చిన్నాన్న పార్టీతో పొత్తు: అఖిలేష్

ABN , First Publish Date - 2021-11-04T00:21:31+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు తన చిన్నాన్న శివపాల్ యాదవ్ పార్టీతో..

చిన్నాన్న పార్టీతో పొత్తు: అఖిలేష్

పాట్నా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలతో పాటు తన చిన్నాన్న శివపాల్ యాదవ్ పార్టీతో (ప్రగతిశీల్ సమాజ్ వాది పార్టీ లోహియా-పీఎస్‌పీఎల్) పొత్తు ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బుధవారం ప్రకటించారు. శివపాల్ యాదవ్‌కు సమాజ్‌వాదీ పార్టీ తగిన గౌరవం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రీయ లోక్‌‌ దళ్ (ఆర్‌ఎల్‌డీ)తో పొత్తు ఖరారైందని, సీట్ల పంపకం ఫైనలైజ్ కావాల్సి ఉందని చెప్పారు. సాగుచట్టాలపై పోరుబాట పట్టిన రైతులకు ఆర్ఎల్‌డీ మద్దతిస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ సైతం రైతులకు బాసటగా ఉంది. ఓం ప్రకాష్ రాజ్‌భర్ నేతృత్వంలోని సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌పీఎస్‌పీ) పొత్తు కుదిరినట్టు సమాజ్‌వాదీ పార్టీ ఇటీవల ప్రకటించింది.


కాగా, అజంగఢ్ నియోకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా ఉన్న అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. అయితే, తుది నిర్ణయం పార్టీ తీసుకుంటుందని చెప్పారు. ఎంఐఎం, మమతా బెనర్జీ పార్టీ టీఎంసీలతో పొత్తు అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఇంతవరకూ ఎలాంటి చర్చలు జరపలేదని అఖిలేష్ సమాధానమిచ్చారు. సహజ భాగస్వామిగా ఎస్‌బీఎస్‌బీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. రైతులు, ఉద్యోగాల కల్పన, సామాన్య ప్రజానీకం కోసం తాము లేవనెత్తిన అంశాలన్నీ పార్టీ మేనిఫెస్టోలో ఉంటాయని, తాము అధికారంలోకి వస్తే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-04T00:21:31+05:30 IST