కుమరం భీం జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా

ABN , First Publish Date - 2021-03-01T04:25:37+05:30 IST

జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసా గుతోంది. నిబంధనలకు పాతరేసి స్మగ్లర్లు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు

కుమరం భీం జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా
రెబ్బెన మండలంలోని వాగులో ఇసుక తవ్వకాలు

- వాగులను తోడేస్తున్న అక్రమార్కులు
- ట్రాక్టర్లతో రహస్య ప్రాంతాల్లో డంపింగ్‌
- రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు తరలింపు
- పట్టించుకోని రెవెన్యూ, పోలీస్‌ అధికారులు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28: జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసా గుతోంది. నిబంధనలకు పాతరేసి స్మగ్లర్లు అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఫలితంగా వాగులు, వంకలన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జిల్లాలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేక పోయినా ట్రాక్టర్ల యజమానులు నామమాత్రంగా పర్మిట్లు తీసుకుంటు న్నారు. ఇలా తీసుకున్న ఒక్కో పర్మిట్‌పై పదేసి ట్రిప్పుల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు రెవెన్యూ, పోలీసుల పాత్ర సైతం ఉన్నట్లు ఆరోపణలు వినిపి స్తున్నాయి. ముఖ్యంగా ఒక్కో ట్రాక్టర్‌కు యజమాని నుంచి నెలకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా జిల్లా కేంద్రంతో పాటు 15 మండలాల్లోనూ ఇంచుమించు ఇదే తరహాలో అక్రమార్కులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.


ప్రజాప్రతినిధుల అండ..
జిల్లాలోని రెండు శాసనసభ నియోజక వర్గాల పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండ దండలు ఈ అక్రమ వ్యాపారం వెనుక పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ పట్టణ శివారులోని పెద్దవాగు మొదలుకుని దహెగాం మండలంలోని ఎర్రవాగు వరకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న అక్రమార్కులు మాఫీయాను తలదన్నే రీతిలో ఎక్స్‌కవేటర్లు, డోజర్లు వంటి యంత్ర సామగ్రిని వినియోగించి మరీ ఇసుక తరలిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. వాస్తవానికి కుమరం భీం జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్‌లు గుర్తించలేదు. కానీ జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న వాగులు, వంకల ద్వారా ఉన్నా పోగయ్యే స్వల్ప పరిమాణం ఇసుక మేటలను కూడా వ్యాపారులు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, భూగర్భ జల వనరుల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను ఇసుకకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు ధర పలుకుతోంది. నిబంధనల ప్రకారం లారీలలో ఇసుక తరలించరాదన్న ఆదేశాల ఉన్నా యి. దీంతో  అక్రమార్కులు రూట్‌ మార్చి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న డంప్‌లకు తరలించి నిలువ చేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు.


అడుగంటుతున్న భూగర్భ జలాలు..
కుమరం భీం జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో పుష్కళంగా కనిపించే భూగర్భ జలాలు ఎండ కాలంలో అడుగంటుతున్నాయి. వాగులు వంక ల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల మూలంగా ఉన్న కొద్ది పాటి భూగర్భ జలాల మట్టం కూడా దారుణంగా పడి పోతున్నట్లు  భూగర్భ జల వనరుల శాఖ  సర్వేల్లో వెల్లడైంది.  ముఖ్యంగా వాగులు, ఒర్రెలు ప్రవహిస్తున్న పరిసరాల్లో భూగర్భ జలాలపై ఇసుక తవ్వకాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, గూడాల్లో తీవ్ర తాగునీటికి  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం నదులు, ఉప నదుల్లోనే మీటర్‌ లోతు కు మించి ఇసుక తవ్వకాలు జరపడం నిషేధం. వాల్టా చట్టాన్ని అనుసరించి వాగులు, వంకల్లో అస్సలు ఇసుకు తీయ కూడదు. కాగా జిల్లాలో నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులు దందా కొనసాగిస్తు న్నారు.


పెద్దవాగు నుంచి..
ఆసిఫాబాద్‌ పట్టణ సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో ఇసుక ఇక్కడి నుంచి ఆదిలాబాద్‌, వాంకిడి, తిర్యాణి, కెరమెరి మండలాలతో పాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు.  మండ లంలోని గుండి, రహపల్లి, మొరంవాగుల నుంచి రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా రవాణా చేసి ఖాళీ స్థలాల్లో డంప్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా లారీలలో లోడ్‌ చేసి మహా రాష్ట్ర, ఆదిలాబాద్‌, మంచిర్యాల ప్రాంతాలకు రవాణా చేస్తూ అక్రమా ర్కులు సొమ్ము చేసు కుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అలాగే  రెబ్బెన మండలంలోని పులికుంట, గంగాపూర్‌, కొండపల్లి, నవేగాం వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసు కను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి మండలంలోని పలు గ్రామాలతో పాటు జిల్లా కేంద్రానికి, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యూ) మండలాలతో పాటు మంచిర్యాల జిల్లాలోని తాండూర్‌ మండలానికి సైతం ఇసుక రవాణా ట్రాక్టర్ల ద్వారా చేస్తున్నారు.  అడపాదడపా పోలీస్‌, రెవెన్యూ అధికారులు ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించిన అక్రమార్కులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దహెగాం మండల కేంద్రంలోని పెద్దవాగు, కల్వాడ గ్రామం వద్ద గల ఎర్రవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కౌటాల మండలంలో ముత్తంపేట, తాట్‌పలి పరిసరాల్లోని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలోని చింతలమానెపల్లి వాగుతో పాటు రుద్రాపూర్‌ వాగు,  కాగజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి, పెద్దవాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. కెరమెరి మండలంలోని సాంగ్వీ, కైరి తదితర గ్రామాల్లోని వాగుల నుంచి అక్రమార్కులు ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


ఇసుక స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి..
- కాండ్రె విశాల్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు
అక్రమంగా వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్న స్మగ్లర్లపై అధికారు లు కఠిన చర్యలు తీసు కోవాలి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. వాగులు, ఒర్రెల నుంచి ఇసుకను తర లించ డం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2021-03-01T04:25:37+05:30 IST