Abn logo
Oct 25 2021 @ 00:59AM

ప్రభుత్వ కార్యాలయాల పేరిట ఇసుక అక్రమ రవాణా

పెద్దేరు వద్ద ఇసుకను లోడ్‌ చేస్తున్న కూలీలు

అనుమతి ఒక చోటికి... తోలేది మరో చోటికి 


వర్షాల పేరిట డిమాండ్‌ సృష్టించి అధిక ధరలకు విక్రయం


ములకలచెరువు, అక్టోబర్‌ 24: మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల పేరిట ఇసుకాసురులు  అక్రమ రవాణాకు తెరలేపారు. అనుమతి ఒక చోటికి తీసుకుని మరో చోటికి తోలుతూ సొమ్ము చేసుకుం టున్నారు.  కొందరు ఒకడుగా ముందుకేసి ప్రభుత్వ భవనాలు, సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం తదితర పనులకు ఇసుక తోలుతామని అధికారుల నుంచి అనుమతి తెచ్చుకుంటున్నారు. ప్రతి రోజు ప్రభుత్వ కార్యాలయాల పనులకు ఒక లోడు ఇసుక తోలితే ఐదు లోడ్లు ఇతరులకు  చేరు స్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజూ ఒక ట్రాక్టర్‌కు రెండు లోడ్ల ఇసుక మాత్రమే తోలాలి. అయితే ఇసుకాసురులు మాత్రం ప్రతి రోజు ఐదు నుంచి ఎనిమిది లోడ్ల వరకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇలా అనుమతి ఓ చోటుకి ఉంటే మరో ప్రారంతానికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను నెల రోజుల క్రితం ఎస్‌ఐ రామకృష్ణ సీజ్‌ చేశారు. తాజాగా మూడు రోజుల క్రితం అనుమతి, నంబర్‌ ప్లేటు లేని ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పెద్దేరు నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు పలువురు చెబుతున్నారు. వర్షాల కారణంగా  ఇసుక రేట్లు  భారీగా పెంచేశారు.గతంలో లోడు ఇసుక రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఉంటే ప్రస్తుతం రూ.3,500 వరకు విక్రయిస్తున్నారు. దీంతో గృహాలు నిర్మించుకుంటున్న ప్రజలు ఇసుక కొ నాలంటే బెంబేలెత్తుతున్నారు. కొందరు ఇసుక కొన లేక గృహ నిర్మాణాలు నిలిపివేశారు.  ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు చూసీచూ డనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని పలువురు  మండలవాసులు కోరుతున్నారు.