సంక్రాంతి సందడి.. సంతలదేనండీ..!

ABN , First Publish Date - 2021-01-12T05:20:42+05:30 IST

సంక్రాంతి సందడి.. సంతలదేనండీ..!

సంక్రాంతి సందడి.. సంతలదేనండీ..!
సంక్రాంతి కావటంతో కొనుగోలుదారులతో నిండుగా కనిపిస్తున్న చింతాడ సంత


ఆదరణ తగ్గనివైనం

 వస్తువుల కొనుగోలుపై ప్రజలు, రైతుల ఆసక్తి 

(ఆమదాలవలస)

రైతులకు వారపు సంతలతో ఎంతో అనుబంధం ఉంది. వ్యవసాయ పనిముట్లు, సాగుకు ఉపయోగపడే పశువులు సైతం అందుబాటులో ఉంటాయి. జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట సంత జరుగుతూనే ఉంటుందంటే వీటి ప్రాధాన్యత ఎంతో అర్ధంచేసుకోవచ్చు. శనివారం చింతాడ, సోమవారం బుడుమూరు, సీతంపేట, మంగళవారం గార, కొల్లివలస, గురువారం రాజాం, నారాయణవలసలతో పాటు ఇచ్ఛాపురం, మందస, పలాస, పొందూరుల్లోనూ వారపు సంతలు నిర్వహిస్తున్నారు. క్రయవిక్రయాలు లక్షల్లో సాగుతుంటాయి. ఈ పండగ సీజన్‌లో అయితే మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నేటికీ చాలామంది వ్యపాయ పనిముట్లతో పాటు ఇంటికి సరిపోయే నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. ఎంతో వస్త్ర ప్రపంచం అభివృద్ధి చెందినా ఇంటిల్లిపాదికీ వస్త్రాలు కొనుగోలుకు చాలామంది వారపు సంతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వారికి అక్కడ వ్యాపారులపై ఉన్న నమ్మకమే దీనికి కారణం.. బహిరంగ మార్కెట్‌లో లభించని వస్తువైనా ఈ సంతల్లో అందుబాటులో ఉంటుందని సంతల్లో పాల్గొనేవారు చెబుతుంటారు.


ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయంటే...

ఒక్కో సంతలో ఒక్కో వస్తువుకు గిరాకీ ఉంటుంది. చింతాడలో పొట్టేళ్లు, పశువులు, మేదర వస్తువులు, ఇళ్ల సామగ్రి, వస్త్రాలు విక్రయాలు ఎక్కువగా సాగుతాయి. బుడుమూరులో పశువులు, మంద గొర్రెలు, కూరగాయలు, ఎండుచేపలు, రాజాంలో పశువులు, కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. వేసవిలో మామిడి ఫలాలు విరివిగా దొరుకుతాయి. సీతంపేటలో చింతపండు, సీతాఫలం, పైనాపిల్‌, చిరుధాన్యాలు, మేకలు లభిస్తాయి. గారలో మేకలు, కూరగాయలు, వ్యవసాయ పనిముట్లు, చేపలు అందుబాటులో ఉంటాయి. ఇటీవల నిర్వహించిన చింతాడ సంతలో పొట్టేళ్లు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. కొనుగోలుదారులకు అవసరమైన వస్తువులను తీసుకు వచ్చి విక్రయించే వ్యాపారులు ఈ సంతలపైనే జీవనం సాగిస్తున్నారు.  ప్రతి ఏటా చింతాడ వారపు ఆశీలువసూలు పాట తుడుపు చార్జీలతో కలిపి ఏడాదికి రూ.12లక్షలపైనే ఉంటుందంటే సంత ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతికి ముఖ్యంగా మట్టి కుండలు, వస్త్రాలు కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. అలాగే కనుమ రోజున బంధుమిత్రులకు విందు ఏర్పాటుకు పొట్టేళ్లు, మేకలు తదితరాలను కొంటుంటారు.


పండగ రోజుల్లో..

సంక్రాంతి, ఉగాది, వేసవి సీజన్‌లలో సంతలు క్రయవిక్రయదారులతో సందడిగా ఉంటాయి. సంక్రాంతి పండగకు చింతాడ సంతలో పొట్టేళ్లు కొనుగోలు ఎక్కువగా కనిపిస్తుంది. విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు.

  

Updated Date - 2021-01-12T05:20:42+05:30 IST