నాకు శిక్షణనివ్వడానికి గోపీచంద్ చాలా కష్టపడ్డారు: సైనా

ABN , First Publish Date - 2020-05-15T22:14:37+05:30 IST

లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తెచ్చిన బ్యాడ్మింటన్‌ స్టార్‌.. సైనా నెహ్వాల్‌. ఆమెకు శిక్షణనిచ్చిన ‘ద్రోణాచార్యుడు’.. పుల్లెల గోపీచంద్‌. రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌లతో జరిగిన

నాకు శిక్షణనివ్వడానికి గోపీచంద్ చాలా కష్టపడ్డారు: సైనా

తొలి స్పాన్సరర్‌... చాముండి అంకులే

ప్రాక్టీస్‌కు నెలకు 30 వేలు.. గోపీచంద్‌ చాలాసార్లు తిట్టారు

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో సైనా నెహ్వాల్‌

స్టార్లతోనే క్రీడలకు ఆదరణ.. అకాడమీకి చంద్రబాబు భూమి ఇచ్చారు

వైఎస్‌ భూమిని వెనక్కి తీసుకోవాలని చూశారు: గోపీచంద్‌


లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తెచ్చిన బ్యాడ్మింటన్‌ స్టార్‌.. సైనా నెహ్వాల్‌. ఆమెకు శిక్షణనిచ్చిన ‘ద్రోణాచార్యుడు’.. పుల్లెల గోపీచంద్‌. రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌లతో జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం 20-8-2012న ఏబీఎన్‌లో ప్రసారమయింది. ఆ వివరాలు.. 


ఆర్కే: ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకున్నందుకు అసంతృప్తిగా ఉందా?

సైనా: బంగారు పతకం సాధించడమే నా లక్ష్యం. కానీ, సెమీ ఫైనల్‌ రోజున బాగా ఆడలేకపోయా. ఒలింపిక్స్‌ తర్వాత నాలుగో ర్యాంకుకు చేరుకున్నా.

గోపీచంద్‌: నేను ఒలింపిక్స్‌ పతకం సాధించలేకపోయా. అందువల్ల నా శిష్యులైనా సాధించాలని కోరుకున్నా. అందుకోసం సైనాపై ప్రత్యేక దృష్టి పెట్టా.


ఆర్కే: 15 ఏళ్లుగా ఏపీలో ఉండి తెలుగు నేర్చుకోలేకపోయారా?

సైనా: అకాడమీలో అందరూ హిందీ మాట్లాడుతారు. అయినా.. తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ, సరిగా మాట్లాడలేకపోతున్నా.


ఆర్కే: మీరు ఏ టోర్నీ గెలిచినా.. హర్యానా మొదట స్పందిస్తుందేం?

సైనా: ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా క్రీడాకారుల విషయంలో అలాగే స్పందిస్తుంది. నేను నా కెరీర్‌ను మొదలు పెట్టింది, కొనసాగిస్తున్నది ఏపీలో.. కాబట్టి నేను ఇక్కడి అమ్మాయినే. కానీ, పుట్టింది హర్యానాలో కాబట్టి నన్ను తమదానిగా అభిమానిస్తారు.


ఆర్కే: గ్లామర్‌ ఉన్న క్రీడలకే డబ్బు వస్తోంది

గోపి: ఆటలకు ఆదరణను కూడా మార్కెట్‌ శక్తులు ప్రభావితం చేస్తాయి. సామర్థ్యం ఉంటేనే క్రీడాకారులు స్టార్స్‌ అవుతారు. స్టార్‌ ఆటగాళ్లు ఆడితేనే ఆ క్రీడకు ప్రచారం లభిస్తుంది. సచిన్‌ వల్ల క్రికెట్‌కు, సానియాతో టెన్నిస్‌కు, సైనాతో బ్యాడ్మింటన్‌కు పాపులారిటీ వచ్చినట్లు.. మిగతా క్రీడల్లో స్టార్లు వచ్చినప్పుడు వాటికి ఆదరణా పెరుగుతుంది.


ఆర్కే: ఇలా ఒక వ్యక్తి వల్ల ఆటకు ప్రాధాన్యత రావడం సరైనదేనా?

సైనా: క్రీడాకారులకు పాపులారిటీ వచ్చిన తర్వాత మార్కెట్‌ శక్తులు, డబ్బు వారిని ప్రభావితం చేయడం సాధారణమే. కానీ, ఆడేవారికే దానిపై నియంత్రణ ఉండాలి. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించుకోవాలి.

గోపి: పరిస్థితి ఇప్పుడలా ఉంది. అది సరికాకున్నా ఇప్పుడు మార్చలేం. అయితే.. క్రీడ ల్లో కెరీర్‌ చాలా చిన్నది.. ఏం సంపాదించినా ఆలోపే కదా. కానీ, ఆట మీద పట్టు మాత్రం కోల్పోకుండా చూసుకోవాలి.


ఆర్కే: ర్యాంప్‌ వాక్‌ చేయడం వెనుక ఉద్దేశం?

సైనా: వరుసగా మూడు టోర్నీలు ఆడి, పదిహేను మ్యాచ్‌లు గెలిచాను. తర్వాత విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ, నేను తిరిగొచ్చిన వెంటనే ర్యాంప్‌ వాక్‌ చేశాను. అయితే.. ఫ్యాషన్‌ డిజైనర్‌ నాకు ముందు నుంచే తెలుసు. ఆమె నన్ను చాలా సార్లు కోరినా.. తిరస్కరించాను. కానీ, అప్పుడు మాత్రం సరదాకి ఓకే చెప్పాను. అయినా.. ఇలాంటి వాటితో నా ఆటపై ప్రభావం పడనీయను.


డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాక ఏడ్చేస్తా


ఆర్కే: ఒలింపిక్స్‌లో మొదట కసిగా ఆడినా.. సెమీస్‌లో అలా?

సైనా: సెమీస్‌ మ్యాచ్‌లో గేమ్‌ల మధ్య ఆలోచించుకోవడానికి సమయం లేకపోయింది. ఆ రోజు నేను అనుసరించిన వ్యూహమూ ఫలించలేదు. తర్వాత కాంస్యం కోసం జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో.. బాగా ఆడుతున్న దశలో.. ప్రత్యర్థి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగింది.


ఆర్కే: బ్యాడ్మింటన్‌ ఖరీదైన ఆటేగా? 

గోపి: ఒక్కో షటిల్‌కాక్‌ రూ.70 -80 ఉంటుంది. మంచి లెవల్‌ ఆడే వాళ్లకి దాదాపు రోజుకు 2 వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే.. చిన్నప్పటి నుంచే బాగా ఆడితే.. స్కాలర్‌షిప్‌లతోనో, సాయంతోనో ఉచితంగా వచ్చే పరిస్థితి ఉంది.

సైనా: నేను ప్రాక్టీస్‌ చేస్తున్న తొలిరోజుల్లో రోజుకు రూ.600 దాకా ఖర్చయ్యేవి. అవన్నీ నాన్నే సమకూర్చారు. స్నేహితుల నుంచి అప్పులు కూడా చేశారు. ఈ మధ్యే నాకా విషయం చెప్పారు. శిక్షణకు, ప్రయాణానికి నెలకు 20-30 వేల దాకా ఖర్చయ్యాయి.


ఆర్కే: బాడ్మింటన్‌ను ఎందుకు ఎంచుకున్నారు?

సైనా: అమ్మానాన్నలిద్దరూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులే. హర్యానాకు ఆడారు. మా చెల్లెలూ ఆడుతుంది. నేను కరాటే కూడా నేర్చుకున్నా. బ్లాక్‌బెల్ట్‌ దాకా వచ్చి ఆపేశా.


ఆర్కే: గోపీచంద్‌.. మీరు బ్యాడ్మింటన్‌లోకెలా వచ్చారు?

గోపి: మొదట్లో నేను క్రికెట్‌ ఆడేవాడిని. అయితే.. అప్పట్లో మా పిన్ని బ్యాడ్మింటన్‌ ఆడుతుండడంతో.. నేనూ మొదలుపెట్టా. కెరీర్‌ మంచి స్థితిలో ఉన్నప్పుడు.. మోకాలికి రెండు మూడు సార్లు సర్జరీలు జరిగాయి. దాంతో ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ షిప్‌ తర్వాత పెద్దగా ఆడలేదు. మొదట్లో మేం ఆడేటప్పుడు.. కోచ్‌లు, స్టేడియం ఇలా ఏ సౌకర్యాలు సరిగా దొరికేవి కావు. దాంతో బాడ్మింటన్‌ అకాడమీ పెట్టాలని ఆలోచన తట్టింది. దానికి భూమి కేటాయించడానికి చంద్రబాబు సహకరించారు.. మాట్రిక్స్‌ ప్రసాద్‌ రూ. 5 కోట్లు ఇచ్చారు. చిత్రమేమిటంటే.. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అకాడమీలోని స్థలాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించింది. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నాం. నిమ్మగడ్డ ప్రసాద్‌ కొంత వరకూ సహాయం చేశారు. తర్వాత ప్రభుత్వం దాన్ని విత్‌డ్రా చేసుకుంది.


ఆర్కే: ఆడేటప్పుడు పెద్దగా ఎక్‌ప్రెషన్స్‌ కనిపించవేం?

సైనా: ఆడేటప్పుడు మధ్యలో పెద్దగా అరవడం వంటివి నాకు ఇష్టం ఉండవు. ఒక్కోసారి గేమ్‌ పాయింట్‌ సమయంలో మాత్రం అరుస్తుంటా. ఓడిపోయినప్పుడు మాత్రం కన్నీళ్లు వచ్చేస్తాయి. కానీ, డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాక ఏడ్చేస్తా. ఒలింపిక్స్‌ సెమీస్‌లో ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. కాంస్య పతకంతో పూర్తి సంతృప్తి లేదు.


ఆర్కే: మీకు ఇష్టమైనవి?

సైనా: టెన్నిస్‌, క్రికెట్‌ చూస్తా. సినిమాలు, షాపింగ్‌ కూడా ఇష్టమే. ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టం.


ఆర్కే: మీలో అదృష్టవంతులు గురువా? శిష్యురాలా?

సైనా: గోపీచంద్‌ అకాడమీ పెట్టడం నా అదృష్టమనే చెప్పొచ్చు. ఆయన నాకు శిక్షణ ఇవ్వడంలో ఎంతో కష్టపడ్డారు. ఆయనలో.. చెడు క్వాలిటీలంటూ ఏమీ లేవు. చాలా సార్లు తిట్టారు.. కానీ, వెంటనే ఆ విషయాన్ని వదిలిపెట్టేస్తారు. కోచ్‌గా ఆయనకు 100కు పైగా మార్కులేస్తా.

గోపి: సైనా కచ్చితంగా గెలవాలన్న కసితో ఆడుతుంది. సరై న టైమింగ్‌ పాటిస్తుంది. ఆమె గురువును మించిన శిష్యురాలు


ఆర్కే: మీ మొదటి స్పాన్సరర్‌ ఎవరు?

సైనా: నా మొదటి విదేశీ టోర్నీకి చాముండేశ్వరినాథ్‌ (ఆంధ్రా క్రికెట్‌ అసొసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు) అంకుల్‌ స్పాన్సర్‌ చేశారు. అయితే.. అది జూనియర్‌ టోర్నీ కావడంతో ప్రభుత్వం స్పాన్సర్‌ చేయలేదు. దాంతో మొదట నేను వెళ్లనన్నాను.. కానీ, వెళ్లు, నీకు నేను సాయం చేస్తాను అని చాముండి అంకుల్‌ భరోసా ఇచ్చారు. అప్పుడు నాకు పన్నెండేళ్లు. మరో రెండేళ్ల తర్వాత భారత్‌ పెట్రోలియం సంస్థ నాకు స్పాన్సర్‌ చేసింది.


ఆర్కే: మీ తర్వాతి లక్ష్యాలేంటి?

గోపి: ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన ఆనందంలోనే ఉన్నాం. తర్వాతేంటి అనేది ఇంకా ఆలోచించలేదు.

సైనా: మరిన్ని టోర్నమెంట్లు గెలవాలి. ఏషియన్‌ గేమ్స్‌, ప్రపంచ చాంపియన్‌ వంటివి సాధించాలి.

Updated Date - 2020-05-15T22:14:37+05:30 IST