ఇసుక.. దొడ్డిదారిన చకచకా!

ABN , First Publish Date - 2021-03-08T05:25:16+05:30 IST

అడవులకు రక్షణగా ఉండాల్సిన అధికారులేకాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారా? వారికి లబ్ధి చేకూర్చేందుకే అటవీ సంపదను దోచుకోమని అనుమతి ఇస్తున్నారా?, అంటే వీటన్నింటికీ ఔననే సమాధానం వస్తోంది. రెండు రోజులుగా చర్ల అభయారణ్యంలో జరుగుతున్న ఇసుక తోలకాలే పై వాక్యాలకు బలం చేకూర్చుతున్నాయి.

ఇసుక.. దొడ్డిదారిన చకచకా!
పట్టుబడిన ట్రాక్టర్లు

అభయారణ్యం నుంచి రెండు రోజులుగా తోలకాలు

పనుల కోసం తరలించిన కాంట్రాక్టర్‌

రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

నర్సరీకంటూ బుకాయింపు.. డీఎ్‌ఫవో దృష్టి సారిస్తే నిజాలు బయటకు

అటవీశాఖాధికారుల పాత్రపై అనుమానాలు

చర్ల, మార్చి 7: అడవులకు రక్షణగా ఉండాల్సిన అధికారులేకాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారా? వారికి లబ్ధి చేకూర్చేందుకే అటవీ సంపదను దోచుకోమని అనుమతి ఇస్తున్నారా?, అంటే వీటన్నింటికీ  ఔననే సమాధానం వస్తోంది. రెండు రోజులుగా చర్ల అభయారణ్యంలో జరుగుతున్న ఇసుక తోలకాలే పై వాక్యాలకు బలం చేకూర్చుతున్నాయి. 

సీతారామ ప్రాజెక్టు కింద అటవీశాఖ నష్ట పోయిన భూములకు బదులుగా చర్ల మండలంలోని కొన్ని రెవెన్యూ గుట్టలను అటవీశాఖకు ప్రభుత్వం అప్పగించింది. కాగా భూముల రక్షణకు కోసం రెండర్లు పిలిచి గుట్టల చుట్టూ కంచె వేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందు కోసం రూ. కోట్లు విడుదల చేసింది. పనులు దక్కించు కున్న కాంట్రాక్టర్లు అడవుల్లోని గుట్టల చుట్టూ కంచె నిర్మిస్తున్నారు. పనుల్లో భాగంగా ఇసుక అవసరం ఎంతో ఉంది. దీంతో ప్రభుత్వానికి నగదు చెల్లించి నాణ్యమైన ఇసుకతో పనులు నిర్వహించాల్సి ఉండగా, అడవుల్లోని వాగుల్లో దొరికే నాసిరకమైన ఇసుకతో పనులు చేపిస్తూ నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు.

అడవిలో క్వారీఏర్పాటు చేసి..

అడవుల్లో జరిగే పనులకు ఇసుక అవసరం పడడంతో చర్ల మడలం దేవరబండ దగ్గన ఉన్న వాగులో క్వారీ ఏర్పాటు చేసి రెండు రోజులుగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదే క్రమంలో ఎవరైనా ప్రశ్నిస్తే అటవీశాఖ కార్యాలయలంలోని నర్సరీకి అంటూ సమాధానం చెప్పుతున్నారు. ఇలా రెండు రోజుల వ్యవధిలో అనేక ట్రాక్టర్ల ఇసుకను మండలంలోని గుట్టల చుట్టు, మండల కేంద్రంలోని  వివిధ పనులకు తరలించారని తెలుస్తోంది. జిల్లా అటవీ అధికారి విచారణ జరిపిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయని పలువురు అంటున్నారు.

అనుమతి ఇచ్చింది ఎవరు?

అడవిలో నుంచి చిన్న కర్ర తీసుకొచ్చినా ఊరు కోని అధికారులు అభయారణ్యం నుంచి అనేక ట్రాక్టర్లు తిరుగుతున్నా ఎందుకు మిన్నకున్నారనేది తెలియాల్సి ఉంది.   ఇసుక దర్జాగా తోలుతున్నా సంబంధిత బీట్‌ అధికారి ఏమయ్యారనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా అధికారులు కాంట్రాక్టర్‌తో మిలాఖత్‌ అయి ఇసుక తోలేందుకు పచ్చజెండా ఊపారని ఈ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు.

రెండు ట్రాక్టర్లు పట్టివేత

శనివారం అభయారణ్యం నుంచి ఇసుక తరలిస్తున్నా రెండు ట్రాక్టర్లను చర్ల మండలం లెలిన్‌ కాలనీ వద్ద ఆర్‌ఐ నవీన్‌ కుమార్‌ పట్టుకున్నారు. అనంతరం చర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. ఇదే విషయం పై చర్ల అటవీశాఖ అధికారి ఉపేందర్‌ను వివరణ కోరగా చర్ల రేంజ్‌ కార్యాలయానికి ఇసుక తోలలేదని, అనుమతి కూడా ఇవ్వలేదని ఈఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2021-03-08T05:25:16+05:30 IST