ఆర్యన్ కిడ్నాపింగ్ కుట్రలో వాంఖడే: నవాబ్ మాలిక్

ABN , First Publish Date - 2021-11-07T18:08:20+05:30 IST

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి...

ఆర్యన్ కిడ్నాపింగ్ కుట్రలో వాంఖడే: నవాబ్ మాలిక్

ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) జాతీయ ప్రతినిధి నవాబ్ మాలిక్ తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. ఆర్యన్ ఖాన్ 'కిడ్నాప్' కుట్రలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పాత్ర ఉందని ఆదివారంనాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. బీజేపీ నేత మోహిత్ భారతీయ కాంబోజ్ ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారి (మాస్టర్ మైండ్) అని అన్నారు. సబర్బన్ ఓషివారలోని ఓ స్మశాన వాటికి వద్ద భారతీయను వాంఖడే కలిసారని చెప్పారు.


సమీర్ వాంఖడే సారథ్యంలోని ఎన్‌సీబీ గత నెలలో ముంబైలోని క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఇది 'ఫేక్' కేసు అని మొదట్నించీ చెబుతున్న నవాబ్ మాలిక్ ఆ తర్వాత వాంఖడేపై వరుస ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో సహా ఆరు కేసులు ఢిల్లీలోని ఎన్సీబీ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్‌కు శుక్రవారం బదిలీ అయ్యాయి. అయితే ఏజెన్సీ చర్య కేవలం ముంబై, ఢిల్లీ ఎన్‌సీబీ టీమ్‌ల మధ్య సమన్వయ చర్యగా వాంఖడే పేర్కొన్నారు. ఆర్యన్ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి తనను తొలగించలేదని ఆయన వివరణ ఇచ్చారు. అయితే నవాబ్ మాలిక్ మాత్రం ఈ పరిణామాన్ని మరోలా విశ్లేషించారు. ఎన్‌సీబీ అధికారుల తొలగింపు ఆరంభం మాత్రమేనని, వ్యవస్థ ప్రక్షాళనకు చేయాల్సింది చాలానే ఉందని, ఆ పని చేస్తామని చెప్పారు. దర్యాప్తు జరపాల్సిన కేసులు 26 ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-11-07T18:08:20+05:30 IST