చీకట్లో ఇసుక దందా

ABN , First Publish Date - 2021-01-21T05:57:24+05:30 IST

చీకటి మాటున ఇసుకను దోచేస్తున్నారు. హంద్రీ నదిలోకి చొరబడి టన్నులకొద్దీ ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

చీకట్లో ఇసుక దందా

  1. హంద్రీ నుంచి తోడేస్తున్నారు


కోడుమూరు, జనవరి 20: చీకటి మాటున ఇసుకను దోచేస్తున్నారు. హంద్రీ నదిలోకి చొరబడి టన్నులకొద్దీ ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అనుమతి లేని ప్రాంతాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కోడుమూరు మండల పరిధిలోని హంద్రీనది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిషేధించింది. దీన్ని అదనుగా తీసుకుని కోడుమూరు, వర్కూరు, గోరంట్ల, ముడుమలగుర్తిల్లో ఇసుక మాఫియా దందాకు తెరలేపింది. రాత్రిళ్లు నదిలోకి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు దిగుతున్నాయి. పులకుర్తి, కల్లపరి, వెంకటగిరి, చిల్లబండ, అమడగుంట్ల, కోడుమూరు, ప్యాలకుర్తి, గూడూరు మండలం చనుగొండ్ల తదితర గ్రామాలకు ఇసుకను తరలించి అమ్ముతున్నారు. ట్రాక్టర్‌ ఇసుక రూ.2500 నుంచి రూ.4 వేల ధర పలుకుతోంది. పేదలకు పిడికెడు ఇసుక దొరకడం లేదు. కానీ బడాబాబులు నిర్మించే ఇళ్లు, దుకాణ సముదాయాలకు కావలిసినంత ఇసుక దొరుకుతోంది. 


పక్కా  ప్రణాళికతో..

రాత్రి 9 గంటలు దాటగానే లెక్కకు మించిన ట్రాక్టర్లు నదిలోకి దిగుతున్నాయి. ఇసుక నింపుకొని అనుకున్న ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. పోలీసులు, అధికారుల కళ్లుగప్పేందుకు ఇసుక మాఫియా ప్రతి ట్రాక్టర్‌కు ఒక మోటార్‌బైక్‌ను ఏర్పాటు చేసుకుంది. ట్రాక్టర్‌ నదిలోకి వెళ్లినప్పటి నుంచి రోడ్డు మీదకు వచ్చె వరకూ బైక్‌ మీద ఇద్దరు వ్యక్తులు కాపలా కాస్తారు. ఇసుక ట్రాక్టర్‌ రోడ్డు మీదకు రాగానే వెళ్లాల్సిన రూట్‌లో బైకు ముందుగానే వెళుతుంది. మధ్యలో పోలీసులు, ఎస్‌ఈబీ, రెవెన్యూ అధికారులు కనిపిస్తే బైక్‌పై ఉన్న వ్యక్తులు ట్రాక్టర్‌ డ్రైవర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తారు. వారు అప్రమత్తమై ట్రాక్టర్‌ను సురక్షిత ప్రాంతంలో నిలబెట్టుకుంటారు. అనుకూల పరిస్థితులు ఏర్పడిన తరువాత ట్రాక్టర్‌ బయటికి వచ్చి అనుకొన్న చోట అన్‌లోడ్‌ చేసి వెళ్తుంది. అయితే ఇసుక మాఫియాకి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 


ఎస్‌ఈబీకి సంబంధం లేదా..?

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు మద్యం నియంత్రణకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో పాటు ఇసుక అక్రమ రవాణా కట్టడికి ఎస్‌ఈబీ చర్యలు తీసుకోవాలి. కానీ ఇసుక అక్రమ రవాణాతో తమకు సంబంధం లేదన్నట్లు కోడుమూరు ఎస్‌ఈబీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. మద్యం, ఇసుక, మట్కా, గుట్కా, గంజాయి. మత్తుపదార్థాలు తదితరాల నియంత్రణకు ఎస్‌ఈబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


సమాచారం ఇవ్వండి..

ఇసుక అక్రమ రవాణా గురించి ప్రజలు సమాచారం ఇవ్వాలి. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటాం. మట్కా, గుట్కా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల గురించి తెలిస్తే ప్రజలు సమాచారం ఇచ్చి సహకరించాలి. - శంకర్‌, ఎస్‌ఐ, ఎస్‌ఈబీ, కోడుమూరు


దాడులు నిర్వహిస్తున్నాం

ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాము. అర్ధరాత్రి కూడా దాడులు నిర్వహి స్తున్నాం. ఇదివరకే పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్‌ చేసి ట్రాక్టర్‌ యజమాని, డ్రైవర్లపై కేసులు నమోదు చేశాము. ఇసుక విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. - మల్లికార్జున, ఎస్‌ఐ, కోడుమూరు

Updated Date - 2021-01-21T05:57:24+05:30 IST