అదే దోపిడీ.. అదే దందా..!

ABN , First Publish Date - 2021-06-13T06:04:53+05:30 IST

గూడూరు మండలానికి చెందిన తల్లీకొడుకులకు 20 రోజుల క్రితం కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి.

అదే దోపిడీ.. అదే దందా..!

  1. తీరు మారని ప్రైవేటు, కార్పొరేట్లు
  2. కొవిడ్‌ వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చు
  3. ఆరోగ్యశ్రీకి మార్చే ముందే  భారీగా వసూళ్లు
  4. ప్రభుత్వ ధరలు బోర్డులకే పరిమితం
  5. పర్యవేక్షణ మరిచిన అధికార యంత్రాంగం


గూడూరు మండలానికి చెందిన తల్లీకొడుకులకు 20 రోజుల క్రితం కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్‌ వచ్చింది. వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద బెడ్లు ఖాళీ లేవని చెప్పడంతో డబ్బులు కట్టి చేరారు. అడ్వాన్స్‌గా కొంత చెల్లించారు. ఆ తరువాత మందులు, ఇంజెక్షన్ల పేరిట ప్రతిరోజూ బాధితుల బంధువుల వద్ద నుంచి భారీగా వసూలు చేశారు. తల్లీ కొడుకులు ఇద్దరు 16 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రభుత్వం నిర్దేశించిన ఐసీయూ చార్జీల ప్రకారం చూసుకున్నా బిల్లు రూ.2.50 లక్షలు దాటకూడదు. కానీ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా రూ.9.50 లక్షలు వసూలు చేసింది. ఈ మొత్తానికి బిల్లులు ఇవ్వమని బాధితుల బంధువులు అడిగితే, కొవిడ్‌ పరిస్థితుల్లో బిల్లులు ఇవ్వడం లేదని ఆస్పత్రి యాజమాన్యం సమాధానమిచ్చింది. 


శిరివెళ్లకు చెందిన ఓ మహిళకు కొవిడ్‌ సోకింది. భర్త ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చేర్పించాడు. బెడ్‌ అందుబాటులోకి రాగానే ఆరోగ్యశ్రీ కిందకు మారుస్తా మని, అప్పటి వరకు ఖర్చును పెట్టుకోవాలని బాధితులకు ఆస్పత్రి యాజమాన్యం సూచించింది. ఐదు రోజుల తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స మొదలు పెట్టారు. అంతవరకూ బాధితుల నుంచి రూ.1.70 లక్షలు  వసూలు చేశారు.


 కర్నూలు, ఆంధ్రజ్యోతి: కర్నూలు నగరంలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో దోపిడీకి ఈ రెండు ఘటనలు ఉదాహరణ. ప్రజలకు కొవిడ్‌ ఓ విపత్తులా కనిపించి భయపెడుతుంటే.. అదే కొవిడ్‌ కొందరు ఆస్పత్రుల యాజమాన్యాలకు ఏటీఎం యంత్రంలాగా కనిపిస్తోంది. కొవిడ్‌ అని ఎవరైనా వస్తే చాలు వీలైనంత పిండుకుంటున్నారు. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కొవిడ్‌ చికిత్సలో దేనికి ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం ఒక ధరల పట్టికను విడుదల చేసింది. కానీ దీన్ని చాలా ఆస్పత్రులు అమలు చేయడం లేదు. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


ఆ రెండు రోజులు హడావుడి..


మే నెలలో కొవిడ్‌ వైద్యంపై ఆర్థిక మంత్రి బుగ్గన, జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్లు ఎన్నిసార్లు కొవిడ్‌ ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారో చెప్పాలి..’ అని ఈ సందర్భంగా ఓ ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులలో దోపిడీని అధికారులు ఏ మేరకు అడ్డుకున్నారో తెలుసుకునేందుకు ఆ ఎమ్మెల్యే ప్రశ్న ఒక్కటే సరిపోతుంది. ఆర్థిక మంత్రి సమక్షంలో ఇలా నిలదీయడంతో అధికారులు రెండు రోజులు ఆస్పత్రుల తనిఖీల పేరిట హడావుడి చేశారు. కానీ ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే అదనుగా కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ‘ఇంత ఫీజు ఎందుకు..? ఈ మందులకు ఇంత ధర ఎందుకు..?’ అని  ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. ‘మీ ఇష్టం ఉన్నవారికి చెప్పుకోండి. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అని ఆస్పత్రి సిబ్బంది దురుసుగా సమాధానమిస్తున్నారు.


పర్యవేక్షణ ఏదీ..?


ఇటీవల నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని బాధితుల బంధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు. ఇదే విషయమై ఆస్పత్రిలో ఉండే ప్రత్యేక అధికారిని విలేఖరులు వివరణ అడిగితే, ‘సమస్య నా దృష్టికి రాలేదు’ అని అన్నారు. ఇదీ.. ఆస్పత్రులపై అధికారుల పర్యవేక్షణ తీరు..! జిల్లాలో 20 పైగా కొవిడ్‌ నోటిఫైడ్‌ ఆస్పత్రులను గుర్తించారు. ఇందులో ఎనిమిది ఆస్పత్రులను ఇటీవల డీనోటిఫై చేశారు. కొవిడ్‌ ఆస్పత్రులను పర్యవేక్షించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు అక్కడే ఉంటూ ఆస్పత్రి యాజమాన్యాలు ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా, ఆరోగ్యశ్రీ బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. బాధితులు రోజూ చెల్లించే ఫీజుల రశీదుని పరిశీలించి, వాటిపైన సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ చాలా ఆస్పత్రుల్లో రశీదులు ఇవ్వడం లేదు. ఈ విషయంలో కొందరు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, వారికి ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 


మందుల్లోనూ దోపిడీ


కొవిడ్‌ బాధితుల నుంచి ఫీజులే కాకుండా, మందుల పేరుతోనూ భారీగా గుంజుతున్నారు. అవసరమున్నా లేకపోయినా మందులను రాస్తున్నారు. బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. స్టెరాయిడ్స్‌ వాడితే ముందు ముందు ఇబ్బందులు వస్తామని తెలిసి కూడా కొందరు వైద్యులు బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. పరిస్థితి బాగాలేదు, స్టెరాయిడ్స్‌ వాడాల్సిందే అని ఒక్కో ఇంజక్షన్‌కు రూ.50 వేల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల పాంక్రియాస్‌ దెబ్బతినడం, షుగరు ఎక్కువవడం, బ్లాక్‌ ఫంగస్‌ సోకడం వంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి. విషయం తెలిసినా కొందరు వైద్యులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా అడిగితే ‘అవసరం కాబట్టే ఇస్తున్నాం’ అని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులు రాసే మందులు వారి దుకాణాల్లో తప్ప ఎక్కడా దొరకవు. దీంతో వారు చెప్పిన ధరకు కొనాల్సి వస్తోంది. బయట పది రూపాయలకు దొరికే మందులు వారి దుకాణాల్లో నాలుగైదు రెట్లకు అమ్ముతున్నారు. 


పేరుకే బోర్డులు


కొవిడ్‌ పేరిట ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం చికిత్స ధరలను ఖరారు చేసింది. ఎన్‌ఏబీహెచ్‌ అక్రెడిటేషన్‌ ఉన్న ఆస్పత్రులకు ఒక ధర, లేని అస్పత్రుల్లో మరో ధరను నిర్ణయించింది. 


అక్రెడిటేషన్‌ ఉన్న ఆస్పత్రుల్లో నాన్‌ క్రిటికల్‌ కేర్‌ వైద్యానికి రోజుకు (ఆక్సిజన్‌ లేకుండా) రూ.4,000, నాన్‌ క్రిటికల్‌ కేర్‌ (ఆక్సిజన్‌తో) రూ.6,500, ఐసీయూ చికిత్సకి రూ.12,000, క్రిటికల్‌ కేర్‌ (ఐసీయూ వెంటిలేటర్‌) రూ.16,000 తీసుకోవాలని ఆదేశించింది. 


అక్రెడిటేషన్‌ లేని ఆస్పత్రుల్లో నాన్‌ క్రిటికల్‌ కేర్‌ (ఆక్సిజన్‌ లేకుండా) రూ.3,600, నాన్‌ క్రిటికల్‌ కేర్‌(ఆక్సిజన్‌తో) రూ.5,850, ఐసీయూ చికిత్సకు రూ.10,800, క్రిటికల్‌ కేర్‌ (ఐసీయూ వెంటిలేటర్‌) రూ.14,400 తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను ఆస్పత్రుల్లో వేలాడదీశారు. కానీ ఫీజులను మాత్రం తమకు నచ్చినట్లు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కింద కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులోనూ గోల్‌మాల్‌ జరుగుతోంది. ఆరోగ్యశ్రీ బెడ్లు లేవని చెప్పి, ముందుగా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కిందకు మారుస్తున్నారు. అప్పటికే కావాల్సినంత దండుకుంటున్నారు.







Updated Date - 2021-06-13T06:04:53+05:30 IST