జోరుగా ఇసుక దందా

ABN , First Publish Date - 2020-08-03T10:38:46+05:30 IST

జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మానేరు నుంచి యథేచ్చగా ఇసుకను తోడేసి రాత్రిర్రాతికి వందల లారీల్లో హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తూ

జోరుగా ఇసుక దందా

కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు లారీల్లో  రవాణా

గ్రామాల్లో భారీగా డంపులు.. రాత్రిక వేళల్లో తరలింపు 

ప్రభుత్వ ఖజానాకు గండి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మానేరు నుంచి యథేచ్చగా ఇసుకను తోడేసి రాత్రిర్రాతికి వందల లారీల్లో హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. మానేరు ఇసుకకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో ఇసుక దందా అడ్డూ అదుపులేకుండా సాగుతున్నది. దిగువ మానేరు పరివాహక ప్రాంతాలైన తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి, రేణికుంట మధ్య ఉన్న మోయతుమ్మెదవాగు, కొత్తపల్లి మండలం బావుపేట, ఖాజీపూర్‌, ఎలగందల్‌ గ్రామాల్లోని మానేరు వాగు నుంచి రోజు వేలాది టన్నుల ఇసుకను గ్రామాల్లో డంపు చేస్తున్నారు. రాత్రి హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


ఒక్కో లారీకి రూ. 75 వేల నుంచి లక్ష వరకు

హైదరాబాద్‌-రామగుండం హైవే రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉన్న తిమ్మాపూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్‌, నుస్తులాపూర్‌, కొత్తపల్లి, రేణికుంట, నేదునూరు, వచ్చునూరు గ్రామాలకు ట్రాక్టర్లతో ఇసుకను తరలించి నిల్వ చేస్తున్నారు. ఆ డంపుల నుంచి హైదరాబాద్‌తోపాటు పరిసరాలకు లారీల్లో రాత్రికి రాత్రి ఇసుకను తరలిస్తూ ఒక్కో లారీకి 75వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ ఈ గ్రామాల నుంచి 50కిపైగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా అవుతున్నా మైనింగ్‌, పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఇరుకుల్ల, బొమ్మకల్‌తోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల వాగుల్లోని ఇసుకను స్థానిక అవసరాల పేరుతో తోడేసి వందల ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు.


ఇసుక అక్రమ రవాణాపై ఎవరైనా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారిపై భౌతికదాడులకు పాల్పడటమేకాకుండా బెదిరిస్తున్నారు. ఇసుక అక్రమ దందాతో ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నా అధికారులు కూడా నామమాత్రపు చర్యలు తీసుకోవడమే తప్ప్ప పూర్తిస్థాయిలో నిరోధించడం లేదు. ఇసుక మాఫియా వెనుక రాజకీయపార్టీల బడానేతల హస్తం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతోపాటు కొంత మంది ఇతర పార్టీ నాయకులు ఇసుక అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లు గడించడమే కాకుండా మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులకు లక్షల్లోనే మామూళ్ళు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు నమోదు చేసి కొద్దిరోజులు ఈ దందాను నిలిపివేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ దందా యథావిధిగా నడుస్తోంది 


మన ఇసుక వాహనం పేరుతో..

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు, ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం ఇసుకకు అనుమతివ్వాలని రాజకీయనాయకులు ఒత్తిడి చేయడంతో కలెక్టర్‌ కె శశాంక తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి-రేణికుంట గ్రామాల మధ్యలోని మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసుకెళ్ళేందుకు అధికారిక రీచ్‌గా ప్రకటించారు. ఇక్కడి నుంచి స్థానిక అవసరాల కోసం దూరాన్ని బట్టి ఒక్కో ట్రాక్టర్‌కు 600 నుంచి 1500 వరకు చెల్లించి ఇసుకను తీసుకెళ్లవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా డబ్బులు చెల్లించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  మన ఇసుక వాహనం అనే స్టికర్‌ను అతికించుకొని ఎన్ని ట్రాక్టర్లనైనా తీసుకెళ్ళ వచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి గ్రామానికి 50 నుంచి 100 వరకు ట్రాక్టర్లలో ఇసుకను తరలించి డంపులుగా చేసుకొని అక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇసుకను హైదరాబాద్‌, సిద్దిపేట తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు.  ఒకసారి ట్రాక్టర్‌ ఇసుకకు అనుమతి తీసుకొని అదే రశీదుతో పదుల సంఖ్యలో ట్రిప్పులో ఇసుకను తరలించుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే విమర్శలున్నాయి.  ఇసుక దందాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-08-03T10:38:46+05:30 IST