ఏ ఒక్కరికీ ఇబ్బంది రానివ్వను..

ABN , First Publish Date - 2020-05-25T10:23:47+05:30 IST

ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రజలకు 540 సేవలు అందేలా చూస్తా..

ఏ ఒక్కరికీ ఇబ్బంది రానివ్వను..

సచివాలయ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక కృషి

అక్కడే ప్రజలకు చేరువగా 540 సేవలు

జూలై ఆఖరు నాటికి నాడు-నేడు పనులు పూర్తి

రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి 

ప్రభుత్వం ఆదేశాల మేరకే రంగుల మార్పు

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో జేసీ (అభివృద్ధి) సీఎం సాయికాంత్‌ వర్మ


కడప, మే 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది.  ప్రజలకు 540 సేవలు అందేలా చూస్తా.. సచివాలయాల్లో మా పనులు జరగలేదని ఏ ఒక్కరు రాకుండా సచివాలయ వ్యవస్థతను బలోపేతం చేస్తాను. నా పరిధిలో నవశకం పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూస్తాను. నాడు-నేడు పనులు జూలై ఆఖరు నాటికి, సచివాలయ, రైతు భరోసా భవనాలు మార్చి ఆఖరు నాటికి పూర్తి చేస్తాం. హైకోర్టు సూచన నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు సచివాలయాల రంగులు మార్పులు చేస్తాం అని ఇటీవలే జాయింట్‌ కలెక్టరు (అభివృద్ధి)గా బాధ్యతలు చేపట్టిన సీఎం సాయికాంత్‌వర్మ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..



ఆంధ్రజ్యోతి: జేసీ (అభివృద్ధి)గా బాధ్యతలు చేపట్టారు. ఏలా ఫీలవుతున్నారు. జిల్లాతో మీకున్న అనుబంధం వివరిస్తారా..?


జేసీ : అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు మరింత చేరువవ్వాలనే సంకల్పంతో సీఎం జగన్‌ ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను నియమించారు. కొత్తగా జేసీ (డెవల్‌పమెంట్‌) తీసుకొచ్చారు. సీఎం సొంత జిల్లాకు తొలి జేసీ (అభివృద్ధి)గా రావడం ఆనందంగా ఉంది. బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. మా నాన్న మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ ప్రభుత్వ రంగ సంస్థ రీజినల్‌ మేనేజరుగా కడప జిల్లాలో పనిచేశారు. ఆ సమయంలో నేను ఇక్కడే చదువుకున్నా. కడప జిల్లా పరిస్థితులపై చదువుకునే రోజుల్లోనే అవగాహన ఉంది. 


ఆంధ్రజ్యోతి: సచివాలయ రంగులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రంగులు మారుస్తారా..?


జేసీ : హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, నిబంధనలు, ఆదేశాల మేరకు సచివాలయాల రంగులు మార్పు ఉంటుంది.


ఆంధ్రజ్యోతి: జేసీ (అభివృద్ధి).. అంటే మీ హోదాలోనే డెవల్‌పమెంట్‌ ఉంది. జిల్లా అభివృద్ధి కోసం మీ ప్రణాళిక ఏమిటో వివరిస్తారా..?.


జేసీ : ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడు విభాగాల ప్రగతిపై దృష్టి కేంద్రీకరించాం. జూలై ఆఖరు నాటికి అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేయాలి. ఎక్కడా ఇబ్బంది రాకూడదు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలనే దిశగా ముందుకు వెళ్తాను. అదే క్రమంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల భవనాల నిర్మాణాలు 2021 మార్చి ఆఖరు నాటికి పూర్తి చేయాలి. ప్రథమ కర్తవ్యం ఇదే. 


ఆంధ్రజ్యోతి: నిధుల సమస్య ఏమైనా ఉందా..?


జేసీ : నాడు-నేడు కార్యక్రమానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలను జాతీయ ఉపాధి హామీ కన్వర్జేషన్‌ నిధులతో నిర్మిస్తున్నారు. దీంతో నిధుల కొరత అనే సమస్యే లేదు. 


ఆంధ్రజ్యోతి: సచివాలయ వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..?


జేసీ : సచివాలయ వ్యవస్థ సీఎం జగన్‌ ప్రతిష్టాత్మక వ్వవస్థ. గ్రామంలోనే ప్రజలకు అన్ని రకాల సేవలు అందాలని సీఎం సంకల్పం. ఏ ఒక్కరు కూడా సమస్యల కోసం మండల, జిల్లా కేంద్రాలకు రాకూడదు. గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రజల ముంగిటే 540 సేవలు అందాలి. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలా సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తాను. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టరు సూచనలతో ముందుకు వెళ్తాను.


ఆంధ్రజ్యోతి: వాహన మిత్ర మీ పరిధిలోకే వస్తుంది కాదా..? అర్హులకు అందేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?


జేసీ : వాహన మిత్ర తొలి విడత జాబితా సిద్ధంగా ఉంది. అర్హులైన వారు ఎవరైనా ఉంటే ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 4వ తేదీలోగా అర్హుల జాబితాను ప్రభుత్వానికి అందజేస్తాం. 


వ్యక్తిగత వివరాలు ఇలా:

పేరు : సీఎం సాయికాంత్‌వర్మ

హోదా : జాయింట్‌ కలెక్టరు (డెవల్‌పమెంట్‌)

సొంత ఊరు : కర్నూలు నగరం, వన్‌టౌన్‌ ఏరియా చిత్తరవీధి

తల్లిదండ్రులు : నాన్న చంద్రకాంత్‌, అమ్మ జ్ఞానేశ్వరి

విద్యాభ్యాసం : కర్నూలు, కడప, ఒంగోలులో పాఠశాల విద్య, హైదరాబాదులో ఇంటర్‌, ఐఐటీ మద్రా్‌సలో బీటెక్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేశారు. 


సివిల్‌ ప్రిపరేషన్‌ : బీటెక్‌ కంప్యూటర్‌ పూర్తి చేశాక గూగుల్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా చేరారు. సివిల్‌పై ఆసక్తితో హైదరాబాదులో ఇంట్లోనే సాధన చేశారు. 2015 బ్యాచ్‌లో ఐఏఎ్‌సగా ఎంపికయ్యారు. 


ఉద్యోగ ప్రస్థానం: ఐఏఎస్‌గా ఎంపిక, ట్రైనింగ్‌ పూర్తయ్యాక రాజమండ్రి సబ్‌ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా విధుల్లో చేరి చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేశారు. సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేసీ (డెవల్‌పమెంట్‌)గా సీఎం స్వంత జిల్లాలోనే బాధ్యతలు చేపట్టారు.


భార్య: పృద్వీ, హైదరాబాదులో పీజీ చేస్తున్నారు.


యువతకు సందేశం: ఉజ్వల భవితకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నిరాశ, నిస్పృహలు వీడి ఆసక్తి ఉన్న రంగంలో కసిగా కష్టపడాలి. విజయం తధ్యం. 

Updated Date - 2020-05-25T10:23:47+05:30 IST