సమరానికి సన్నద్ధం

ABN , First Publish Date - 2021-10-19T04:32:17+05:30 IST

జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఎన్నికల వేడి మొదలయ్యింది. కార్పొరేషనకు ఎన్నికలు తప్పక జరుగుతాయన్న సంకేతాలు అందడంతో ఆశావహులు అప్పుడే ఇంటింటి ప్రచారాలకు తెరలేపారు.

సమరానికి  సన్నద్ధం
బుచ్చిరెడ్డిపాళెం పట్టణ వ్యూ

నెల్లూరు నగరంలో ఎన్నికల కోలాహలం

ఈ నెల 23, 25 తేదీల్లో నోటిఫికేషన?

ముమ్మరంగా అడుగులు వేస్తున్న యంత్రాంగం

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటులో తలమునకలు

అధికార పార్టీలో కొలిక్కివచ్చిన అభ్యర్థుల ప్రక్రియ

కొన్నిచోట్ల అప్పుడే ఇంటింటి ప్రచారాలు

అనుచరు కోసం ముఖ్యనేతల పట్టు

డివిజన్లు కేటాయించాలని ఒత్తిళ్లు 

టీడీపీ వ్యూహాత్మక అడుగులు

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా సమాలోచనలు

పట్టు కోసం బీజేపీ, జనసేన, వామపక్షాల ప్రయత్నం


నెల్లూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఎన్నికల వేడి మొదలయ్యింది. కార్పొరేషనకు ఎన్నికలు తప్పక జరుగుతాయన్న సంకేతాలు అందడంతో ఆశావహులు అప్పుడే ఇంటింటి ప్రచారాలకు తెరలేపారు. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీలో అగ్రనేతల మధ్యే పోటీ ఎక్కువైంది. ‘‘మాకు కొన్ని వార్డులు ఇవ్వండి.’’ అనే గళం ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది. మరోవైపు కార్పోరేటర్‌ సీటు కోసం అగ్రనాయకుల చుట్టూ తిరిగే ఆశావహుల సంఖ్య పెరిగింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు అవసరమైన వనరుల సమీకరణకు నడుం బిగించింది. అధికార పార్టీలోని అంతర్గత లొసుగులు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కట్టడి చేసే క్రమంలో ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకొని వెళ్లే ప్రయత్నాలను మొదలుపెట్టింది. మొత్తమ్మీద ఇటీవల జరిగిన మున్సిపల్‌, మండల పరిషత ఎన్నికలకు భిన్నంగా నెల్లూరు, బుచ్చి మున్సిపాలిటీల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నెల 23 లేదా 25వ తేదీల్లో నోటిఫికేషన వెలువడే అవకాశాలు ఉండటంతో దానికి ముందే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పనులను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. 


అధికార పార్టీలో కోలాహలం


కార్పొరేషన ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందన్న సంకేతాలు అందిన గంటల వ్యవధిలోనే అఽధికార వైసీపీ అప్రమత్తమైంది. నెల్లూరు నగర పరిధిలోని పలు డివిజన్లకు ఇదివరకే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారంతా సోమవారం ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. సిటీ నియోజకవర్గ పరిధిలో 28 28 డివిజన్లు ఉండగా వీటిలో మెజారిటీ డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. మంత్రి అనిల్‌ కుమార్‌ ఆదివారం రాత్రి పది గంటల వరకు రాజన్నభవనలో నగర నాయకులతో కలిసి అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేశారు. రూరల్‌ నియోజకవర్గ పరిధిలో 26 డివిజన్లు ఉండగా రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వీరంతా సోమవారం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన ఇతర ముఖ్యనేతలు సైతం తమ వారికి టిక్కెట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలను ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన అగ్రనాయకులందరూ నెల్లూరు నగరం కేంద్రంగానే నివాసం ఉంటున్నారు. వీరందరికి నగరంలో అభిమానులు, అనుచరులు ఉన్నారు. వీరిలో కొందరికైనా టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్‌ మొదలైనట్లు తెలిసింది. రూరల్‌ నియోజకవర్గానికి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డి తన వర్గానికి చెందిన ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ  ముఖ్య నాయకులను కోరినట్లు చెబుతున్నారు. అలాగే ఇంకా పలువురు అగ్రనాయకులు సైతం తమకు చెందిన ఇద్దరు ముగ్గురికి టిక్కెట్లు కోరే అవకాశం లేకపోలేదు. ఈ కోర్కెలు, వాటి తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాల్సి ఉంది. 


సమీకరణల్లో టీడీపీ


ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికలకు భిన్నంగా నగర పాలక సంస్థ ఎన్నికల్లో బలంగా పోటీకి దిగాలని యోచిస్తున్న తెలుగుదేశం పార్టీ అన్ని వనరులను సమీకరించుకొంటోంది. మాజీ కార్పొరేటర్లతో పాటు కొత్తగా పలువురు ఆశావహులు టిక్కెట్ల కోసం టీడీపీ నేతలను సంప్రదిస్తున్నారు. కార్పొరేషన ఎన్నికల ద్వారా ప్రజావ్యతిరేకతను బట్టబయలు చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే ఆలోచనలు చేస్తోంది. కార్పొరేషన ఎన్నికలపై చర్చించడానికి అధిష్ఠానం పిలుపు మేరకు సోమవారం సాయంత్రం బీద రవిచంద్ర అమరావతికి వెళ్లారు. ఎన్నికల నోటిఫికేషన వెలువడే నాటికి అన్ని వర్గాలతో కలిసి బలమైన అభ్యర్థులను బరిలోకి దించేలా టీడీపీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీలు సైతం కార్పొరేషన ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు వీలుగా కొత్త రకం ఆలోచనలు చేస్తున్నాయి. 


పోలింగ్‌ కేంద్రాల పరిశీలన


ఇక అధికారుల విషయానికి వస్తే పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు పనుల్లో చురుగ్గా ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల ఖారారు తరువాతే ఎన్నికల కమిషన నోటిఫికేషన విడుదల చేయాల్సి ఉంది. ఈనెల 23, 25 తేదీల్లో నోటిఫికేషన విడుదల చేయాలని ఎన్నికల కమిషన భావిస్తున్న క్రమంలో రెండు, మూడు రోజుల్లోపే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం సన్నద్దం అవుతోంది. 


అభ్యర్థి ఎవరు!? 


నెల్లూరు (సిటీ), అక్టోబరు 18 : నెల్లూరులో ఏ డివిజనకు ఎవరు అభ్యర్థి? ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఎంత? ఈసారి పార్టీ బలాలు ఎంత? వంటి ప్రశ్నలు రాజకీయ పార్టీల్లోని కార్యకర్తలు, సామాన్యులను కుదిపేస్తున్నాయి. మున్సిపల్‌ పోరు ఒక్క సారిగా వేడెక్కడంతో నేతలకు తలపోటు తెచ్చిపెడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా రాజకీయ పార్టీ కార్యాలయాల్లో సీట్ల కేటాయింపు, అసంతృప్తి వర్గాలను బుజ్జగింపుల పంచాయితీలు జోరుగా సాగుతున్నాయి.  సరిగ్గా రెండేళ్ల మూడు నెలలు తరువాత నెల్లూరు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకోసం  అధికార యంత్రాంగంలో కసరత్తు ముమ్మరం చేసింది. మరోవైపు డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేయడంలో రాజకీయ పార్టీలు తనమునకలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల స్థానాలలో రిజర్వేషన కలిగిన వ్యక్తులు వారిలో బలమైన వారికోసం ప్రధాన రాజకీయ పార్టీలు అన్వేషిస్తుండగా, బీసీ, ఓసీ స్థానాలలో పోటీ ఎక్కువగా ఉండటంతో సామాజిక వర్గాల వారీగా లెక్కకడుతున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల్లో తొలి విడత జాబితా సిద్ధమైనట్లు తెలుస్తుండగా వారిలో ఎవరు ఏ డివిజనకు అన్నది బయటకు రావాల్సి ఉంది. అధికారికంగా ఖరారైన వారు డివిజన్లలో ప్రచారానికి తెరలేపారు.  


గంటలకొద్దీ పంచాయితీ


అభ్యర్థుల ఎంపికలో భాగంగా పార్టీ కార్యాలయాల్లో గంటల కొద్దీ పంచాయితీలతో నేతలు తలలు బాదుకుంటున్నారు. నోటిఫికేషన గడువు తరుముకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసే పనిలోపడ్డారు. డివిజన్లలో కార్పొరేటర్‌ సీట్లను ఆశించే వ్యక్తులు ఎక్కువగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఒకరిని కాదని మరో వర్గానికి అవకాశం ఇస్తే మిగిలిన వారంత గెలుపునకు కృషి చేస్తారా!? అన్న ఆందోళన నేతలను కుదిపేస్తోంది. స్థానికంగా బలాబాలాలు, ఆర్థిక వనరులను బేరీజు వేస్తున్న నేతలు ఆ దిశగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది. 


తొలిసారిగా బుచ్చిలో..


బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 18 : బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి జరగనున్న తొలి ఎన్నికలలో పట్టు నిలుపుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఎవరికివారుగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు జరుపుతున్నారు. 20 వార్డులు ఉన్న బుచ్చి నగర పంచాయతీకి బుధవారం నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు ప్రచారం సాగుతుండగా ఆ మేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలోని ఆశావహులు అగ్రనాయకుల వద్దకు క్యూ కడుతున్నారు. వార్డుల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీలో పోటీ ఎక్కువైంది. ఓ నాయకురాలు తానే చైర్‌పర్సన అభ్యర్థినంటూ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపేందుకు తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతి వార్డుకు ముగ్గురు వంతున మొత్తం 20 వార్డులకు 60మందితో కమిటీలు వేసినట్లు సమాచారం. మరోవైపు కమలదళం కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవిళ్లూరుతోంది. అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆశావహుల పేర్లు జిల్లా పార్టీ దృష్టికి పంపించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో బరిలో నిలిచే వారి పేర్లు ఖరారు చేయనున్నారు. సీపీఎం నాయకులు కూడా 8 వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. 


 కార్పొరేషన ఎన్నికలకు సమాయత్తం కండి!


ఆర్వోలు, ఏఆర్వోలతో కలెక్టర్‌


నెల్లూరు (సిటీ), అక్టోబరు 18 : నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలకు అధికారులంతా సమాయత్తం కావాలని  కలెక్టర్‌ కేవీఎన చక్రధర్‌బాబు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన సమీక్షించారు. కార్పొరేషన ఎన్నికలకు త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన జారీ చేయనున్నదన్నారు. ఇందులో భాగంగానే ఆర్వోలు, ఏఆర్వోల నియామకాలు జరిగాయని తెలిపారు. సమగ్ర ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపునకు తగు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ ముందుగానే జరగాలని, ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం, అజాగ్రత్త ఉండకూడదన్నారు. నోటిఫికేషన వచ్చేలోపు అందుబాటులో ఉన్న తాజా ఓటర్ల జాబితాను సవరించుకోవచ్చన్నారు. నోటిఫికేషన వచ్చిన వెంటనే ఎంసీసీ అమలులోకి వస్తుందన్నారు. నామినేషన్లు స్వీకరించే ప్రాంతాలు, సమయం నోటీసుల ద్వారా ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఈ సమీక్షలో జేసీలు హరేందరప్రసాద్‌, గణే్‌షకుమార్‌, విదే్‌హఖరే, కమిషనర్‌ కే దినే్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


పోలింగ్‌ కేంద్రాల పరిశీలన


సర్వోదయ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ కేవీఎన చక్రధర్‌బాబు, కమిషనర్‌ దినేష్‌కుమార్‌లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముందుగా బూతస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చి అనంతరం పోలింగ్‌ ప్రక్రియలో బాధ్యతలు అప్పగిస్తామన్నారు. గూడూరు, కావలికి కోర్టు కేసులు కొలిక్కి వస్తున్నందున వాటికి కూడా త్వరలో నోటిఫికేషన విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. వీరివెంట ఆర్డీవో హుస్సేనబాషా, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-10-19T04:32:17+05:30 IST