గ్రహించాల్సింది అదే!

ABN , First Publish Date - 2021-01-01T06:27:37+05:30 IST

ఆధ్యాత్మిక మార్గంలో తమకు మార్గదర్శకులైన గురువులను శిష్యులు అనుసరిస్తూ ఉంటారు. కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు గురువుల

గ్రహించాల్సింది అదే!

ఆధ్యాత్మిక మార్గంలో తమకు మార్గదర్శకులైన గురువులను శిష్యులు అనుసరిస్తూ ఉంటారు. కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు గురువుల ద్వారా నేర్చుకొని శిష్యులు పాటిస్తారు. వారి శిష్యులు కూడా వాటిని గ్రహిస్తారు. ఇలా పరంపరగా... కొన్ని తరాలపాటు ఇది కొనసాగుతూ ఉంటుంది.


కానీ, జెన్‌ గురువు బొకుజు దీనికి పూర్తి విరుద్ధంగా కనిపించేవాడు. ఆయననూ, ఆయన గురువునూ చూసిన వారికి వ్యత్యాసం స్పష్టంగా కనిపించేది. అన్ని విషయాల్లోనూ తన గురువుకు భిన్నంగా బొకుజు నడుచుకుంటూ ఉండేవాడు. 

ఎంతోకాలం పాటు దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు ‘‘బొకుజు! నీకు నీ గురువు పట్ల ఏమైనా గౌరవం ఉందా? ఆయనను నువ్వు అనుసరిస్తున్నావా? ఏమిటి నీ తీరు?’’ అని నిలదీశారు.

దీనికి ఆయన జవాబిస్తూ ‘‘నాకు నా గురువు పట్ల గౌరవం ఉంది. అందుకే ఆయనను నేను ఎప్పుడూ అనుసరిస్తాను. ఆయన చూపిన బాటలోనే పయనిస్తాను’’ అన్నాడు. 

అతణ్ణి ప్రశ్నించిన వారికి ఆ సమాధానం సంతృప్తి కలిగించలేదు. ‘‘మీ గురువు ఒకలా జీవిస్తే, నువ్వు ఒకలా జీవిస్తున్నావ్‌. మరి దీనికేం చెబుతావ్‌?’’ అని అడిగారు.

‘‘మీరు నన్ను, నా గురువును మాత్రమే చూస్తున్నారు. కాబట్టే మీకు అలాంటి సందేహం కలిగింది. నేను ఏళ్ళ తరబడీ నా గురువుతో గడిపాను. ఆయన తన గురువు పట్ల ఎలా ప్రవర్తించారో నిశితంగా పరిశీలించాను. ఆయన ఏనాడూ తన గురువును గుడ్డిగా అనుసరించలేదు. గురువు ఎంత గొప్పవాడైనా సరే... గుడ్డిగా అనుసరించరాదనే పాఠాన్నే నేను నా గురువు జీవన విధానం నుంచి గ్రహించాను. దానినే నేను ఆచరిస్తున్నాను’’ అని బదులిచ్చాడు బొకుజు.

గురువు చేసిన దాన్నే శిష్యుడు కూడా చేస్తేనే ఆ గురు శిష్య సంబంధం ఆదర్శప్రాయం అనుకొనేవారికి బొకుజుకూ, ఆయన గురువుకూ ఉన్న సంబంధం అర్థం కాదు. శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల జీవిత చరిత్రలను పరిశీలిస్తే ఇలాంటి ఉదంతాలు కనిపిస్తాయి. ‘గురుదేవులు చెప్పేది ఒకటి, వివేకానందుడు చేస్తున్నది మరొకటి’ అని ఎందరో అనుకొనేవారు. ఎవరంటేవారు ఆహారాన్ని తెచ్చి ఇస్తే రామకృష్ణులు తినేవారు కాదు. కానీ వివేకానందుడు ఎవరు ఏమి ఇచ్చినా స్వీకరించేవారు. భగవద్గీతను శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడని రామకృష్ణుల విశ్వాసం. ఈ విషయంలో వివేకానందుడికి సందేహం ఉండేది. ఇలాంటి వ్యత్యాసాలు వారిద్దరి మధ్యా ఎన్ని ఉన్నా గొప్ప గురుశిష్యులుగా చరిత్రలో నిలిచిపోయారు.

 రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2021-01-01T06:27:37+05:30 IST