Abn logo
May 26 2020 @ 00:00AM

ఇసుక దందా

ఇసుకాసురులు

మొర్రేడు, కిన్నెరసానిలో అక్రమ తవ్వకాలు

ఇల్లెందు నుంచి హైదరాబాద్‌కు తరలింపు 

లారీ ఇసుక రూ.60 వేల పైమాటే..


ఇల్లెందుటౌన్‌, మే 25: అనుమతులు లేకుండా లక్షలాది రూపాయల ఇసుక దందా సాగిస్తున్నారు. ఇల్లెందులోని కొంత మంది చోటా మోటా వ్యక్తులు ఇసుక దందాలో పాలు పంచుకుంటున్నారు. ఇల్లెందు పట్టణం కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాతో కొంత మంది లక్షలాది రూపాయలు పొగేసుకుంటున్నారు. ఆళ్లపల్లి మండలంలోని కిన్నెరసాని, టేకులపల్లి మండలంలోని ముర్రెడు వాగుల నుంచి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇల్లెందు పట్టణంలోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. 


ఇల్లెందు టు హైదరాబాద్‌

ఇల్లెందులో ఇసుకను డంప్‌ చేసిన ప్రాంతాల నుంచి రాత్రి వేళలో ప్రత్యేక లారీల ద్వారా హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఇసుక డిమాండ్‌ భారీగా ఉండటంతో రూ. 60 వేలకు పైగా లారీ ఇసుకను విక్రయిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఆళ్లపల్లి మండలంలోని కిన్నెరసాని నదికి రెండు ఇసుక రీచ్‌లకు అనుమతి ఉంది. అవి కాకుండా మరో ప్రాంతంలో అక్రమంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి రవాణా చేస్తున్నారు.  టేకులపల్లి మండలం శంభునిగూడెం వద్ద గల ముర్రెడు వాగులో గతంలో ఇసుక రీచ్‌లు ప్రభుత్వ అనుమతితో నడిచేవి. ప్రస్తుతం ఇసుక రీచ్‌లకు అనుమతులు లేకపోయినప్పటికీ ముర్రెడు వాగు వద్ద నుంచి ప్రతి రోజు రాత్రి సుమారు 20 ట్రాక్టర్ల ద్వారా అక్రమ మార్గంలో ఇల్లెందుకు తరలిస్తున్నారు. 


స్థానికులకు బెదిరింపులు

ఇల్లెందులో ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.ఆరు నుంచి రూ. ఎనిమిది వేలకు కొనుగోలు చేసి ఈ ఇసుకను హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతులు లేని ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న అధికారులు, స్థానికంగా ఉన్నవారిని వారిని ఇసుకాసురులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఇటీవల ఇల్లెందు పట్టణంలోని ట్రైబల్‌ వేల్ఫేర్‌ పాఠశాల సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన 20 లారీల ఇసుకను ఇల్లెందు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. కొంత మంది రెవెన్యూ అదికారులు సైతం ఇసుక అక్రమ రవాణాలో పాలు పంచుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆధాయానికి గండికొడుతూ సాగుతున్న ఇసుక దందాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


అక్రమ రవాణాపై నిఘా..మస్తాన్‌రావు, తహసీల్దార్‌, ఇల్లెందు

ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేశాం. పోలీసులకు సమాచారం ఇచ్చి రక్షణతోనే ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలి. గతంలో 20 లారీల ఇసుకను సీజ్‌ చేశాం.

Advertisement
Advertisement