పీఆర్సీపై సమరశంఖం

ABN , First Publish Date - 2022-01-24T06:38:21+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణతో ఉద్యోగుల జీతాలు పెరిగాయని మంత్రులు, అధికార పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని, వీరి దుష్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా ప్రజలకు వివరించాలని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.

పీఆర్సీపై సమరశంఖం
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఈశ్వరరావు

మంత్రులు, వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పి కొడతాం

పెండింగ్‌ డీఏలు కలిపి లెక్కలు చెప్పడం మోసపూరిత చర్య

కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయని గణాంకాలతోసహా నిరూపిస్తాం

ఉద్యమాన్ని విచ్ఛినం చేయడానికి కుట్ర జరుగుతోంది

పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నేతలు ధ్వజం


విశాఖపట్నం/మహారాణిపేట, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణతో ఉద్యోగుల జీతాలు పెరిగాయని మంత్రులు, అధికార పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని, వీరి దుష్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టేలా ప్రజలకు వివరించాలని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. కొత్త పీఆర్‌సీ అమలుతో జీతాలు పెరిగాయని ప్రభుత్వం చెబుతున్నది పూర్తి అవాస్తవమని, వేతన సవరణతో జీతాలు పెరగలేదన్న విషయాన్ని గణాంకాల ద్వారా చూపిస్తామని వారు స్పష్టం చేశారు. బకాయి వున్న ఐదు డీఏలను కలిపి, దానికి ఫిట్‌మెంట్‌ జత చేసి మూతవేతనం నిర్ణయించడం సరికాదని అన్నారు. బకాయి డీఏలను డిసెంబరు నెల జీతంతో కలిపితే కొత్త పీఆర్‌సీ అమలు తరువాత జీతాలు పెరిగాయో, తగ్గాయో వెల్లడవుతుందని స్పష్టం చేశారు.  

కలెక్టరేట్‌ ఆవరణలోని ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు అధ్యక్షతన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌, ఫ్యాప్టో, జాక్టో, సీపీఎస్‌, గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ, న్యాయ, ట్రెజరీతోపాటు పీటీడీ యూనియన్ల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగుల్లో విభజన తీసుకువచ్చి పీఆర్‌సీ సాధన ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతున్నదని అనుమానించారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు అన్ని సంఘాల నేతలు ముందుకురావాలని  కోరారు. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వివరణతో కూడిన సమాచారం పెట్టాలని పలువురు నేతలు సూచించారు. వేతన సవరణ విషయంలో ప్రజలకు అవాస్తవాలు చెబుతున్న వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉంటూ వారి కుట్రలను బయటపెట్టాలని అభిప్రాయపడ్డారు. 

ఫ్యాప్టో పోరాట స్ఫూర్తితో...

కాగా ఉద్యమంలో భాగంగా 20వ తేదీన ఫ్యాప్టో నేతృత్వంలో ఉపాధ్యాయులు నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి విజయవంతం కావడంపై సమావేశం సంతోషం వ్యక్తంచేసింది. కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొని మిగిలిన ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చిన ఉపాధ్యాయులను సమావేశం అభినందించింది. ఇదే స్ఫూర్తితో పీఆర్‌సీ సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని నేతలు వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా  25వ తేదీన జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు. అయితే దీనిని భగ్నంచేయడానికి ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని, పోలీసులు అడ్డుకునే అవకాశం వుందని, అందువల్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-24T06:38:21+05:30 IST