ఇసుగెత్తిస్తుంది!

ABN , First Publish Date - 2020-08-05T11:41:15+05:30 IST

గోదావరి రీచ్‌ల నుంచి ప్రతి రోజు 25 వేల టన్నుల ఇసుక లభ్యమవుతున్నా పట్టణాల్లో అభివృద్ధి పనులకు గుప్పెడు ..

ఇసుగెత్తిస్తుంది!

మునిసిపాలిటీలను ఊరిస్తున్న ఇసుక 

సొమ్ములు చెల్లించిన కాంట్రాక్టర్లు 

అయినా సరఫరా నిల్‌ 

కొద్దిపాటి అభివృద్ధి పనులకూ అవరోధం 


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): గోదావరి రీచ్‌ల నుంచి ప్రతి రోజు 25 వేల టన్నుల ఇసుక లభ్యమవుతున్నా పట్టణాల్లో అభివృద్ధి పనులకు గుప్పెడు ఇసుక అందడం లేదు. కాంట్రాక్టర్లు సొమ్ములు చెల్లించినా అదిగో ఇదిగో అంటూ రీచ్‌ నిర్వాహకులు కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా అభివృద్ధి పనులకు అవరోధం ఏర్పడు తోంది. రహదారులు, డ్రెయిన్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అసలే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందూ వెనుక ఆలోచిస్తున్నారు. కొత్త టెండర్లు వేసేందుకు సాహసం చేయలేక పోతున్నారు. ఎందుకంటే వారికి ఇప్పుడు ఇసుక లభ్యం కావడం గగనమైపోతోంది. 


500 నుంచి 1000 టన్నులు అవసరం..

ప్రభుత్వమే మునిసిపాలిటీలకు ఇసుక బుక్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో అవసర మైన ఇసుకను ఇంజనీరింగ్‌ అధికారులు బుక్‌ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరను కాంట్రాక్టర్లు చెల్లించారు. రోజులు గడిచిపోతున్నా ఇసుక సరఫరా కావడం లేదు. మరోవైపు పట్టణాల్లో చేపట్టే అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ శాఖ ఆరా తీస్తోంది. వర్షాలకు ముంపు బారిన పడకుండా ప్రజలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. పట్టణాల్లో దెబ్బతిన్న రహదారులు మరమ్మతులు చేయాలన్నా ఇసుక అవసరం కానుంది. ముఖ్యంగా వరద నీటి ప్రవాహానికి అవసరమైన డ్రెయిన్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఏలూరుతోపాటు, జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డి గూడెంలో ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు ప్రతి పట్టణంలోనూ కనిష్టంగా 500 టన్నుల నుంచి గరిష్టంగా 1000 టన్నుల ఇసుక తక్షణమే అవసరం కానుంది. 


ప్రైవేటుకు తరలిపోతోంది..

అభివృద్ధి పనులకు మునిసిపాలిటీ సాధారణ నిధుల నుంచి నాలుగు నెలల క్రితమే టెండర్లు ఖరారు చేసినా పనులు సాగడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా కొద్ది రోజులు ఇసుక సరఫరా నిలిచిపోయినా సడలింపుల తర్వాత మొదలైంది. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజు 25వేల టన్నుల ఇసుక లభ్యమవుతున్నా పట్టణాల్లో అభివృద్ధి పనులకు గుప్పెడు ఇసుక అందడం లేదు. అదనపు సొమ్ములిచ్చే ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తరలిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మునిసి పాలిటీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు కల్పిస్తున్న ఇసుక ధరలకు, ప్రభుత్వం అమలు చేస్తున్న ధరలకు పొంతన లేదు. ప్రభుత్వ ధర అధికంగా ఉంటోంది. ఇటువంటి తరుణంలో అదనపు సొమ్ములు చెల్లిస్తే నష్టపోవాల్సి వస్తోందన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు వెనుకంజ వేశారు. అయితే పట్టణాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తామనడంతో సొమ్ములు చెల్లించారు. అయినా ఇసుక సరఫరా లేకపోవడంతో లబోదిబోమంటున్నారు.

Updated Date - 2020-08-05T11:41:15+05:30 IST