ఇంటికి చేరని ఇసుక

ABN , First Publish Date - 2020-06-06T09:06:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన ఇసుక నూతన విధానంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ని తీసుకొచ్చింది. ఇది సామాన్యులకు కష్టాలు తేగా

ఇంటికి చేరని ఇసుక

డిపోల్లో ఫుల్‌.. ఆన్‌లైన్‌లో నిల్‌

తవ్వుతున్నారు.. తరలించేస్తున్నారు

సామాన్యులకు బుకింగ్‌లోనే కష్టాలు

అక్రమార్కులకు మాత్రం ఎంతకావాలంటే అంత

ఇంటింటికీ అన్నారు.. ఎటెళ్తోందో అంతుబట్టని వైనం

నూతన పాలసీతో సామాన్యులకు సంకటం.. అక్రమార్కులకు వరం


పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన రెబ్బనబోయిన లక్ష్మయ్య ఇసుక కోసమని బుకింగ్‌ చేసి పదిహేను రోజులైంది. ఇంకా ఇంటికి చేరలేదు. అదే గ్రామానికి చెందిన ఎస్కే వలి అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు 30 రోజులుగా తిరుగుతూనే ఉన్నాడు. తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన షేక్‌ జిలాని అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో మే 27 నుంచి  ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు బుక్‌ కాలేదు.. ఇది వీరి ముగ్గురి సమస్య కాదు.


జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వేల సంఖ్యలో నిర్మాణదారులు ఇసుక అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ ఇసుక.. సులభతరంగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పగా ఎందరో అవుననుకున్నారు. కాని ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆన్‌లైన్‌లో ఇసుక అందరికీ కాదు.. కావాల్సిన వారికేనని తెలుస్తోంది. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

వైసీపీ ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన ఇసుక నూతన విధానంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ని తీసుకొచ్చింది. ఇది సామాన్యులకు కష్టాలు తేగా అక్రమార్కులకు వరంగా మారింది. అక్రమార్కులు ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభం అవుతూనే బోగస్‌ ఫొటోలు, ఆధార్‌ నెంబర్లు అప్‌లోడింగ్‌ చేసి బుకింగ్‌ చేసేస్తోన్నారు. ఈ కారణంగా ఎన్నిసార్లు సామాన్యులు వారి సెల్‌ఫోన్ల నుంచి ప్రయత్నించినా బుకింగ్‌ కావడం లేదు.   ఎక్కడికక్కడ ఇసుక డంపింగ్‌యార్డులతో ప్రజలకు ఇసుక కొరత తీరుస్తుందని అందరూ భావించారు. 


కానీ ఇసుక దొరకడమేమో కానీ బుకింగ్‌ నమోదుకే నానా యాతనలు పడాల్సి వస్తుంది. సగంలో నిలిచిన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిర్మాణదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావడంలేదు. జిల్లాలో ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం రోజుల తరబడి నిరీక్షించినా ఫలితం కనబడటం లేదు. ఇసుక  ఆన్‌లైన్‌లో దొరక్క నిర్మాణాలు ఎలా కొనసాగించాలో అర్థంకాక వందలాది మంది నిర్మాణదారులు తలలు పట్టుకుంటున్నారు.


కొన్ని వందల అపార్టుమెంట్ల పనులు పూర్తిగా  నిలిపివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కృష్ణానది సమీపంలోని దాచేపల్లి, మాచవరం, గురజాల, అమరావతి,  మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం ఇసుక అందని పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు కూడా ఇసుక డెలివరీ కాక నిర్మాణాలను ఎక్కడికెక్కడ నిలిపివేసుకుంటున్నారు. గత పది నెలల నుంచి భవన నిర్మాణాలు చేపట్టేవారికి ఇసుక బంగారంలా తయారైంది.


వందలాది మంది నిర్మాణదారులు ఇసుక కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎంత కష్టపడినా బొచ్చ ఇసుక కోసం కళ్లు కాయలు కాసేలా తిరగాల్సి వస్తుంది. వేసవికాలం కాస్తా అయిపోతున్నది. ఇక వర్షం వస్తే నిర్మాణాలు చేపట్టలేమంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు. యార్డులో ఉన్న ఇసుక నిల్వలకు, ఆన్‌లైన్లో చూపుతున్న నిల్వలకు ఏ మాత్రం పొంతన ఉండటంలేదు.  


బాపట్ల వ్యవసాయమార్కెటింగ్‌యార్డు ఆవరణంలో స్టాక్‌పాయింట్‌ ఏర్పాటు చేసిన్పటికి సకాలంలో గృహనిర్మాణదారులకు ఇసుక అందటంలేదు. అపార్ట్‌మెంట్‌లు, రోడ్లనిర్మాణాలకు మాత్రం గుట్టలుగుట్టలుగా ఇసుక వచ్చి పడుతున్నది. స్థానికంగా లభించే ఇసుకను కూడా తెచ్చుకోలేక గృహనిర్మాణాలు ఇబ్బందులు పడుతున్నారు.  


దుర్గి డిపోలో భారీగా ఇసుక ఉన్నప్పటికీ వినియోగదారులకు దక్కడంలేదు. 5 వేల టన్నుల మేర నిల్వలు ఉన్నా పది రోజులుగా బుకింగ్‌లో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సైట్‌ను పరిశీలించగా అప్పటికే 686 టన్నుల ఇసుక అమ్ముడుపోయినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తుండగా 1.45 టన్నులు మాత్రమే ఇసుక లభ్యమయ్యే పరిమాణంలో ఉందని చూపడం వింతగా ఉంది. 


అచ్చంపేట మండలంలో రీచ్‌ల మూతపడ్డాయి.  అప్పుడప్పుడు నరసరావుపేట, పిడుగురాళ్ల ఇసుక డంపింగ్‌ యార్డులు మాత్రం ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. నెల రోజులుగా ఇసుక కోసం సైట్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాలన్నా సర్వర్‌ నెమ్మదిగా కనపడుతుంది. అమరావతి, ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చినప్పటికీ ధర ఎక్కువగా పలుకుతుంది.   


తుళ్లూరు మండలం రాయపూడి, లింగాయపాలెం, వెంకటపాలెంలో ఇసుక ర్యాంపులు ఉన్నా అనుమతులు ఇవ్వలేదు.  


పిడుగురాళ్లలో డంపింగ్‌ యార్డు కేంద్రంగా ఇసుక కావాలని 250 మంది నిర్మాణదారులు ఆన్‌లైన్‌ నమోదు పూర్తై 15రోజులుగా ఇసుక కోసం ఎదురుచూస్తున్నారు.   ప్రస్తుతం 1300 టన్నులకు పైగా డిమాండ్‌ ఉన్నప్పటికీ అచ్చంపేట నుంచి ఇసుక నిలిచిపోయింది. పిడుగురాళ్లలో కొందరువ్యక్తులు ఒక గ్రూప్‌గా ఏర్పడి తమకు చెందిన వారికే, తమ వాహనాల ద్వారానే రవాణా జరిగేలా కథను నడిపిస్తున్నారు. 

Updated Date - 2020-06-06T09:06:46+05:30 IST