సమీక్షలతో సాగదీస్తారా.. పరిష్కారం చూపుతారా!?

ABN , First Publish Date - 2021-09-29T04:58:13+05:30 IST

ఎటు చూసినా సమస్యలు.. అభివృద్ధి పనులు ముందుకు సాగనంటున్నాయి. కనీసం ఏడాదిగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు ఊసేలేదు.

సమీక్షలతో సాగదీస్తారా..  పరిష్కారం చూపుతారా!?
కలిగిరి-నెల్లూరు మార్గంలోని పొగాకు బోర్డు సమీపంలో చప్టాపై దెబ్బతిన్న రోడ్డు

రబీలోనైనా రైతుకు భరోసా దక్కేనా!?

పింఛన్ల రద్దుతో పండుటాకుల విలవిల

నెల్లూరు, సంగం బ్యారేజీల పూర్తి ఎప్పటికో

ఏడాదిన్న తర్వాత నేడు డీఆర్సీ సమావేశం

పాల్గొనున్న ఇనచార్జి మంత్రి బాలినేని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


నెల్లూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఎటు చూసినా సమస్యలు..  అభివృద్ధి పనులు ముందుకు సాగనంటున్నాయి. కనీసం ఏడాదిగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు ఊసేలేదు. ఉదయం వెళ్లిన వారు సాయంత్రం క్షేమంగా తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పటికే ప్రారంభమైన అరకొర అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. ఇక కొత్త పనులకు టెండర్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు కొవిడ్‌ ప్రత్యక్షంగా వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేయగా పరోక్షంగా లక్షల కుటుంబాలకు ఉపాధిని దూరం చేసింది. కొత్త ఉద్యోగాల కల్పన ఊసేలేకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎదురవుతున్న సమస్యలతో రెండో పంట సాగుకు నాలుగో వంతు కూడా రైతులు ముందుకు రాలేదు. ఇక ఎప్పుడూ లేని విధంగా రెవెన్యూ రికార్డులను జిల్లాలో ఇష్టానుసారం మార్చేస్తున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్నా రికార్డుల ట్యాంపరింగ్‌ ఆగడం లేదు. దీనిపై రాజకీయ ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు ఆచీతూచీ అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇలా అనేక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తున్నా వాటికి పరిష్కారం చూపేందుకు వేదిక కరువైంది. జిల్లాలోని పరిస్థితులపై తరచూ నిర్వహించాల్సిన జిల్లా సమీక్ష కమిటి (డీఆర్సీ) సమావేశం ఏడాదన్నరగా జరగలేదు. చివరగా గతేడాది ఫిబ్రవరి 13న డీఆర్సీ సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌లు తగ్గుముఖం పట్టాక రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీఆర్సీ సమావేశం నిర్వహించారు. కానీ జిల్లాలో మాత్రం పట్టించుకోలేదు. అయితే ఎట్టకేలకు బుధవారం  కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఈ సమావేశం జరగబోతోంది. జిల్లా ఇనచార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న సమావేశంలో జిల్లాలోని సమస్యలపై ఏ విధంగా చర్చిస్తారు.. వాటికి ఎటువంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తిగా మారింది. 


పింఛన్ల తొలగింపు


గడిచిన 4 నెలలుగా వేల సంఖ్యలో పింఛన్ల తొలగింపు  జరుగుతోంది. ఎటువంటి విచారణ లేకుండానే పింఛన్లు ఆపేస్తుండటంతో పేదలు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఒకరికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తోందని, మరొకరికి పొలం ఉందని, ఇంకొకరు ఐటీ రిటర్న్స్‌ చెల్లిస్తున్నారంటూ కారణాలు చూపుతూ పింఛన్లు తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి పింఛన్లు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారే తప్ప ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు. పింఛన్లు కోల్పోయిన నిజమైన లబ్ధిదారులకు డీఆర్సీ సమావేశం ద్వారా ఎటువంటి సమాధానం ఇస్తారన్నది చూడాలి. 


రైతుకు భరోసా కల్పిస్తారా!?


ధాన్యపు గిరిగా పేరుగాంచిన జిల్లాలో ఎప్పుడూ లేనంత దయనీయంగా మారింది రైతుల పరిస్థితి. మొన్నటిదాకా నీరు ఇవ్వండి.. పంట వేసుకుంటామని రైతులు అడగడం చూశారు తప్ప నీళ్లు ఇస్తామన్నా.. పంట వేయలేమని రైతులు చెప్పే  పరిస్థితులు జిల్లాలో మొదటిసారిగా ఏర్పడ్డాయి. ఇందుకు కారణం గతేడాది ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడమే. ఆరుగాలం పండించాక ఆ కష్టానికి తగిన విధంగా కూడా పంటను కొనుగోలు చేయకపోవడం, పైగా నానా  ఇబ్బందులకు గురిచేయడంతో రైతుల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఈ కారణంగానే ఎడగారులో దాదాపు ఐదు లక్షల ఎకరాలకు నీరిచ్చామని ప్రభుత్వం చెప్పుకున్నా వాస్తవానికి అందులో నాలుగో వంతు కూడా పంట సాగవ్వలేదు. దీని మూలంగా వందల కోట్ల రూపాయల ఉత్పత్తి నిలిచిపోయింది. రబీ సీజన వస్తోంది. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంది.  మరి ఈ సీజనలోనైనా రైతాంగం పూర్తిస్థాయిలో సాగు చేసేలా ప్రభుత్వ పెద్దలు భరోసా కల్పిస్తారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


సా..గుతూనే ఉన్న బ్యారేజీల పనులు


అటు సాగు, ఇటు తాగునీటికి కీలకంగా మారనున్న నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు సా...గుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేసినప్పటికీ రెండన్నరేళ్లు కావస్తున్నా ఇంతవరకు అతీగతీలేదు. స్వయంగా ఇరిగేషన శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ ఆ నెలలో పూర్తి చేస్తాం.. ఈ నెలలో పూర్తి చేస్తామని గడువులు పెడుతున్నన అవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి. మరో నెలలో రబీ సీజన ప్రారంభమవుతుంది. ఇప్పటికే పెన్నా నదిలో వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయడం సాధ్యపడుతుందా.. అన్నది అనుమానంగా మారింది. కాగా గతేడాది వరదల సమయంలో సోమశిల బ్యారేజీ దిగువ భాగం దెబ్బతింది. ఆఫ్రాన పూర్తిగా కొట్టుకుపోయింది. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో నిపుణులు బృందం కూడా వీలైనంత త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించింది. కానీ మళ్లీ వరదల సమయం వచ్చినా ఇంత వరకు అడుగు వేయలేదు.


రోడ్డు బాగుపడేదెప్పటికో..


గతేడాది నివర్‌ తుఫాన దెబ్బకు జిల్లాలోని రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా గ్రామాల్లోని రోడ్ల నుంచి ప్రధాన రహదారుల వరకు దారుణంగా మారాయి. వీటిపై ప్రయాణించాలంటే ప్రజలకు నరకం కనిపిస్తోంది. ఏడాది కావస్తున్నా ఇంత వరకు రోడ్లను బాగు చేయలేదు. దాదాపు రూ.160 కోట్లతో మరమ్మతులకు అధికారులు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇప్పటికి మూడుసార్లు టెండర్లు ఆహ్వానించగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇప్పటికే చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సాహసం చేయలేకపోతున్నారు. ప్రభుత్వ తీరుతో అంతిమంగా ప్రజలు గతుకుల రోడ్లపై ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించింది. 



Updated Date - 2021-09-29T04:58:13+05:30 IST