వద్దనా అదే రద్దీ

ABN , First Publish Date - 2020-04-08T09:24:18+05:30 IST

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా జిల్లా కేంద్రం కాకినాడలో మాత్రం యథేచ్ఛగా జనం రాకపోకలు సాగుతున్నాయి. ఉదయం ఆరు నుంచి పది వరకు నిత్యావ సరకులకు బయటకు రావడానికి అనుమతి ఉండడంతో జనం

వద్దనా అదే రద్దీ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ):

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా జిల్లా కేంద్రం కాకినాడలో మాత్రం యథేచ్ఛగా జనం రాకపోకలు సాగుతున్నాయి. ఉదయం ఆరు నుంచి పది వరకు నిత్యావ సరకులకు బయటకు రావడానికి అనుమతి ఉండడంతో జనం ద్విచక్ర వాహనాలు, కార్లపై పెద్దఎత్తున ప్రయాణం చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌ ఆంక్షలు, భౌతిక దూరం పాటించా లన్న నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రధానంగా కాకినాడ మసీదు  సెంటర్‌ నుంచి జగన్నాథపురం వరకు కిలోమీటరు వరకు వందల సంఖ్యలో గుంపులుగా తిరుగుతున్నారు.


ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో హోల్‌సేల్‌ కిరాణా దుకాణాలు, కూరగాయ దుకాణాలు, పండ్ల వర్తకులు, ఫ్యాన్సీ స్టోర్లు, మెడికల్‌ షాపులు ఉండడంతో పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. ఉదయం ఆరు నుంచి పదివరకు ఈ రహదారి పూర్తిగా జనంతో కిక్కిరిసిపోతోంది. వాస్తవానికి ఇక్కడ హోల్‌సేల్‌ కూరగాయల దుకాణం వల్ల వందల్లో జనం సంచరిస్తుం డడంతో దాన్ని అక్కడి నుంచి తరలించారు. అయినా పలువురు  వర్తకులు హోల్‌సేల్‌ కాయగూరల దుకాణాలు నిర్వహిస్తున్నారు. పండ్ల దుకాణాలు వద్దన్నా అవీ కొనసాగుతున్నాయి. కిరాణా, తిను బండారాల దుకాణాలు కూడా చిన్నాపెద్దవి కలిపి వందల్లో ఉన్నాయి. దీంతో వీటికోసం కాకినాడ, చుట్టుపక్క ప్రాంతాల నుంచి చిన్న దుకా ణాల నిర్వాహకులు వచ్చి ఇక్కడే సరుకులు కొనుగోలు చేసుకు వెళ్తున్నారు.


అటు ఇక్కడే పండ్లు, కూరగాయలు కొని రిటైల్‌గా విక్రయించే షాపులు, తోపుడు బండ్లు ఉంటున్నాయి. దీంతో నగరంలో అనేక ప్రాంతాల నుంచి మహిళలు, పురుషులు, వృద్ధులు చిన్నారు లతోసహా పెద్దఎత్తున వస్తున్నారు. చాలామంది మాస్కులు కూడా ధరించడం లేదు. ఏ దుకాణం వద్ద కూడా భౌతిక దూరం పాటించడం లేదు. అసలే ఈ ప్రాంతం అంతా ఇరుకైనది కావడంతో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నా అదీ అమలవడం లేదు. అలాగే మసీదుసెంటర్‌ ప్రాంతంలో పదుల సంఖ్య హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కో దుకాణం వద్ద 15 మంది వరకు అతి సమీపంగా మెలుగుతూ నెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతానికి అతిసమీపంలో బ్యాంకు పేట ఉంది.


ఇక్కడ రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు ఇక్కడే నివసిస్తుండగా, వారికి కరోనా నిర్థారణ అయింది. దీంతో ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి అర కిలో మీటర్‌ దూరం వరకు హైఅలర్ట్‌ ప్రకటించారు. అయినా జనం ఇదేదీ ఖాతరు చేయకుండా హోల్‌సేల్‌ దుకాణాల వద్ద బారులు తీరుతు న్నారు. వాస్తవానికి ఇక్కడ భారీస్థాయిలో ఉంటున్న జన సందోహాన్ని పోలీసులు నియంత్రించాలి. కానీ ఉదయం పదిలోపు అనుమతి ఉందనే కారణంతో ఇక్కడ జాగ్రత్తలు పాటించేలా పోలీసులు చొరవ తీసుకోవడం లేదు. దీంతో కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో జనసంచారం ఉంటోంది. 


వారందరికీ నెగిటివ్‌...

కరోనా అనుమానిత లక్షణాలతో మంగళవారం జిల్లావ్యాప్తంగా 51 మంది ఐసోలేషన్‌కు వచ్చారు. వీరి నుంచి వైద్యులు శాంపిళ్లు స్వీకరించారు. అటు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కలెక్టరేట్‌, పోలీసుశాఖ, శానిటరీ విభాగాల్లో కరోనా విధుల్లో ఉన్న సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులకు వైద్య పరీక్షలు నిర్వహిం చగా, వారందరికి నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోపక్క నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు, ఆక్వా, ఇతర కిరాణా మాళ్లు నగరంలో నిరంతరం తిరగ డానికి జిల్లా అధికారులు ఇచ్చిన పాస్‌ల సంఖ్య 300 వందలకు పైనే అయ్యాయి.


దీంతో నగరంలో ఈ పాస్‌లతో తిరిగే వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. మరోపక్క మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 14 వరకు అమల్లో ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ బుధవారంతో సరిగ్గా వారంతో పూర్తికాబోతోంది. ఈ నేపథ్యంలో 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా? కొనసాగిస్తారా? అనే చర్చ జిల్లావ్యాప్తంగా జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎత్తివేయవచ్చని కొందరు, ఇంకా కొనసాగిస్తారంటూ మరికొందరు ఊహగానాలు చేస్తున్నారు. జిల్లాలో గత రెండ్రోజుగా పాజిటివ్‌ కేసులు నమోదుకాకపోవడంతో కొంత ఊరట చెందారు.

Updated Date - 2020-04-08T09:24:18+05:30 IST