ఇసుక టైరుబండి కార్మికుడిపై పోలీసుల ప్రతాపం

ABN , First Publish Date - 2020-12-05T06:05:17+05:30 IST

ఇసుక టైరుబండి కార్మికుడిపై శుక్రవారం పోలీసులు ప్రతాపం చూపారు. నది సమీపంలో అతన్ని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.

ఇసుక టైరుబండి కార్మికుడిపై పోలీసుల ప్రతాపం
పోలీసులు దుడుకు చర్యలు వివరిస్తున్న టైరుబండ్ల కార్మికులు

చోడవరంలో ఇసుక టైరుబండ్ల కార్మికుల ఆందోళన

వైసీపీ అధికారంలోకి వచ్చాక వేధింపులు పెరిగాయని ఆవేదన


చోడవరం, డిసెంబరు 4: ఇసుక టైరుబండి కార్మికుడిపై శుక్రవారం పోలీసులు ప్రతాపం చూపారు. నది సమీపంలో అతన్ని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న టైరుబండ్ల కార్మికులు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 

పట్టణ శివారు గౌరీపట్నం వద్ద పెద్దేరు నుంచి టైరుబండ్లతో ఇసుక తీసుకు వెళ్తున్నట్టు సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ సిబ్బందితో కలిసి నది వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న గాంధీగ్రామానికి చెందిన జగదీశ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడి సెల్‌ఫోన్‌ పగులగొట్టడంతో పాటు తీవ్రంగా కొట్టి గాయపరిచినట్టు టైరుబండి యజమానులు తెలిపారు. యువకుడిపై దాడి చేసిన తరువాత అక్కడ ఖాళీగా ఉన్న టైరుబండ్లను పోలీసు స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే టైరుబండ్ల కార్మికులు పోలీసు స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు.

పోలీసులు అకారణంగా చేయి చేసుకోవడం అన్యాయమని, ఎన్నో ఏళ్లుగా నది నుంచి ఇసుక తీసుకుని జీవనం సాగిస్తున్న తమపై కేసులు పెట్టి తరచూ దాడులు చేయడం సరికాదని వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల నుంచి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చని ఒక పక్క ప్రభుత్వం చెపుతున్నదని, మరోవైపు తమను ఈ విధంగా పోలీసులు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వారు కోరారు. 

Updated Date - 2020-12-05T06:05:17+05:30 IST