హరీశ్‌రావు కృషితో మిట్టపల్లిలో దాల్‌మిల్లు, ఇర్కోడ్‌లో మాంసం పచ్చళ్ల తయారీకి సౌకర్యాలు కల్పించాం. మంత్రి కృషితో సిద్దిపేటలో మహిళా ప్రాంగణాలు అందుబాటులోకి రానున్నాయి. 18 సంవత్సరాలు నిండి పదో తరగతి పాసైన వారికి డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి 45 శాతం సబ్సిడీతో క్యాబ్‌లను అందించనున్నాం. మహిళల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు సైతం కృషిచేస్తున్నాయి. వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నకోడూరు ఎంపీపీగా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో సిద్దిపేట జిల్లాకు తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది.

Updated Date - 2021-03-08T06:12:45+05:30 IST