అంతటా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-09T06:33:35+05:30 IST

కరోనా రెండో దశ ఉధృతితో దేశంలోని ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల దిశగా కదులుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలు, పశ్చిమాన ఉన్న మహారాష్ట్ర ఈ మేరకు చర్యలు

అంతటా ఆంక్షలు

రేపటి నుంచి బెంగళూరులో రాత్రి కర్ఫ్యూ

కర్ణాటకలోని మరో 6 నగరాల్లోనూ అమలు


చెన్నై, బెంగళూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనా రెండో దశ ఉధృతితో దేశంలోని ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల దిశగా కదులుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలు, పశ్చిమాన ఉన్న మహారాష్ట్ర ఈ మేరకు చర్యలు తీసుకోగా.. తాజాగా దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు ఆంక్షలు ప్రకటించాయి. రాజధాని బెంగళూరు సహా మైసూరు, మంగళూరు, కలబురగి, బీదర్‌, తుమకూరు, మణిపాల్‌ నగరాల్లో శనివారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య కర్ఫ్యూ విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కర్ఫ్యూ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. శనివారం నుంచి ఈ నెల 30 వరకు పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి, కర్ణాటక మినహా తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చేవారంతా తప్పనిసరిగా ఈ-పాస్‌ తీసుకోవాల్సిందేనని ఉత్తర్వులిచ్చింది. కాగా, అన్ని పట్టణాల్లో శుక్రవారం సాయం త్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మధ్యప్రదేశ్‌ ప్రభు త్వం లాక్‌డౌన్‌ విధించింది. ఢిల్లీకి ఆనుకుని ఉండే.. నోయిడా, ఘజియాబాద్‌లో 17 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ స్థానిక యంత్రాంగం ఆదేశాలిచ్చింది. యూపీలోని కాన్పూర్‌, వారణాసిల్లో 30 వరకు రాత్రి కర్ఫ్యూ రాత్రి కర్ఫ్యూ ప్రకటించారు.


దేశంలో బుధవారం 1,26,287 మందికి వైరస్‌ సోకిందని, కరోనాతో 685 మంది మృతి చెందారని కేంద్రం ప్రకటించింది. తాజా పాజిటివ్‌ల్లో మహారాష్ట్రలోనే 60 వేలు నమోదవగా.. తర్వాతి స్థానంలో ఛత్తీ్‌సగఢ్‌(10,310) ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా 53 మంది, పంజాబ్‌లో 62 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 4 వేల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తమిళనాడులో 4 వేలు, కర్ణాటకలో 7 వేలు, ఉత్తరప్రదేశ్‌లో 6 వేల పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీ(5,500)లో వరుసగా రెండో రోజు 5 వేలు దాటాయి. గుజరాత్‌(3,575)లోనూ పరిస్థితి తీవ్రమవుతోంది. రాజ్‌కోట్‌లోని ఆస్పత్రుల్లో 24 గంటల వ్యవధిలో 31 మంది చనిపోయారు. లాక్‌డౌన్‌ భయంతో రాష్ట్రం నుంచి పెద్దఎత్తున వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఉత్తరాఖండ్‌లోని డూన్‌ స్కూల్‌లో 15 కేసులు రావడంతో కట్టడి ప్రాం తంగా ప్రకటించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కు పాజిటివ్‌గా తేలింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ప్రధాని మోదీ ఎయిమ్స్‌లో కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు తీసుకున్నారు. మరోవైపు బుధవారం 29.79 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 9.01 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు తెలిపింది. సగటున రోజుకు 34.30 లక్షల మందికి టీకా ఇచ్చామని, ప్రపంచంలో ఇదే అత్యధికమని పేర్కొంది. 

Updated Date - 2021-04-09T06:33:35+05:30 IST