మెడికల్‌ ఇన్‌ఫ్రాపై చంద్రబాబు శ్రద్ధ పెట్టలేదు

ABN , First Publish Date - 2021-05-15T09:59:23+05:30 IST

ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు.. మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి-భ్రమరావతి అంటూ వర్చ్యువల్‌ ..

మెడికల్‌ ఇన్‌ఫ్రాపై చంద్రబాబు శ్రద్ధ పెట్టలేదు

బెడ్లు లేకుండా వెళ్తే ప్రాణాలకే ప్రమాదం: సజ్జల

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు.. మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి-భ్రమరావతి అంటూ వర్చ్యువల్‌ మీటింగ్‌లతో కాలం గడేపేశారని.. ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదంటూ విమర్శలు చేసేందుకు లోకేశ్‌కు సిగ్గుండాలని అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలను చంద్రబాబు గాలికొదిలేశారని, ఇప్పుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి వాటిపై దృష్టి పెట్టారని.. నాలుగేళ్లలో వాటిని పూర్తి చేసి చూపిస్తారని తెలిపారు. పొరుగున ఉన్న ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మన అంబులెన్సులను అడ్డుకోవడం లేదని, కేవలం తెలంగాణ సరిహద్దు వద్దే ఈ పరిస్థితి ఎదురవుతోందని చెప్పారు. ఇలాంటి సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని తెలంగాణ  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ‘తెలంగాణలోనూ బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. రాష్ట్రం నుంచి వెళ్లేవారు అక్కడ బెడ్లు ఖరారు కాకుండా వెళ్లవద్దు. అక్కడకు వెళ్లాక బెడ్‌ లేకపోతే.. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు. 

ఆ మరణాలకు తెలంగాణదే బాధ్యత: రామకృష్ణ

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ‘‘మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళుతున్న అంబులెన్సులను పోలీసులు ఆపడం వల్ల నంద్యాల, కడపకు చెందిన ఇద్దరు కొవిడ్‌ రోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. కరోనా బాధితుల ప్రాణాలతో చెలగాటమాడడం తగదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తెలంగాణ హైకోర్టు హెచ్చరించినా కనీస మానవత్వం లేకుండా ఏపీ అంబులెన్స్‌లను పోలీసులు ఆపడం దుర్మార్గమన్నారు. 

Updated Date - 2021-05-15T09:59:23+05:30 IST