రేషన్‌ డీలర్ల నయా దందా

ABN , First Publish Date - 2022-01-28T05:34:30+05:30 IST

జిల్లాలోని కొందరు రేషన్‌ దుకాణాల డీలర్లు కొత్త దందాకు తెరలేపారు.

రేషన్‌ డీలర్ల నయా దందా
రేషన్‌ దుకాణాల్లో విక్రయిస్తున్న గోధుమపిండి, కందిపప్పు, నూనె

- దుకాణాల్లో ఇతర సరుకుల విక్రయం

- అవి కొంటేనే బియ్యం ఇస్తామని షరతు

- ఇబ్బంది పడుతున్న వినియోగదారులు

- పట్టించుకోని సివిల్‌ సప్లై అధికారులు

గద్వాల క్రైం, జనవరి 27 : జిల్లాలోని కొందరు రేషన్‌ దుకాణాల డీలర్లు కొత్త దందాకు తెరలేపారు. కార్డుదారులకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యంతో పాటు ఇతర సరుకులు అంటగడుతున్నారు. పైగా అవి తీసుకుంటేనే బియ్యం ఇస్తామంటూ మెలిక పెడుతున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి జిల్లాకే ప్రత్యేకమా? ఇతర జిల్లాల్లోనూ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారులు రేషన్‌ డీలర్లతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


బియ్యానికి బదులు ఇతర వస్తువులు

జిల్లాలో 333 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 1,60,654 రేషన్‌ కార్డులున్నాయి. వారికి ప్రభుత్వం ప్రతీనెల 4,978.43 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు. కానీ రేషన్‌ డీలర్లు మాత్రం కొందరరు అధికారుల అండదండలతో నయా దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్‌ బియ్యం, అంత్యోదయ కార్డు ఉన్నవారికి చెక్కర సరఫరా చేస్తోంది. కానీ డీలర్లు మాత్రం లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా కిలో రూ.10 చొప్పున లెక్కకట్టి ఇతర వస్తువులను అంటగడుతున్నారు. గోధుమపిండి, ఉప్పు, కందిపప్పు, సబ్బులు, పామాయిల్‌తో పాటు కొందరు డీలర్లు బల్బులు కూడా విక్రయిస్తున్నారు. అయితే వినియోగ దారులు పట్టుబడితే, తమ వద్ద ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తేనే బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఇలా లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మిల్లర్లకు రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముకుం టున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా సివిల్‌ సప్లై, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు

ప్రభుత్వం పేదవారిని దృష్టిలో ఉంచుకొని రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేసి బియ్యం, చక్కెరను సరఫరా చేస్తోంది. డీలర్లు వీటిని మాత్రమే లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది. కానీ కొందరు డీలర్లు బియ్యం, చక్కెరతో పాటు సబ్బులు (ఒకటి రూ.40), ఉప్పు (కిలో రూ.10), గోధుమపిండి (కిలో రూ.50), బల్బు (ఒకటి రూ.65), కందిపప్పు (కిలో రూ.90), పామాయిల్‌ (లీటరు రూ. 125 నుంచి రూ.130కి విక్రయిస్తున్నారు. దీనికి తోడు మార్కెట్లో కూడా దొరకని కొత్త బ్రాండ్‌ సరుకులను లబ్ధిదారులకు బలవంతంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 


కొందరు డీలర్లే ఏజెన్సీ నిర్వాహకులు

జిల్లా కేంద్రంతో పాటు గద్వాల మండల పరిధిలోని డీలర్లు కొందరు ఈ సరుకుల ఏజెన్సీని తీసుకొని ఇతర రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమా చారం. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ మండలానికి చెందిన డీలర్‌ ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలిసింది. మరో డీలర్‌ కుమారుడికి విద్యుత్‌ బల్బుల దుకాణం ఉందని, అక్కడ అమ్ముడుపోని వాటిని రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ సరుకులు కొంటేనే బియ్యం ఇస్తామని డీలర్లు చెప్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


ఇతర వస్తువులు విక్రయిస్తే చర్యలు

రేషన్‌ దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇతర వస్తువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే సరుకులను మాత్రమే రేషన్‌ డీలర్లు లబ్ధిదారులకు అందించాలి. త్వరలోనే తనిఖీలు చేపట్టి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. 

- రేవతి, సివిల్‌ సప్లై అధికారి, గద్వాల

Updated Date - 2022-01-28T05:34:30+05:30 IST