ఇప్పటికీ అంతే

ABN , First Publish Date - 2020-08-05T11:50:59+05:30 IST

ఈ ఏడాది ఇసుక సమస్య తీరలేదు. గతేడాది సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇసుక సమస్య వెంటాడుతూనే ఉంది.

ఇప్పటికీ అంతే

 ఇంకా 59 వేల టన్నుల  పెండింగ్‌

  కోనసీమలో 40 వేల టన్నుల ఆర్డర్లకు ఎప్పుడిస్తారో

  జిల్లాలో 28 ర్యాంపులే నిర్వహణ

  వరదల ఎగువభాగంతో మూతపడుతున్న ర్యాంపులు


ఈ ఏడాది ఇసుక సమస్య తీరలేదు. గతేడాది సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇసుక సమస్య వెంటాడుతూనే ఉంది. సాధారణంగా వేసవి కాలంలో ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా ఉంటాయి. వాటికి ఇసుక బాగా అవసరం. కానీ అప్పుడు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ఇసుక  ఇప్పటికీ సరఫరా అవుతూనే ఉంది. గత నెలలో 2 లక్షల టన్నుల ఇసుక ఆర్డర్లు పెం డింగ్‌ ఉండగా,  ప్రస్తుతం నెమ్మదిగా 59 వేల టన్నులకు తీసుకొచ్చా రు. కోనసీమలో సుమారు 40 వేల టన్నుల ఇసుక ఆర్డర్లు పెండింగ్‌ ఉన్నాయి. కొద్దిరోజుల కిందట వరకూ సుమారు 60పైగా ర్యాంపుల నుంచి ఇసుక తవ్వారు. పట్టా భూముల నుంచి కూడా తీశారు. ఓపెన్‌ ర్యాంపుల నుంచే కాకుండా పడవల నుంచి కూడా అధికంగా ఇసుక తీశారు. 9 స్టాక్‌పాయింట్లు పెట్టారు. కానీ జిల్లాలో ప్రజల అవసరాలకు పెద్దగా ఉపయోగపడలేదు.


కరోనా వల్ల రియల్‌ ఎస్టేట్‌కు తీవ్ర దెబ్బ తగలడంతో ఇసుక కొరత మరింత దెబ్బకొట్టింది. డోర్‌ డెలివరీ ప్రారంభించేసరికి వానాకాలం వచ్చేసింది. ఇటీవల కొందరి ఇళ్ల వద్ద ఇసుక రాశులు కనిపిస్తున్నాయి. కానీ వర్షాల పనులు జరగడం లేదు. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిధిలోని గాయత్రీ ర్యాంపులు- 4, కోటిలింగాల ర్యాంపులు-3 కాతేరు -2, వెంకటనగరం ఒకటి  పనిచేస్తున్నాయి. ఇవన్నీ గోదావరి లోపల నుంచి ఇసుక తెస్తున్నారు. ములకల్లంకలో పట్టా భూముల నుంచి తీస్తున్నారు. కోనసీమలో రావులపాలెం, దిండి, సఖినేటిపల్లి, పెదపట్నం, అప్పనపల్లి, సోంపల్లి తదితర ప్రాంతాల్లో అధికంగా ఇసుక తీస్తున్నారు. అయినా ఇసుక అందకపోవడం తో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆన్‌ లైన్‌ బుక్‌ చేసుకున్న వినియోగదార్లకు సుమారు 40వేల టన్నుల ఇసుకను సరఫరా చేయవలసి ఉంది. ఇప్పటికే చాలా రోజులు అయింది. అధికారులు మాత్రం వారం రోజుల్లో అంద రికీ ఇసుక సరఫరా చేస్తామని చెబుతున్నారు.


ఇంకా వర్షాలు ముమ్మరమైతే ఈ సీజన్‌లో ఇక పనులు జరిగే అవకాశం తక్కువే. రాజమహేంద్రవరం, పెద్దాపురం, జగ్గంపేట, తుని, కాకినాడ, రంపచోడవరం తదితర ప్రాంతాలకు 48 గంటల్లో ఇసుక సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతం మీద కాస్త మెరుగుపడినప్పటికీ వానల వల్ల డోర్‌ డెలివరీ చేసినా పెద్దగా వినియోగదారుడికి ప్రయోజనం ఉండడం లేదు. ఇక విశాఖకు బొమ్మూరు, గండేపల్లి స్టాక్‌ పాయింట్ల నుంచి ప్రతీ రోజూ 2వేల టన్నుల ఇసుక  రవాణా చేస్తున్నారు. మిగతా స్టాక్‌పాయింట్ల నుంచి బల్క్‌ ఆర్డర్లు ఇవ్వనున్నారు. వచ్చే వారం నుంచి అన్ని స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుక రవాణా అవుతుందని అధికారులు చెబుతున్నారు.


అక్రమ ఇసుక రవాణా

 ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఎగువభాగంలో ర్యాంపులు మూతపడినప్పటికీ కాటవరం నుంచి చడీచప్పుడు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. అఖండగోదావరిలో అధికంగా ఇసుక తవ్వేస్తున్నారు. కోనసీమలో వినియోగదారుడికి సరిగ్గా దొరకడం లేదు కానీ డబ్బులు అధికంగా ఇస్తే ఇసుక సరఫరా బాగానే జరుగుతోంది. మరోవైపు పెట్టుబడి పెట్టి ర్యాంపులు నిర్వహించినవారికి, వారు తీసిన ఇసుకకు రావలసిన సొమ్ము ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తిగా రాకపోవడంతో నిర్వాహకులు ఆందోళనచెందుతున్నారు. ఇప్పటికే రూ.కోట్లాది బకాయిలు ఉన్నాయి.

Updated Date - 2020-08-05T11:50:59+05:30 IST