రోత రాతల నీలి మీడియా.. ఎక్కడ పెట్టుకుంటారు మీ తల?

ABN , First Publish Date - 2021-12-12T08:16:53+05:30 IST

రోత రాతల నీలి మీడియా.. ఎక్కడ పెట్టుకుంటారు మీ తల?

రోత రాతల నీలి మీడియా.. ఎక్కడ పెట్టుకుంటారు మీ తల?

జగన్‌ పత్రికలో అచ్చోసిన అబద్ధాలు.. వీడియో సాక్షిగా రుజువైన వాస్తవం

సీఐడీకి సహకరించాలని ఆర్కే సూచన.. ఆయన వచ్చాకే సద్దుమణిగిన ఉద్రిక్తత

‘ఎవరు మాట్లాడినా నాదీ బాధ్యత’ అని రాధాకృష్ణ స్పష్టమైన హామీ

‘మీరు ఉండండి’ అని సీఐడీ రిక్వెస్ట్‌.. పని అయిపోయాక ‘థ్యాంక్స్‌’


అమరావతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏమాత్రం వెరపు లేదు! ఎంతమాత్రం నైతికత కానరాదు! అసత్యాలు అచ్చోయడమే ‘నీలిమూక’ నైజమని మరోసారి ‘అక్షరాలా’ రుజువైంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థ కేసులో శుక్రవారం రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణను ప్రశ్నించేందుకు వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులను ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అడ్డుకున్నారంటూ జగన్‌ చానల్‌ ఒక అబద్ధపు వార్తను ప్రసారం చేసింది. అక్కడ జరిగిందేమిటో తెలిసినప్పటికీ తప్పుడు కథనం వండి వార్చింది. అంతటితో ఆగకుండా... శనివారం సంచికలో జగన్‌ పత్రిక కూడా పతాక శీర్షికలో ఇదే తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ‘టీడీపీ గ్యాంగ్‌ హల్‌షెల్‌’ అంటూ... తమను వేమూరి రాధాకృష్ణ అడ్డుకోవడంతో సీఐడీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారని పిచ్చి రాతలు రాసింది. అయితే... అక్కడ జరిగింది వేరని, నీలి మీడియావి పచ్చి బూతులని ససాక్ష్యంగా రుజువైంది. లక్ష్మీనారాయణ నివాసంలో వేమూరి రాధాకృష్ణ ఉండగా జరిగిన సంభాషణలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. వాటిని పరిశీలిస్తే... సీఐడీ అధికారులను ఆర్కే అడ్డుకోలేదని, పైగా... వారికి సహకరించాల్సిందిగా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు సూచించారని స్పష్టంగా తేలుతుంది. ఇప్పుడు... జగన్‌ చానల్‌, పత్రిక ఏంచెబుతాయి? ఈ నీలిమూక తమ తలకాయలను ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి!


ఇదీ అక్కడ జరిగింది...

వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీనారాయణ చిరకాల మిత్రుడు. జూబ్లీహిల్స్‌లో ఇద్దరి నివాసాలు కూడా దగ్గర దగ్గరే ఉంటాయి. ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసి... ఆయనకు ధైర్యం చెప్పేందుకు రాధాకృష్ణ అక్కడికి వెళ్లారు. అప్పటికి చాలాసేపటి ముందే సీఐడీ సిబ్బంది లక్ష్మీనారాయణ ఇంట్లో ఉన్నారు. అంటే... ఆ తర్వాత ఎప్పుడో వచ్చిన రాధాకృష్ణ వారిని అడ్డుకునే అవకాశమూ లేదు! ఇక... వేమూరి రాధాకృష్ణ అక్కడికి చేరుకునే సమయానికి వాతావరణం కాస్త ఉద్రిక్తంగా ఉంది. లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, అక్కడ గుమికూడిన మరికొందరు సీఐడీ అధికారులను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. సోదాలు ఎలా చేస్తారని  ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వేమూరి రాధాకృష్ణ... ‘సీఐడీ సిబ్బందితో వాదనకు దిగితే ప్రయోజనం ఉండదు. మీరు సహకరిస్తే వాళ్ల పని వాళ్లు చేసుకుని వెళతారు’ అని లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. ఆ తర్వాతే అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. కొద్దిసేపటికి ఆర్కే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ... ‘మీరు కాసేపు ఉండండి! మీరు ఉంటే వీళ్లు కోఆపరేట్‌ చేస్తారు’ అని సీఐడీ అధికారులే కోరారు. కానీ...జగన్‌ చానల్‌ ‘సీఐడీని అడ్డుకున్న రాధాకృష్ణ’ అని ఒక విషపు వార్తను ప్రసారంలోకి తెచ్చింది. అక్కడే ఉన్న కొందరు ‘సాక్షి చానల్‌లో ఇలా వస్తోంది’ అని సీఐడీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ వార్తను సెల్‌ఫోన్‌లో వేమూరి రాధాకృష్ణకు చూపించారు. ‘ఇలా కూడా వేస్తారా’ అని సీఐడీ అధికారులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు... లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు, అడ్వొకేట్‌ మినహా ఇతరులు ఉండకూడదంటే వెళ్లిపోతామని ఆర్కే అన్నారు. ‘అవసరం లేదు. మీరు ఉండండి. మా పని చేసుకుంటాం’ అని సీఐడీ అధికారులు బదులిచ్చారు. ‘మీ పని డిస్టర్బ్‌ అయినా, ఎవరైనా మాట్లాడినా నాదీ బాధ్యత’ అని ఆర్కే వారికి స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. ఇవన్నీ వీడియోలో రికార్డు అయ్యాయి. సోదాలు ముగిసిన తర్వాత... ‘అంతా అయిపోయిందా’ అని రాధాకృష్ణ అడగడం... ‘అయిపోయింది సార్‌’ అని సీఐడీ అధికారులు కూల్‌గా బదులివ్వడం స్పష్టంగా వినిపించింది. ‘రాధాకృష్ణ అడ్డుకున్నారు’ అని జగన్‌ మీడియా అప్పటికే తప్పుడు వార్తలు ప్రసారం చేసిన నేపథ్యంలో... ‘మీకు కోఆపరేట్‌ చేయాలని లక్ష్మీనారాయణను కోరానని కూడా పంచనామాలో రాయండి’ అని సీఐడీ అధికారులతో సరదాగా అన్నారు. ‘మీకు చాలా చాలా థ్యాంక్స్‌’ అని వేమూరి రాధాకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఇవేవీ జగన్‌ చానల్‌ కెమెరాకు కనిపించలేదు. మైకులకు  వినిపించలేదు. వేమూరి రాధాకృష్ణను చూడగానే.... ‘ఆయన సీఐడీని అడ్డుకున్నారు’ అంటూ తప్పుడు కథనాన్ని గాలిలోకి వదిలింది. అదే తప్పుడు వార్తను జగన్‌ పత్రిక కూడా అచ్చోసింది. ఇప్పుడు తన తల ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి మరి!

Updated Date - 2021-12-12T08:16:53+05:30 IST