‘సలాం కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2020-12-04T22:42:12+05:30 IST

లాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ చలో అసెంబ్లీ చేపట్టామని..

‘సలాం కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి’

విజయవాడ: సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ చలో అసెంబ్లీ చేపట్టామని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి ఆర్గనైజింగ్ కన్వీనర్ షారుఖ్ షిబ్లీ అబ్దుల్  పేర్కొన్నారు. చలో అసెంబ్లీకి వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. నిన్న మండలిలో హోంమంత్రి మాట్లాడుతూ అబ్దుల్ సలాం దొంగతనం చేశారని అర్ధం వచ్చేలా మాట్లాడటం దారుణమని చెప్పారు.  ఈ చర్యలను  అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి ఖండిస్తుందని  తెలిపారు. సలాం నుంచి సేకరించిన బంగారం అంతా ఆయన కుటుంబ సభ్యులదేనని చెప్పారు. అకారణంగా ఆయనపై నింద మోపి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని మండిపడ్డారు. సలాం సేకరించిన బంగారం దొంగతనం చేసింది అని మాట్లాడుతారా అని ప్రశ్నించారు. నేను దొంగని కాదు అని నిరూపించుకోవడానికే సలాం కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని  చెప్పారు.  అన్ని రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాలు ఇచ్చిన మద్దతుతోనే ఈ పోరాటంతో రాష్ట్రంలో కదలిక వచ్చిందని తెలిపారు. సలాం కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇది ఇక్కడితో ఆగదని అన్యాయానికి గురయిన వారి తరఫున పోరాడతామని అన్నారు.


అకారణంగా అరెస్టులా..?

సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం చలో అసెంబ్లీకి  పిలుపునిస్తే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పదివేల మందిని  అకారణంగా అరెస్ట్ చేయడం అన్యాయమని టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఫతావుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ ఎందుకు అరెస్టు  చేశారో సమాధానం చెప్పాలని లేకపోతే ఆందోళనలు చేపడతామని చెప్పారు. చలో అసెంబ్లీతో సీఎం జగన్ భయపడ్డారన్నారు. సలాం కేసును హోంమంత్రి సుచరిత సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం శోచనీయం అన్నారు. నెల రోజులుగా రాష్ట్రంలో సలాం కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనలు చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. జగన్ చేపడుతున్న అనాలోచిత చర్యలతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు ఆపాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు.

Updated Date - 2020-12-04T22:42:12+05:30 IST