సజ్జల స్ర్కిప్టు.. సీఎం డైరెక్షన్‌..డీజీపీ యాక్షన్‌

ABN , First Publish Date - 2021-01-17T08:23:45+05:30 IST

దేవాలయాలపై దాడులు, విధ్వంసాలను ఆపడం చేతగాక టీడీపీపై బురద చల్లుతున్నారని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

సజ్జల స్ర్కిప్టు.. సీఎం డైరెక్షన్‌..డీజీపీ యాక్షన్‌

  • ఆలయాలపై నిలదీస్తే కేసులా?
  • దాడులను ఆపలేక టీడీపీ నేతలపై బురద
  • రాష్ట్రమంతా దాడులు చేసే వైసీపీని వదిలేసి
  • బయటపెట్టే టీడీపీ నేతలపైనే వేధింపులా?
  • కోడి కత్తి, వివేకా హత్య విషయంలోనూ ఇంతే
  • ఆ కేసులను గతంలో మాపై మోపే యత్నం
  • విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం వెళ్లినా
  • నాపైనా, అచ్చెన్న, కళాలపైనే కేసులా?
  • తిరుపతి ఎన్నికల్లో వీరికి గుణపాఠం చెప్పాలి
  • నియోజకవర్గ శ్రేణులతో చంద్రబాబు 


అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): దేవాలయాలపై దాడులు, విధ్వంసాలను ఆపడం చేతగాక టీడీపీపై బురద చల్లుతున్నారని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సలహాదారు సజ్జల స్ర్కిప్ట్‌ రాస్తే, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి డైరెక్షన్‌లో డీజీపీ యాక్షన్‌ చేస్తున్నారని, పోగాలం దాపురిస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని టీడీపీ నేతలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఆలయాలపై దాడులకు రాజకీయాలతో సంబంధం లేదని, ఉన్మాదులు, పిచ్చోళ్ల పని అని భోగి పండగ రోజు డీజీపీ చెప్పారు. కనుమ పండగ రోజు వచ్చేసరికి మాట మార్చి ప్రతిపక్షాలకు ఈ దాడులను అంటగడుతున్నారు. దాడులు చేసిన వారిని వదిలేసి నిలదీసిన వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారు. కోడి కత్తి కేసు, వివేకాహత్య కేసు కూడా టీడీపీకి అంటగట్టాలని చూశారు’’ అని గుర్తుచేశారు. రామతీర్థం ఉదంతంలో టీడీపీ సానుభూతిపరుడు సూరిబాబును ఇరికించాలని భౌతికంగా హింసించారన్నారు. విగ్రహాల తల నరకడం, తన్నడం తమ మత ప్రచారంలో భాగమని ప్రచారకులు చెబుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 


‘‘సింహాద్రి అప్పన్న గుడి, శ్రీకాళహస్తి, అన్నవరం, కాణిపాకంలో అక్రమాలు, అపచారాలకు టీడీపీయే కారణమా? మాన్సాస్‌ ట్రస్ట్‌కు తూట్లు పొడిచింది ఎవరు? అన్యమత ప్రచారాలు, బలవంతపు మత మార్పిళ్లు చేస్తోంది ఎవరు? దుర్గమ్మ వెండి సింహాలు ఏమయ్యాయి? అంతర్వేది, కొండ బిట్రగుంట రథాలు ఎలా తగలబడ్డాయి? దాడులు చేసిన వారిని వదిలేసి నిలదీసిన వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతోంది వైసీపీ వారైతే వాటిని బయట పెట్టింది టీడీపీ. విధ్వంసాలు చేసిన వైసీపీ వారిపై ఎక్కడా కేసులే లేవు’’ అని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ‘‘జగన్‌రెడ్డి చర్యలను మేం ఎత్తిచూపితే గోమాత పూజ పేరుతో ఇంకో జగన్నాటకం ప్రారంభించారు. ఎన్నికల ముందు రుషికేశ్‌ వద్ద నదిలో మునకేసి ఆయన చేసిన డ్రామాను ప్రజలు ఇంకా మర్చిపోలేదు జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలపై దాడులు చేస్తే వారికి అండగా ఉంది టీడీపీనే. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య, రాజమహేంద్రవరంలో సత్తార్‌ ఆత్మహత్యా ప్రయత్నం, నెల్లూరులో ముస్లిముల ఇళ్ల కూల్చివేత, పల్నాడులో ముస్లిముల గ్రామ బహిష్కరణలపై మనమే పోరాడాం. దళితులపై అమానుష అఘాయిత్యాలను కూడా టీడీపీయే వెలుగులోకి తెచ్చి పోరాడింది.


విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌, చిత్తూరులో డాక్టర్‌ అనితా రాణి, పుంగనూరులో న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడులను నిరసించాం. గురజాలతో దోమతోటి విక్రమ్‌, చీరాలలో కిరణ్‌ కుమార్‌ హత్యలపై నిలదీశాం. పుంగనూరులో ఓం ప్రకాశ్‌ అనుమానాస్పద మృతిపై పోరాడాం. ఈ వర్గాలన్నీ తిరుపతి ఉప ఎన్నికలో జగన్‌ రెడ్డి ప్రభుత్వ అహంభావానికి తగిన పాఠం చెప్పాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. 


పారిశ్రామికవేత్తలు పోయి స్మగ్లర్లు వచ్చారు

జగన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు పోయి స్మగ్లింగ్‌ వచ్చిందని, పారిశ్రామికవేత్తలు పారిపోతే ఎర్ర చందనం చిత్తూరు జిల్లాలో స్మగ్లర్లు రాజ్యమేలుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘‘తిరుపతిని హార్డ్‌వేర్‌ హబ్‌గా, మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాం. చిత్తూరు జిల్లాలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి లక్ష మందికి ఉపాధి కల్పించాం. పెప్సికో, క్యాడ్‌బరీ, ఇసుజు, హీరో మోటోకార్ప్‌, రిలయన్స్‌, కోబాల్కో వంటి పరిశ్రమలన్నీ టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తెచ్చినవే. తిరుపతి, శ్రీసిటీ, కృష్ణపట్నాలను మూడు నగరాలుగా అభివృద్ధి చేశాం.  శ్రీసిటీలో ఉన్న 185 పరిశ్రమల్లో సగానికిపైగా టీడీపీ హయాంలో నెలకొల్పినవే. వైసీపీ వచ్చిన తర్వాత కొత్తవి తీసుకురాకపోగా అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌ భూములు రద్దు చేశారు. టీడీపీ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడాం. టీటీడీ బోర్డులో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాం. వైసీపీ వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను పోగొట్టారు. ఎస్వీబీసీ చైర్మన్‌ అసభ్య ప్రవర్తన, భక్తులకు అసభ్య లింకులు పంపడం వంటి చర్యలతో దైవ ద్రోహానికి పాల్పడ్డారు. ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత కావాలి. తిరుమల పవిత్రతను కాపాడటానికి చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలి. జనవరి 21 నుంచి పది రోజులపాటు ఏడు వందల గ్రామాల్లో ఉధృతంగా ప్రచారం చేయాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 18న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్థంతిని ఘనంగా జరపాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల అహంభావం, అరాచకాలకు పాఠం చెప్పేలా పని చేయాలని టీడీఎల్పీ ఉప నేత రామానాయుడు కోరారు. 


‘‘కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పూజారులను చర్నాకోలతో కొట్టిన ఘటనకూ, చీరాలలో అర్చకుడు శ్రీనివాస చక్రవర్తి ఆత్మహత్యకూ టీడీపీయే కారణమా? రామతీర్థం వెళ్లామని నాపైనా, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపైనా తప్పుడు కేసులు పెట్టారు. మాకన్నా గంటముందు వెళ్లి రెచ్చగొట్టిన విజయసాయి రెడ్డి, వైసీపీ నాయకులపై కేసులు పెట్టారా?’’

- టీడీపీ అధినేత చంద్రబాబు

Updated Date - 2021-01-17T08:23:45+05:30 IST