Abn logo
Dec 1 2020 @ 04:13AM

సలాం కేసులో పోలీసుల బెయిల్‌ రద్దు

నంద్యాల, నవంబరు 30: అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుల బెయిల్‌ను రద్దు చేస్తూ కర్నూలు జిల్లా నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు జడ్జి సువర్ణరాజు సోమవారం తీర్పు చెప్పారు. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ నిందితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేసిన మరుసటి రోజే ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు మూడో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై నవంబరు 28న వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసిన కోర్టు.. సోమవారం తీర్పు ప్రకటించింది. ఈ కేసులో ఐపీసీ 306 సెక్షన్‌ను పొందుపరుస్తూ నిందితులైన పోలీసుల బెయిల్‌ను రద్దు చేసింది. డిసెంబరు 2న నిందితులను కోర్టులో హాజరు పరచాలని జడ్జి ఆదేశించారు.


సీబీఐ విచారణతోనే నిజాలు వెలుగులోకి: ఫరూఖ్‌

సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ బెయిల్‌ రద్దుతోనైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూఖ్‌ వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ చేస్తేనే ఈ కేసులో అసలు నిజాలు బయటికి వస్తాయని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement