Advertisement

తమిళుల ఆగ్రహ జ్వాలల్లో సమంత & ఫ్యామిలీ మ్యాన్‌ 2

‘నాన్‌ ఎల్లారయుమ్‌ కొల్లువెన్‌’ (నేను అందర్నీ చంపేస్తా) - ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ట్రైలర్‌లో సమంత చెప్పిన ఓ డైలాగ్‌!

వెబ్‌ సిరీస్‌ చూడకముందు ఎవర్ని ఉద్దేశించి ఆ మాట అన్నారో చెప్పలేం!

కానీ, ఆ మాటే సిరీస్‌పై తమిళుల ఆగ్రహ జ్వాలలకు ముఖ్య కారణమైంది!

అలాగే, ట్రైలర్‌లో సమంత పాత్రను చూపించిన తీరు - రూపురేఖలు కూడా!

ఏకంగా సిరీస్‌ను నిషేధించాలని కేంద్రమంత్రికి తమిళ ప్రభుత్వమే లేఖ రాసేంత!మరి, కేంద్రం ఏం చేస్తుంది? ‘

ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’పై శాశ్వత నిషేధం విధించి సమాధి కడుతుందా? లేదంటే... రాజీ (సిరీస్‌లో సమంత పాత్ర పేరు కూడా)ను ఎలా చేస్తుంది? అసలు, 

ఈ వివాదం ఏంటి? ఏం జరుగుతోంది? ఇటు ఓ లుక్కేయండి!


భారతీయ ఓటీటీ విపణిలో విజయవంతమైన వెబ్‌ సిరీస్‌లలో ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ ముందు వరుసలో ఉంటుంది. దేశంలో ఓటీటీ విసృతం కాకముందే విడుదలైంది. ఉత్తరాది వీక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాదిన సిరీస్‌ చూసినవాళ్లలో నగర, పట్టణ వీక్షక వర్గమే ఎక్కువ శాతమని అంగీకరించక తప్పదు. పాకిస్తాన్‌ తీవ్రవాదుల ఆట కట్టించడానికి భారతీయ ‘రా’ అధికారి చేసే ప్రయత్నమే తొలి సీజన్‌ కథాంశం కావడంతో వివాదాలేవీ రాలేదు.


మరి, రెండో సీజన్‌పై వివాదం ఎందుకొచ్చింది? ‘తమిళ సంస్కృతిని అగౌరవపరిచేలా సిరీస్‌ ఉండటంతో దీన్ని అడ్డుకోవాలి. లేదా దేశవ్యాప్తంగా విడుదల కాకుండా అడ్డుకోవాలి’ అని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాసింది? అంటే... వేళ్లన్నీ సమంత పాత్ర వైపే చూపిస్తాయి. వివాదంలోకి వెళ్లే ముందు సమంత పాత్ర ఎలా ఉంది? దక్షిణాదిన ఎందుకు ట్రైలర్‌ ఎక్కువమంది చూశారు? అనే అంశాల్లోకి ఓసారి వెళ్లాలి.


‘ద ఫ్యామిలీ మ్యాన్‌’లో దక్షిణాది కథానాయిక ప్రియమణి నటించారు. హీరో శ్రీకాంత్‌ తివారి (మనోజ్‌ బాజ్‌పాయ్‌ పాత్ర) భార్య సుచిత్రా అయ్యర్‌ తివారిగా కనిపించారు. తమిళ మూలాలున్న కేరళ కుటుంబంలో, బెంగళూరులో ప్రియమణి జన్మించారు. సిరీస్‌లో ఆమెది తమిళ మహిళ పాత్రే. అయినా... దక్షిణాదిలో సిరీస్‌ అంత ప్రాచూర్యం పొందలేదు. మరి, ఇప్పుడెందుకు అయ్యింది? అంటే... సమంత, ఆమె పాత్ర. ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర నాయికల్లో సమంత ఒకరు. ఆమె ఇమేజ్‌కు తోడు తీవ్రవాదిగా ప్రతినాయిక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’పై ఇక్కడి వీక్షకుల్లో ఆసక్తి పెంచాయి. 


ట్రైలర్‌ రాగానే చూశారంతా. చెన్నై నేపథ్యంలో రెండో సీజన్‌ కథ సాగుతున్నట్టు అందులో స్పష్టమవుతూ ఉంది. రాజీను అడ్డుకునే అధికారిగా శ్రీకాంత్‌ తివారి పాత్రను చూపించారు. అయితే, శ్రీలంకలో తమిళ ప్రజల హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈ (లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం) సంస్థకు, పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నట్టు చూపించారని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరచడం, చరిత్రను వక్రీకరించమే అంటూ సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2 ఎగైనెస్ట్‌ తమిళ్స్‌’, ‘షేమ్‌ ఆన్‌ సమంత’ హ్యాష్‌ట్యాగ్స్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయ్యాయి. సిరీస్‌ను బ్యాన్‌ చేయాలని చాలామంది తమిళులు ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. తమిళులను కించపరిచే విధంగా ఉన్న పాత్రలో సమంత నటించడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ అన్‌సబ్‌స్రైబ్‌ చేస్తున్నట్టు ట్వీట్లు చేశారు. అంతే కాదు... ఓటీటీ మాధ్యమాన్నీ బ్యాన్‌ చేయాలనే డిమాండ్స్‌ వినిపించాయి. చివరకు, తమిళ ప్రభుత్వం సైతం తమ రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్రమంత్రికి లేఖ రాసింది. అంతకు ముందే రాజ్యసభ సభ్యులు వైకో సైతం ఈ వెబ్‌ సిరీస్‌ బ్యాన్‌ చేయాలని ప్రకాశ్‌ జావడేకర్‌కు లేఖ రాశారు. 


తమిళ ప్రభుత్వం, తమిళ ప్రజలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల్లో ముఖ్యమైనవి. ఒకటి... ఉద్దేశ పూర్వకంగా తీవ్రవాద పాత్రకు తమిళ నటిని తీసుకోవడం నేరుగా తమిళుల గౌరవంపై దాడి చేయడమే. ప్రపంచంలోని తమిళులు ఎవరూ దీన్ని సహించరు. రెండు... ముందుగా చెప్పుకొన్నట్టు శ్రీలంకలో తమిళ ఈలం సభ్యుల పోరాటాన్ని కించపరచడమే. వివాదానికి కేంద్ర బిందువైన అంశంపై క్రియేటివ్‌ ద్వయం రాజ్‌-డీకే స్పందించారు. ‘‘తమిళ ప్రజలపైన మాకు అపూర్వమైన ప్రేమ, అంతకు మించిన గౌరవం ఉన్నాయి. తమిళ సంస్కృతి, ప్రజల మనోభావాల పట్ల మాకు అవగాహన ఉంది. రచన, నట బృందంలో అధిక శాతం తమిళులు ఉన్నారు. ట్రైలర్‌లో కొన్ని షాట్లు చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. షో విడుదలయ్యే వరకూ ఎదురు చూడండి’’ అని రాజ్‌-డీకే పేర్కొన్నారు. మనోజ్‌ బాయ్‌పాయ్‌ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జూన్‌ 4న ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ విడుదల కానుంది. అంతకు ముందు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌ సిరీస్‌ చూస్తుందా? చూసి ఏం చెబుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. 


గతంలో రాజీవ్‌ గాంధీ హత్యోదంతంపై తెరకెక్కిన జాన్‌ అబ్రహం హిందీ సినిమా ‘మద్రాస్‌ కేఫ్‌’, రాజీవ్‌ మీనన్‌ ‘ఇనాం’ చిత్రాలు తమిళనాడులో నిషేధం ఎదుర్కొన్నాయి. తమిళ ప్రజలకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఆ రెండిటినీ నిషేధించినట్టుగా, ‘ద ఫ్యామిలీ మ్యాన్‌ 2’ను నిషేధించాలని రాజ్యసభ ఎంపి వైకో, తమిళ నటుడు, ఫిల్మ్‌మేకర్‌, రాజకీయ నాయకుడు సీమాన్‌ కోరుతున్నారు. తమిళులు ఆగ్రహ జ్వాలల నుంచి సమంత, సిరీస్‌ ఎప్పుడు బయట పడతాయో!?


Advertisement
Advertisement