మళ్లీ ‘దేవదాయ’ నిర్వహణలోకి సంపత్‌ వినాయగర్‌

ABN , First Publish Date - 2021-05-18T05:10:29+05:30 IST

నగరంలోని ఆశీల్‌మెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయం నిర్వహణ బాధ్యత ఇకపై దేవదాయ శాఖ చూడనుంది. దీనిపై ప్రభుత్వం సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

మళ్లీ ‘దేవదాయ’ నిర్వహణలోకి సంపత్‌ వినాయగర్‌

ఈఓగా అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి బాధ్యతలు

విశాఖపట్నం, మే 17(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆశీల్‌మెట్ట సంపత్‌ వినాయగర్‌ ఆలయం నిర్వహణ బాధ్యత ఇకపై దేవదాయ శాఖ చూడనుంది. దీనిపై ప్రభుత్వం సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతిని పూర్తి అదనపు బాధ్యతలతో ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా నియమించింది. ఇతర ఆరోపణలపై విచారణ నివేదిక ప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదేశించారు.

అంతా పూజారి మహిమే..

ఇక్కడ దేవుడి కంటే పూజారి మహిమే ఎక్కువ. 2018 వరకు ఈ ఆలయం దేవదాయ శాఖ నిర్వహణలోనే ఉండేది. ఈఓ అన్నీ చూసుకునేవారు. అయితే ఇక్కడ ప్రధాన పూజారి... ప్రభుత్వంలోని కొందరు పెద్దలను ప్రసన్నం చేసుకుని ఆలయాన్ని తామే నిర్వహించుకుంటామని ఓ విజ్ఞాపన సమర్పించి సెక్షన్‌ 29కింద మినహాయింపు తెచ్చుకున్నారు. దాంతో ఈఓని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక అప్పటి నుంచి ఆలయంలో దోపిడీ ప్రారంభించారు.  ఏ పూజకు టిక్కెట్లు ఇవ్వకుండా ప్లేటులోనే దక్షిణ రూపంలో వేసేయాలని భక్తులకు సూచిస్తూ రోజూ రూ.20వేల నుంచి రూ.40వేల వరకు దండుకోవడం ప్రారంభించారు. నగరంలో అత్యధికులు కొత్త వాహనం కొంటే.. ఇక్కడికే తీసుకొచ్చి పూజ చేస్తారు. వాహనం ఖరీదును బట్టి అధమంగా రూ.500 నుంచి అత్యధికంగా రూ.10వేల వరకు దక్షిణగా ఇస్తారు. ఇక పూజలు, హోమాలకు వచ్చే ఆదాయం వేరే. కేవలం హుండీలో పడే దక్షిణ మాత్రం ప్రభుత్వానికి వచ్చి, పేట్ల ద్వారా వచ్చే పెద్ద మొత్తాలన్నీ పూజారి కుటుంబం స్వాహా చేస్తోంది. ఇది కాకుండా ఆలయానికి కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి. సీతమ్మఽధార, గండిగుండం వంటి ప్రాంతాల్లో ఉన్న అవి కూడా దుర్వినియోగం అవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఆలయంలోని అన్నదాన సత్రంలో కేటరింగ్‌ వంటలు చేస్తున్నారని కూడా తేలింది. వాటిపై జిల్లా దేవదాయ శాఖ ఏడీ శాంతి గత జనవరి నెలలో విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ అంశాలన్నింటిని ‘ఆంధ్రజ్యోతి’ జనవరి నెలలో ‘దక్షిణ సమర్పయామి’ శీర్షికతో వెలుగులోకి తెచ్చింది.  ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి సెక్షన్‌ 29 కింద ఇచ్చిన మినహాయింపును వెనక్కి తీసుకుంది. దీంతో నెలకు  రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు ఆదాయం దేవదాయ శాఖకు సమకూరనుంది.


Updated Date - 2021-05-18T05:10:29+05:30 IST