రాజన్న దర్శనానికి సమ్మక్క భక్తులు

ABN , First Publish Date - 2021-02-25T05:15:52+05:30 IST

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

రాజన్న దర్శనానికి సమ్మక్క భక్తులు
వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు

- శనివారం వరకు వనదేవతల మినీ జాతర 

- వేములవాడకు తరలివస్తున్న భక్తులు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మేడారం వెళ్లే భక్తులు, స్థానికంగా అమ్మవారలను దర్శించుకునే వారు ముందుగా తమ ఇలవేల్పయిన  రాజన్నకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే పెద్దదిగా ఖ్యాతి పొందింది. రెండేళ్లకోసారి వనదేవతల మహాజాతర నిర్వహిస్తారు.


మహాజాతర మరుసటి ఏడాది వనదేవతల పూజారులు జరుపుకునే మండమెలిగె పండుగకు కూడా భక్తుల సంఖ్య పెరగడంతో ఒక సంవత్సరం మినీ జాతర, రెండు సంవత్సరాలకు పెద్ద జాతర నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.




ఈ నెల 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో రెండువారాలుగా రాజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారికి కోడె మొక్కులు, బద్దిపోచమ్మకు బోనాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ పెద్ద జాతరకే భక్తులు తరలిరావడం కనిపిస్తుండగా ఈ సారి మినీ జాతర సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 30వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేములవాడలో రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని వనదేవతల మినీ జాతరకు మేడారం బాట పడుతున్నారు. 

Updated Date - 2021-02-25T05:15:52+05:30 IST