Abn logo
Jun 4 2020 @ 17:52PM

ఇసుక క్వారీలు వైసీపీ నేతల కబ్జాలో ఉన్నాయి: సుంకర పద్మశ్రీ

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ మెంబర్ సుంకర పద్మశ్రీ విమర్శలు చేశారు. రైతు భరోసా కేంద్రాల వల్ల కౌలు రైతులకు ఎటువంటి ఉపయోగం ఉండదని, రాజధాని రైతుల త్యాగాలను గుర్తించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆమె మండిపడ్డారు. కరోనా సమయంలో రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాజధాని నిర్మాణం కోసం రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చారని, ప్రభుత్వం ఇంతవరకు వారికి వార్షిక కౌలు చెల్లించలేదని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


170 రోజులుగా రాజధాని రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ముఖ్యమంత్రి జగన్ వారిపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక క్వారీలు  వైసీపీ నేతల కబ్జాలో ఉన్నాయని, ఇసుక లేకపోవడంతో ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 10 వేలు భృతి చెల్లించాలని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఉచిత ఇసుక హామీ కలగానే మిగులుతుందని, వైసీపీ పాలనలో దళితులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.

సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లుకు మద్దతు ఇచ్చి వైసీపీ మైనార్టీలకు ద్రోహం చేసిందన్నారు. మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆమె డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీ, కాపు డిక్లరేషన్ పెడతామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని, కొద్దిమంది కాపు నాయకులకు మంత్రి పదవి ఇస్తే డిక్లరేషన్ ఇచ్చినట్టా అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.

Advertisement
Advertisement
Advertisement