ప్రియుడితో వెనక్కి వచ్చేసిన సాయిప్రియ

ABN , First Publish Date - 2022-07-30T09:17:50+05:30 IST

పెళ్లి రోజున భర్తతో బీచ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయిన సాయిప్రియ.. శుక్రవారం అతనితో

ప్రియుడితో వెనక్కి వచ్చేసిన సాయిప్రియ

భర్తకూ, ప్రభుత్వానికీ, సమాజానికీ క్షమాపణలు

రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన జంట


విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పెళ్లి రోజున భర్తతో బీచ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయిన సాయిప్రియ.. శుక్రవారం అతనితో విశాఖపట్నం తిరిగొచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమె సముద్రంలో గల్లంతైందనే అనుమానంతో నేవీ, కోస్టుగార్డు సిబ్బంది విస్తృతంగా గాలించారు. ఆ తర్వాత.. ఆమె తాను ప్రేమించిన రవితో కలిసి బెంగళూరులో ఉన్నట్టు తేలింది. ఇష్టపూర్వకంగా రవితో వచ్చేశానని, తాము ప్రేమించుకున్నామంటూ తండ్రి ఫోన్‌కు వాయిస్‌ మెసేజ్‌ పంపింది. అయితే ఆమె అదృశ్యమైన రోజే తండ్రి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఏం చేయాలి?..అని ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో.. సాయిప్రియ, రవి శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వచ్చేశారు. ఎన్‌ఏడీ జంక్షన్‌లో వారింటి పరిధిలోకి వచ్చే ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, తమకు రక్షణ కల్పించాలని కోరారు. దాంతో పోలీసులు వారిద్దరినీ ఒక గదిలో ఉంచి, వారి పెద్దలకు సమాచారం అందించారు.


సాయిప్రియ తరఫు బంధువులు మాత్రమే వచ్చారు. రవి తరఫున ఎవరూ రాలేదు. ఆ గదిలో కొద్దిసేపు వారంతా ఘర్షణ పడ్డారు. ఏం జరిగిందనేది పోలీసులు వెల్లడించలేదు. వారిచ్చిన స్టేట్‌మెంట్‌ రికార్టు చేసుకున్నారు. ఆ తరువాత మీడియా అక్కడకు వెళ్లిన సమయంలో.. సాయిప్రియ స్పృహ తప్పి పడిపోయింది. ఆ తరువాత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వారిని పోలీసులు పంపించేశారు. ఆ సమయంలో మీడియా సాయిప్రియ, రవి ఇద్దరినీ ప్రశ్నించగా, ప్రభుత్వానికీ సమాజానికీ తాము క్షమాపణ చెబుతున్నామన్నారు. భర్తను క్షమించాలని కోరుతున్నట్టు సాయిప్రియ పేర్కొంది. తాము పెద్దల వద్దకు వెళ్లబోమని, స్వతంత్రంగానే వేరుగా ఉంటామని రవి వెల్లడించాడు. ఆమె రెండు రోజులుగా ఏమీ తినలేదని, నీరసంగా ఉందని, అందుకు కళ్లు తిరిగి పడిపోయిందని వివరించాడు. దయ చేసి తమను ఎక్కువగా ప్రశ్నించవద్దని వేడుకున్నాడు. సాయిప్రియ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించింది. 

Updated Date - 2022-07-30T09:17:50+05:30 IST