నదిలో ‘ఇసుక’ బ్లాక్!

ABN , First Publish Date - 2020-06-04T08:34:01+05:30 IST

జిల్లావ్యాప్తంగా బుధవారం 14 రీచ్‌ల్లో ఇసుక..

నదిలో ‘ఇసుక’ బ్లాక్!

దారి మళ్లిస్తున్న ఇసుక మాఫియా!

అధికార పార్టీ నేతలదే ఇష్టారాజ్యం

కృష్ణానది రీచ్‌ల్లోని ఇసుకంతా వారి కనుసన్నల్లోనే తరలింపు

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న సామాన్యులకు వాగుల్లో ఇసుక

నిర్మాణాలకు ఉపయోగపడని ఇసుకతో నష్టం

మంచి ఇసుక కావాలంటే బ్లాక్ మార్కెట్‌లోనే..


విజయవాడ(ఆంధ్రజ్యోతి): కృష్ణానది రీచ్‌ల్లోని ఇసుకకు కాళ్లొస్తున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అది తరలిపోతోంది. ఆన్‌లైన్ సైట్ ఓపెన్ అయిన ఐదు నిమిషాలకే రీచ్‌ల్లోని ఇసుక అమ్మకాలు పూర్తయినట్టు కనిపించినా, ఆ ఇసుక ఎటెళ్లిపోతోందో మాఫియాకు మినహా ఎవరికీ తెలియదు. మరీ ముఖ్యంగా మద్దూరు, రొయ్యూరు-1, నార్త్ వల్లూరు రీచ్‌ల్లో ఇసుక బుక్ చేసుకోవడం సామాన్యుడికి సాధ్యం కాదు. వేలకు వేల రూపాయలు వెచ్చించేవారికి మాత్రమే నదిలోని నాణ్యమైన ఇసుక బ్లాక్ మార్కెట్ నుంచి లభిస్తుంది. సామాన్యులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వాగుల్లోని ఇసుకను తరలించేస్తారు. ఇళ్ల నిర్మాణానికి పనికిరాని వాగు ఇసుకను ఏమి చేసుకోవాలో అర్థంకాక, వారు తిరిగి, అత్యధిక ధర చెల్లించి, బ్లాక్ మార్కెట్లోని నది ఇసుకనే తీసికెళ్తున్నారు.


జిల్లావ్యాప్తంగా బుధవారం 14 రీచ్‌ల్లో ఇసుక విక్రయించారు. మద్దూరు రీచ్‌లో 541 టన్నుల ఇసుక విక్రయించగా, రొయ్యూరు-1లో 496 టన్నులు, నార్త్‌ వల్లూరులో 495 టన్నులు విక్రయించినట్లు చూపారు. వాస్తవానికి ఆన్‌లైన్‌ సైట్‌ ఓపెన్‌ అయిన నిమిషంలోనే ఈ రీచ్‌ల్లో ఇసుక సోల్డ్‌ అని కనిపించింది. ఈ రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ అధికారికంగా అమ్మినట్లు చూపుతున్నారు. ఈ మూడు రీచ్‌ల్లో ఇసుక బుక్‌ చేసుకోవడం సామాన్యుడికి సాధ్యం కాదు. ఇక్కడ ఇసుక బాగుంటుందని పేరు. భవన నిర్మాణదారులు ఎక్కువగా ఈ ఇసుకకే ప్రాధాన్యమిస్తారు. ఈ డిమాండ్‌ను అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మాఫియాగా మారి భారీ ఎత్తున నాణ్యమైన ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేస్తున్నారు. 


సామాన్యులకు వాగుల్లోని ఇసుక

సామాన్యులు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుంటే వారికి పశ్చిమ కృష్ణాలోని వాగుల్లో ఉండే రీచ్‌ల్లోని ఇసుక మాత్రమే లభిస్తోంది. కృష్ణానది చెంత ఉండే రీచ్‌ల్లో ఇసుక మొత్తం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది. అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియాగా సామాన్యులను దోచుకుంటున్నారు. సుమారు రూ.23 వేలకు 18 మెట్రిక్‌ టన్నుల ఇసుక బుక్‌ చేసుకున్న సామాన్యులకు నాసిరకం ఇసుక ఇంటికి చేరుతుంది. రూ.30వేలు వెచ్చించగలిగితే, బ్లాక్‌ మార్కెట్‌లో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. 


లాటరీ కొట్టినట్టే..!

ఆన్‌లైన్‌లో ఇసుక లభ్యత చాలా కష్టంగా మారింది. సైట్‌ తెరిచిన ఐదు నిమిషాల్లోపే మొత్తం అమ్ముడుపోయినట్లు చూపుతున్నారు. దీంతో భవన నిర్మాణదారులు, ఇళ్లు కట్టుకునే సామాన్యులు ఇసుక దొరకదేమోనని హడావిడిగా బుక్‌ చేసుకుంటున్నారు. 80 శాతం మందికి వాగుల్లోని గండ్ర ఇసుక ఇంటికి వస్తోంది. నిర్మాణ అవసరాలకు పనికి రాని ఆ ఇసుకను ఏం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ బాధ అంతా ఎందుకనుకుని రెండోసారి బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుకను కొనుక్కునేందుకు మొగ్గు చూపుతున్నారు. 


ఇసుక మాఫియాగా అధికార పార్టీ నేతలు 

జిల్లాలోని ఓ మంత్రి, పలువురు ప్రజాప్రతినిధులు ఓ కోటరీగా ఏర్పడ్డారు. జిల్లాలోని ఏ రీచ్‌లో మంచి ఇసుక ఉన్నా ముందుగా వారు దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. దాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు అమ్మి, సొమ్ము చేసుకుంటున్నారు. మద్దూరు, రొయ్యూరు, నార్త్‌ వల్లూరు రీచ్‌ల్లో 18 టన్నుల ఇసుక ధర రూ.6750 (టన్ను రూ.375). ఇది ప్రభుత్వ ధర. జిల్లాలో అధిక భాగం నిర్మాణ పనులు జరిగేది విజయవాడ, నగరం చుట్టుపక్కలే. ఎక్కువ శాతం ఇసుక ఈ ప్రాంతాలకే సరఫరా అవుతుంది.


ఈ రీచ్‌ల నుంచి ఇసుక రవాణా చేసినందుకు రూ.2వేలు అయితే ఎక్కువ. అంటే మొత్తం ఖర్చు రూ.8750. కానీ బ్లాక్‌ మార్కెట్‌లో ఇదే ఇసుకను రూ.30వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షాత్తు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులే తెర వెనుక ఉండి ఇసుక మాఫియాను నడిపిస్తుండటంతో అధికారులు కిమ్మనలేని పరిస్థితి. మొత్తం మీద టీడీపీ హయాంలో రూ.5 నుంచి ఆరు వేలకు దొరికిన లారీ ఇసుక ఇప్పుడు రూ.30వేలు పలుకుతోంది. సామాన్యుడి జేబు గుల్ల చేస్తోంది.  

Updated Date - 2020-06-04T08:34:01+05:30 IST