చెత్త సమస్యకు మోక్షం

ABN , First Publish Date - 2021-10-27T04:53:57+05:30 IST

సంగారెడ్డిటౌన్‌, అక్టోబరు 26: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దశాబ్ద కాలంగా నెలకొన్న చెత్తసేకరణ సమస్య ఓ కొలిక్కి వచ్చింది.

చెత్త సమస్యకు మోక్షం
సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులో నిర్మించిన డంపింగ్‌యార్డు

ఎట్టకేలకు సిద్ధమైన డంపింగ్‌ యార్డు

రూ.కోటీ 20లక్షలతో పనులు పూర్తి

రోజుకు 50 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ


సంగారెడ్డిటౌన్‌, అక్టోబరు 26: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దశాబ్ద కాలంగా నెలకొన్న చెత్తసేకరణ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా ప్రత్యేక చొరవతో  ఎట్టకేలకు డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొదట డంపింగ్‌యార్డు నిర్మాణ విషయంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా అధికారుల కృషి ఫలితంగా రూ.1.20 కోట్లతో సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులో అధునాతనంగా నిర్మిం చారు. ఈ డంపింగ్‌యార్డును  మంత్రి హరీశ్‌రావు త్వరలో ప్రారంభించనున్నారు. 

 సంగారెడ్డిలో సేకరించిన చెత్తను డంప్‌ చేసేందుకు నిర్మించ తలపెట్టిన యార్డుకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో పట్టణంలో పదేళ్లుగా చెత్త సేకరణ సమస్య అధికారులు, మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులకు సవాలుగా మారింది. అయితే డంపింగ్‌యార్డు నిర్మాణం కోసం ఐదేళ్ల క్రితం రూ.1.20కోట్లు విడుదల అయినప్పటికీ అడ్డంకులు ఎదురుకావడంతో నిర్మాణం ఆలస్యమైంది. డంపింగ్‌యార్డు నిర్మించేందుకు మొదట కంది మండలం చేర్యాల వద్ద ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి టెండర్‌ ప్రక్రియను పూరిచేశారు. చేర్యాల గ్రామస్థు లు అడ్డుకోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అనంతరం కొండాపూర్‌ మండ లం మల్కాపూర్‌ శివారులో స్థలాన్ని గుర్తించారు. అక్కడా గ్రామస్థులు వ్యతిరేకించారు. ఆ తర్వాత సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌ శివారులోని 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించగా అక్కడ కూడా గిరిజనులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కులబ్‌గూర్‌ శివారులో నిర్మించేందుకు మున్సిపల్‌ అధికారులు యత్నించగా గ్రామస్థులు మూకుమ్మడిగా ఎదురుతిరిగారు. చివరగా ఫసల్‌వాది శివారులో ఐదెకరాల ప్రభుత్వస్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించారు. అయితే ఆ భూమిలో తాము సాగు చేసుకుంటున్నామంటూ గ్రామానికి చెందిన కొందరు రైతులు గతేడాది కోర్టును ఆశ్రయించారు. 

 ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న కలెక్టర్‌ హన్మంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా ప్రత్యేక చొరవ తీసుకుని కోర్టు స్టేను తొలగింపచేసి పోలీసు బందోబస్తు మధ్య డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు పూర్తిచేయించారు. 


అధునాతనంగా డంపింగ్‌యార్డు

ఫసల్‌వాది శివారులోని ఐదెకరాల విస్తీర్ణంలో అధునాతనంగా నిర్మించిన డంపింగ్‌యార్డులో డ్రై రీసోర్స్‌ కలెక్షన్‌ సెంటర్‌ (డీఆర్‌సీసీ), కంపోస్ట్‌ యూనిట్‌ (తడి చెత్తతో ఎరువు తయారీ), తడి, పొడిచెత్తను ఆరబోసేందుకు గద్దెతో పాటు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. 


38 వాహనాల్లో చెత్త సేకరణ

సంగారెడ్డిలో రోజుకు 50 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో 38 వార్డులు, లక్షకు పైగా జనాభా, 20 వేలకు పైగా భవనాలు ఉన్నాయి. మొత్తం 50వీధులు, 15 మురికివాడలు (స్లమ్‌ ఏరియాలు) కలిగిన సంగారెడ్డి పట్టణంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు 38 వాహనాలను వినియోగిస్తున్నారు. పట్టణం నుంచి డంపింగ్‌యార్డు వరకు చెత్తను తరలించేందుకు 9 ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొత్తగా నిర్మించిన డంపిం గ్‌యార్డును ప్రారంభించే వరకు కొన్ని నెలలుగా కంది మండలం ఆరుట్ల శివారులో చెత్తను డంప్‌ చేస్తున్నారు.



Updated Date - 2021-10-27T04:53:57+05:30 IST